Featuredజాతీయ వార్తలు

హర హర మహాదేవ శంభోశంకర..!

వేదాలు.. ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యమైనవి. వీటిలో ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. శివస్వరూపం అత్యంత మంగళకరమైనది. పరమశివుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు.. కోరిన కోరికలు తీరుస్తాడు. తను ఇబ్బందులు ఎదుర్కొంటానని తెలిసినా దానవుల అసంబద్ధమైన కోరికలను తీర్చిన భోలా శంకరుడాయన. గరళాన్ని కంఠంలో ఉంచుకొని నీల కంఠుడయ్యాడు. కానీ అదే శివుడికి కోపం వస్తే విలయమే. అందుకే ఆ పరమేశ్వరుణ్ని ప్రళయకారుడిగా భావిస్తారు. మహాశివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే వినాశనం తప్పదని నమ్ముతారు. శివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే.. ఆ కోపాగ్నికి లోకం భస్మం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌ : శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. రాత్రి ‘చీకటి’ అజ్ఞానానికి సంకేతం కదా, మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవు తుంది. మహా శివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి. ఓంకారం ఆది ప్రణవనాదం.. వేదాలన్నింటకీ తాత్పర్యం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీసి పలికితే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు… ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. అందుకే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోను శివుడు ఉన్నాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హులే. పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైన తిథి ఏకాదశి. ఇది నెలలో రెండుసార్లు వస్తుంది. ఒకసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతీ అడిగిన సందర్భంలో.. శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఏవిూ చేయకుండా ఆ రోజు ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం.. పగలంతా నియమనిష్ఠతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, నేయి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మర్నాడు బ్రహ్మ విధులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తిచేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని పరమశివుడు తెలిపాడు. సాధారణంగా ప్రతి మాసంలోని కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేక మహత్తు ఉంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థం చాల మందికి తెలియదు. ‘రా’ అన్నది దానార్థక ధాతు నుంచి ‘రాత్రి’ అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేదంలోని రాత్రి సూక్తం యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పారు.. హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!? వగైరా ‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్‌! ఉష ఋణేవ యాతయ|’

మహాశివరాత్రి.. పూజా విధానం, నియమాలు

శివరాత్రి జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో ఉంది. త్రయోదశి రోజునే శివ సన్మానం గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధరించుకుని పాటించాలి. ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, ¬మాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండో రోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!’ అని సంకల్పం చేసుకోవాలి. వ్రతం ఆరంభించిన తర్వాత గురువు దగ్గరికి వెళ్లి, పంచామృతాలు, పంచగవ్యాలతో ( ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యి) శివుడికి అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూ అభిషేకం నిర్వహించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో శివుడ్ని పూజించి, అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఈ ¬మం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. శివకథలు వింటూ మరొకసారి రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. ‘పరమాత్మా! విూ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను. హే లోకేశ్వరా! శివ, భవా! నన్ను క్షమించు… ఈ రోజు నేను ఆర్జించిన పుణ్యమంతా, విూకు అర్పించినదంతా విూ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! విూ నివాసానికి వెళ్లండి. విూ దర్శనమాత్రం చేతనే మేము పవిత్రులమయ్యాం’ అని వేడుకోవాలి. మర్నాడు శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే… ప్రతి క్షణం శివస్మరణ యోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు అత్యంత ప్రీతికరం. అందుకే ఆ రోజున మహా శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు. మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. అలా కాకపోతే, ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మర్నాడు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలని వ్రత విధానన్ని పార్వతికి ఆదిదేవుడు బోధించాడు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close