బ్లాక్ కాఫీ తాగితే కలిగే అద్భుతమైన లాభాలివే తెలుసా

0

నిత్యం మనలో చాలా మంది కాఫీ, టీలను తెగ తాగేస్తుంటారు. కొందరు కేవలం టీనే ఇష్టపడితే కొందరు మాత్రం కాఫీకే ఓటేస్తారు. ఈ క్రమంలో ఈ రెండింటి వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలిగినా ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. అయితే అసలు బ్లాక్ కాఫీని ఎలా తయారుచేసుకోవాలో దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక కప్పు నీటిని ఒక పాత్రలో తీసుకుని బాగా మరిగించాలి. మరుగుతున్న నీటిలో ఒక టీస్పూన్ కాఫీ పొడి వేయాలి. అనంతరం మళ్లీ 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత వచ్చే ద్రవాన్ని చల్లార్చాలి. అనంతరం దాన్ని వడకడితే బ్లాక్ కాఫీ తయారవుతుంది. దాన్ని అలాగే తాగేయాలి. చక్కెర కలపకూడదు.

1. రోజుకు 2, 3 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే దెమెంతియా, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మెదడు చురుగ్గా మారుతుంది. యాక్టివ్‌గా పనులు చేయగలుగుతారు.

2. జిమ్‌లలో వర్కవుట్స్ చేసే వారికి బ్లాక్ కాఫీ మంచి శక్తినిస్తుంది. బ్లాక్ కాఫీ వల్ల రక్తంలోకి అడ్రినలిన్ విడుదలవుతుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. అధిక శక్తినిస్తుంది. దీంతో చురుగ్గా వ్యాయామం చేయగలుగుతారు. ఎలాంటి అలసట ఉండదు.

3. మన శరీరంలో ఉండే అతి పెద్ద అవయవం లివర్. ఇది 500కు పైగా ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. అయితే బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే లివర్‌లో ఉన్న కొవ్వు కరుగుతుంది. రోజుకు 4 కప్పుల బ్లాక్ కాఫీ తాగితే లివర్ సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరంలో ఉన్న హానికర ఎంజైమ్‌లను తొలగించడంలోనూ బ్లాక్ కాఫీ మెరుగ్గా పనిచేస్తుంది.

4. నిత్యం బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీర మెటబాలిజం 50 శాతం వరకు పెరుగుతుంది. దీంతో శరీరంలో కొవ్వు త్వరగా కరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు.

5. నిత్యం 2 కప్పుల కన్నా ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారిలో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.

6. నిత్యం మనకు వివిధ సందర్భాల్లో ఒత్తిడి, మానసిక ఆందోళన ఎదురవడం సహజమే. ఇవి తగ్గాలంటే రోజూ బ్లాక్ కాఫీ తాగాలి. దీని వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. స్ట్రెస్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

7. బ్లాక్ కాఫీని నిత్యం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here