Featuredప్రాంతీయ వార్తలు

మహా మలుపు

  • శిసేనకు 17 మంది ఎమ్మెల్యేల షాక్‌
  • ఎన్సీపి, కాంగ్రెస్‌తో శివసేన జతకట్టడంపై అభ్యంతరం

ముంబయి

మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. అంచనాలకు అందకుండా రాజకీయాలు రసవత్తరంగా తయారయ్యాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్న శివసేనకు బుధవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు గట్టి షాక్‌ ఇచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు గళమెత్తారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ కానున్నారు. మరోవైపు శివసేన సారథ్యంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోగా రైతుల సమస్యలపైనే తాను ప్రధానిని కలిశానని పవార్‌ వెల్లడించారు. మహారాష్ట్ర రాజకీయాలు తమ భేటీలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య సంప్రదింపులు కొలిక్కిరాని క్రమంలో సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపిస్తుండటం శివసేనకు ఇబ్బందికరంగా మారింది. ఇక బీజేపీ సైతం శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లతో పాటు తమతో కలిసివచ్చే ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ ప్రభుత్వ ఏర్పాటుకు తమ ముందున్న అవకాశాలపై ఆరా తీస్తోంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఎన్నికల ముందు బీజేపీ, శివసేన ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఇరు పార్టీలు సీఎం పీఠాన్ని చెరో సగం కాలవ్యవధి(50-50) నిర్ణయంతో పోటీలో నిలిచాయి. ఎన్నికల్లో ఇరుపార్టీలకు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తీరా సీఎం పీఠంపై చర్చ జరగగా.. అందుకు బీజేపీ ఒప్పుకోలేదు. దీంతో, శివసేన.. బీజేపీ నుంచి దూరమైంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదిపింది. అందుకు గాను గవర్నర్‌ తక్కువ కాల పరిమితి ఇవ్వడంతో ఇరుపార్టీల చర్చలు కొలిక్కి రాకముందే, వారి నిర్ణయాన్ని ప్రకటించకముందే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం, కేబినెట్‌ ఈ అంశాన్ని ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడం చకాచకా జరిగిపోయాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు. మరోవైపు ఎన్సీపీ కాంగ్రెస్‌తో చర్చలు జరిపినా ఏ అంశం కొలిక్కి రాలేదు. కాగా, తాజాగా శివసేనకు సంబంధించిన 17 ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు ప్రకటించారు. దీంతో, అసమ్మతి ఎమ్మెల్యేలు శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాక్రే అపాయింట్‌మెంట్‌ కోరారు. ఇలాంటి కీలక సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, శివసేనకు పెద్ద తలనొప్పిగా మారింది..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close