Featuredప్రాంతీయ వార్తలు

గల్లా గుల్లా.. కాసులు కల్లా

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

‘ఖజానా’ ఖాళీ… అయిందన ప్రభుత్వ పె(గ)ద్దలకు స్పష్టంగా తెలుసు. ఆ విషయం ప్రజలకు ‘మార్చి’ వస్తే… వచ్చే అసెంబ్లీలో బడ్జెట్‌ వెల్లడైతే.. ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేదని లెక్కలు రాని వాడికి సైతం తెలిసిపోతుంది. ఏం చేయాలి…? వారికి మధ్యతర మంత్రం ఏకైక మార్గమైంది. కానీ నేటికీ ఏ వేదికపైనా పాలకులు అప్పు గురించి మాట్లాడక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది ఈ అప్పుల వ్యవహారం నెమ్మదిగా నడిచింది. అ ఆ తరువాత మూడేళ్లకే ఈ అప్పు రెట్టింపు అయిం ది. దీనికి తోడుగా రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ‘చిద్రమైన తెలంగాణ బతుకుచిత్రం’ తేటతెల్లంగా వెల్లడించింది.

ఇదీ కథ..: 2014 వరకు తెలంగాణ అప్పులు 72వేల కోట్లు. ఇంకా నిఖార్సయిన బాషలో బుక్‌ ఎడ్జస్ట్‌ మెంటు రూపంలో మిగులు బడ్జెట్‌ అనే చెప్పాలి. 2014 నుండి 2018 మార్చి వరకు తెలంగాణ మొత్తం అప్పులు రూ.1,67,091కోట్లు.. అంటే 67 సంవత్సరాలలో సుమారు 13 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ నెత్తిన 72వేల కోట్లు అప్పులు మోపితే…తెలంగాణ సర్కార్‌ నాలుగు ఏండ్లలో 1లక్షా 42 వేల కోట్లకు పైగా అప్పులు మోపారు. అంటే వచ్చే మార్చి నాటకి…ఈ సొమ్ముకు వడ్డీనెలకు 1400 కోట్లు కూడా కలిపితే… రెండు లక్షల కోట్లకు చేరుతోంది. రాబోయే ఐదు ఏడ్లలో బీహార్‌, ఒరిస్సా కంటే తెలంగాణ పరిస్థితి అద్వాన్నం అయ్యే అవకాశాల పట్ల ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ సత్యం: రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం నెలకు రూ. 10,500 వేల కోట్లు ఉంటుంది. ఎంత అప్పు చేశాం..? ఎవరి దగ్గర అప్పు చేశాం..? తదితర వివరాలు రిజర్వ్‌ బ్యాంకు దగ్గర ఉంటుంది. 23 జిల్లాలున్న సమయంలో పది సంవత్సరాల మూలధన వ్యయం 1, 29,683 కోట్లు. ఇందులో జనాభా ప్రకారం రూ. 54వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1,24,966 కోట్లు మూలధనం సాధించింది. 10 ఏండ్ల తర్వాత చేపట్టవలసిన మిషన్‌ భగీరథను ఇప్పుడే చేపట్టి 65 వేల కోట్లు చేయడం విడ్డూరమే.

తెలంగాణ అప్పు 2.21 లక్షల కోట్లు! : తెలంగాణ రుణ ప్రస్థానం భారీ బడ్జెట్‌తోపాటే ఉరకలేస్తోంది. వచ్చే ఏడాదికి అప్పు ఏకంగా రూ.2.21 లక్షల కోట్లు దాటనుంది. 2018?19 ఆర్థిక సంవత్సరానికి అప్పుల మొత్తం రూ.1,80,238 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.1,51,133 కోట్ల అప్పులు చేసినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఇప్పటికే మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్పొరేషన్ల పేరిట మరో రూ.41,538 కోట్ల అప్పు చేసినట్లుగా వెల్లడించింది. వెరసి మొత్తం అప్పు రూ.2.21 లక్షల కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. వీటికి తోడు సాగునీటి ప్రాజెక్టుల రుణ సవిూకరణకు తెలంగాణ నీటిపారుదల కార్పొరేషన్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దాదాపు రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేసింది.

ని’బంధనాలు’..:

సాధారణంగా కేంద్రం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రాలు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.25 శాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు కేంద్రం 3.50 శాతం వరకు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23 వేల కోట్ల మేర అప్పు తీసుకున్న ప్రభుత్వం వచ్చే ఏడాది రూ.29 వేల అప్పులు తీసుకోనుంది. అంతమేరకు జీఎస్‌డీపీలో 3.45 శాతం ద్రవ్యలోటును బడ్జెట్‌లో ప్రస్తావించింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్‌డీపీలో 25 శాతం మించకూడదని, అంతకు మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో చేరి పోయే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు జీఎస్‌డీపీలో 21.39 శాతానికి చేరనున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ.70 వేల కోట్లు. గడిచిన నాలుగేళ్లలో ఈ అప్పు అంతకంతకు పెరిగిపోయింది.

వడ్డీలకే 13 వేల కోట్లు!:

చేసిన అప్పులు తిరిగి చెల్లించటం రాష్ట్ర ఖజానాకు భారంగా మారింది. 2016?17లో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,609 కోట్ల వడ్డీలు చెల్లించినట్లు ‘కాగ్‌’ తన గణాంకాల్లో ధ్రువీకరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపరిచింది. అలాగే 2017?18లో వడ్డీల చెల్లింపులకు రూ.1,1138 కోట్లు వెచ్చింది. సవరణ బడ్జెట్‌లోనూ ఇవే గణాంకాలు స్పష్టంగా ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వడ్డీల భారం రూ.1,1691 కోట్లకు చేరుతుంది. దాదాపు రూ.29 వేల కోట్ల అప్పులను అంచనా వేసిన ప్రభుత్వం.. వడ్డీల లెక్కలను మాత్రం తక్కువ చేసి చూపినట్లు స్పష్టం అవుతోంది. సగటున ప్రతి తెలంగాణ పౌరుడి నెత్తిన 65వేల అప్పునట్లు ఆర్థిక నిపుణుల అంచనా.

రిజర్వ్‌ బ్యాంక్‌ నివేదికలో..:

బడ్జెట్ల అధ్యయనం పేరిట ఆర్బీఐ విడుదలచేసిన నివేదికలో పలు సంచలన విషయాలున్నాయి.

2016-17 ఆర్థిక సంవత్సరంలో స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 12.7% గా ఉన్న రుణం 2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి 22.2%కి పెరిగిపోయింది. ఇలా స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో రుణాల శాతం పెరగడం అసమర్థ ఆర్ధిక నిర్వహణకు నిదర్శనమని ఆర్బీఐ చీవాట్లు పెడుతోంది. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం లెక్కల మేరకు తెలంగాణ అప్పు 2.2లక్షల కోట్లుగా ఉంది.

ఇక్కడ కొస మెరుపు ఏమిటంటే ఈ అప్పులో ఎక్కువ శాతం అభివృద్ధి పనుల కోసం కాకుండా ప్రభుత్వ పాలనకు ఖర్చు అయిన శాతం ఎక్కువగా ఉంది. అనగా నాయకుల ఖర్చులు, ఇతర ముఖ్య పరిపాలన శాఖల నిర్వాణ కోసమే తెలంగాణ ఎక్కువ అప్పులు చేసిందని అర్థం. దీన్నిబట్టి తొలి తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో విచ్చలవిడి ఖర్చులకు పాల్పడిందనేది స్పష్టమవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close