పోలవరం నిర్మాణంలో గిన్నిస్‌ రికార్డ్‌

0

పోలవరం (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల్లో ప్రపంచ రికార్డును సృష్టించింది. కాంక్రీట్‌ పనుల్లో శరవేగంగా దూసుకెళుతూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు సంపాదించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కాంక్రీటు పనులు సోమవారం ఉదయం 8 గంటల వరకూ నిర్విరామంగా సాగింది. సోమవారం ఉదయం 8గంటలకు 32,100 క్యూబిక్‌ విూటర్ల కాంక్రీటు పనులు పూర్తి చేసి గిన్నీస్‌ రికార్డును అందుకున్నారు. ఎముకలు కొరికే చలికి ఏమాత్రం చలించకుండా కార్మికులు విరామం లేకుండా విధుల్లో పాల్గొన్నారు. గంటకు సగటున 1300క్యూబిక్‌ విూటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్‌ చేసి అరుదైన ఘనత సాధించారు. ఫ్లడ్‌లైట్‌ వెలుగుల్లోనూ పనులు సాగించారు. 24 మంది ఇంజినీర్ల పర్యవేక్షణలో దాదాపు 4 వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పనులు ప్రారంభం కాగా.. తొలిగంటకు 1,275 క్యూబిక్‌ విూటర్ల కాంక్రీటు వేశారు. పోలవరంలో రికార్డు కాంక్రీటు పనులు డిసెంబరు 17నే చేపట్టాలని నవయుగ నిర్మాణ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పెథాయ్‌ తుపాను కారణంగా దీన్ని వాయిదా వేశారు. నిత్యం జరిగే 15వేల క్యూబిక్‌ విూటర్ల కాంక్రీటు పనులు యథావిధిగా సాగిస్తున్నారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌ అధికారులు ఆదివారం సమయం ఇవ్వడంతో నవయుగ సంస్థ, ప్రాజెక్టు అధికారులు అదనపు కాంక్రీటు పనులకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ప్రకటించినట్లు ఆదివారం ఉదయం 8గంటలకే పనులను ప్రారంభించారు. మొదటి గంట కాస్త తక్కువగా వేసినా తర్వాత నుంచి వేగం అందుకొని 1300 క్యూబిక్‌ విూటర్ల పైబడి కాంక్రీటు వేశారు. గిన్నీస్‌ రికార్డు పనులకు సంబంధించి సామగ్రిని ముందుగానే సిద్ధం చేశారు. ఏడు వేల టన్నుల సిమెంటు, 22వేల టన్నుల ఇసుక, 36వేల టన్నుల కంకర అందుబాటులో ఉంచారు. పది బ్లాచింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి కాంక్రీటును కలిపారు. 71ట్రాన్సిట్‌ మిక్సర్లతో కాంక్రీట్‌ను బ్లాకుల వద్దకు తెచ్చివేశారు. ఈ పనులను డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ ఛైర్మన్‌ ఏబీ పాండ్య పరిశీలించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నవయుగ నిర్మాణ సంస్థ ఎండీ కె.శ్రీధర్‌ ఎప్పటికప్పుడు సిబ్బందితో సవిూక్షించారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డ్సుకు సంబంధించి 24 మంది ఇంజినీర్లతో కూడిన బృందం పనులను పరిశీలించింది. ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు సైతం అదివారం రాత్రి పోలవరంలో బసచేసి కాంక్రీటు పనులను పర్యవేక్షించారు.

పోలవరం సరికొత్త రికార్డు..

2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 క్యూబిక్‌ విూటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డులను పోలవరం తాజాగా అధిగమిచింది. పోలవరం ప్రాజెక్ట్‌ ఈ రికార్డును సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. నవయుగ సంస్థ ఎండీ శ్రీధర్‌కు ఆదివారం రాత్రి ఫోన్‌ చేసి అభినందించారు. వేల మంది ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు రాత్రింబవళ్లూ చెమటోడుస్తున్నారని, పోలవరం పనుల్లో పాల్గొన్నవారంతా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. 

సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల చేతుల విూదుగా అధికారికంగా గిన్నిస్‌ రికార్డు పత్రాలను అందుకోనున్నారు.

ఏపీలోనే ఇదొక చారిత్రక ఘట్టం – సీఎం చంద్రబాబు

పోలవరం కాంక్రీట్‌ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించామని సీఎం చంద్రబాబు అన్నారు. జన్మభూమి-మా ఊరుపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలవరం కాంక్రీట్‌ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడం ఇదొక చారిత్రక ఘట్టమని చెప్పారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నామని వివరించారు. అర్ధరాత్రికే 21వేల క్యూబిక్‌ విూటర్ల కాంక్రీట్‌ వేసినట్లు తెలిపారు. 24గంటల్లో 28వేల క్యూ.విూల కాంక్రీట్‌ పనులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కానీ ఇప్పటికే 31వేల క్యూ.విూటర్లకు చేరుకున్నామని వెల్లడించారు. ఉయదం10 గంటలకల్లా 35వేల క్యూ.విూ కాంక్రీట్‌ వేసే అవకాశం ఉందన్నారు. రికార్డు సాధించడంలో చెమటోడ్చిన అందరికీ సీఎం అభినందనలు తెలిపారు. వేలాది కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది కష్టానికి ఫలితం దక్కిందని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నందుకు సీబీఐపీ అవార్డు సాధించామని స్పష్టంచేశారు. ఆ అవార్డు అందుకున్న నాలుగు రోజులకే మరో రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. ఇది నిజంగా ప్రతి తెలుగువాడికి గర్వకారణమని చంద్రబాబు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here