క్షీణిస్తున్న హజారే ఆరోగ్యం

0

అహ్మదన్‌నగర్‌ : లోక్‌పాల్‌, లోకాయు క్తలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే

దీక్షకు దిగడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. హజారే బిపి, షుగర్‌ లెవల్స్‌ లో తేడా నమోదవుతోందని వైద్యులు తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన హావిూని నిలబెట్టుకోకపోతే.. తనకిచ్చిన పద్మభూషణ్‌ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని సామాజికవేత్త అన్నా హజారే ప్రకటించారు. అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగావ్‌ సిద్ధి గ్రామంలో ఆయన దీక్షకు దిగారు. గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకుగాను హజారే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి హజారే చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992 లో అన్నా హజారేకు పద్మ భూషణ్‌ అవార్డు లభించింది.

హజారే ప్రాణాలను కాపాడండి

లోక్‌పాల్‌, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తన సొంత గ్రామం రాలేగావ్‌ సిద్ధిలో నిరాహార దీక్షకు దిగిన సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే దీక్ష సోమవారంతో ఆరవ రోజుకు చేరింది. కాగా దీక్షను విరమింపజేసేలా కేంద్రం నుంచి ఎలాంటి ప్రయత్నం జరగకపోవటంతో శివసేన పార్టీ మండిపడింది. ఆయన ప్రాణాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. తమ పార్టీ పత్రిక సామ్నాలో ఓ కథనాన్ని ప్రచురించింది. ‘మొదట అన్నాహజారే ప్రాణాలను కాపాడండి.. ఆ తర్వాతే ఇతర విషయాల గురించి ఆలోచించండి. ఈ పోరాటంలో ఆయన ప్రాణాలు పోవాలనే ప్రభుత్వం భావిస్తే, మన సంస్కృతి వ్యాధిగ్రస్తమైందని భావించాలని పేర్కొంది. ఆయన లోక్‌పాల్‌, లోకాయుక్తా, రైతుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్నారు. ప్రధానమంత్రి నుంచి ఆయనకు ఓ లేఖ వచ్చింది. ఆయన అమరుడయ్యేవరకు దీక్ష కొనసాగించాలని తాము కోరుకుంటున్నట్లుగా అందులో ఉందని పేర్కొంది. హజారే దీక్షకు విూడియా ద్వారా ప్రచారం జరగకుండా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని శివసేన ఆరోపించింది. గతంలోలా హజారే దీక్షపై ప్రచారం జరిగితే, దేశ వ్యాప్తంగా ప్రజల్లో కదలికలు వచ్చేవి. ఆయన దీక్షపై ప్రచారం జరగకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఇదిలా ఉంటే అన్నాహజారేను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్‌ సోమవారం కలిశారు. ఆయన పోరాటానికి తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని, నిరుపయోగ భాజపా ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవట్లేదని ఠాక్రే అన్నారు. హజారే ప్రాణాన్ని త్యాగం చేయొద్దని, దీక్ష విరమించి తమతో కలిసి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలని భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ ఎన్నికల మేనిఫెస్టోను కూడా అమలు చేయట్లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు హజారేపై నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారని, ఆయన చాలా నిజాయతీ పరుడని, ఉన్నత విలువలు గల వ్యక్తని అన్నారు. ఆయన ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లయినప్పటికీ ఇప్పటికీ హజారే డిమాండ్‌లను నెరవేర్చలేదని అన్నారు. హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే భాజపా 2014 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిందని, మరోవైపు ఆయన దీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ మద్దతు తెలపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. హజారే వల్లే కేజీవ్రాల్‌ ఎవరో దేశానికి తెలిసిందని, ఆయన కనీసం ఇక్కడకు వచ్చి హజారే ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకోవట్లేదని ఆయన విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here