మహా ఓటమి

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెజస, సిపిఐ పార్టీలతో ఏర్పాటైన మహాకూటమికి మహా ఓటిమి మిగిలింది. గులాబీనేత దెబ్బకి కూటమి కకావికలం అయింది. నేతలు కలిసినా.. ఓటర్లు కలవలేదు!: కేసీఆర్‌ దూకుడు ముందు ప్రతిపక్షాలు కకావికలమై పోయాయి. కాంగ్రెస్‌, తెదేపా, తెజస, సీపీఐలు కలిసి ఏర్పాటు చేసిన ప్రజాకూటమి కూడా తెరాస విజయాన్ని నిలువరించలేక చతికలపడింది. సరైన వ్యూహం లేకుండా ఎన్నికల్లోకి వెళ్లడం కూడా కూటమి వైఫల్యానికి కారణమైంది. బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న కాంగ్రెస్‌, తెదేపాల మధ్య ఓట్ల బదలాయింపులో ఉన్న లోపాలను ఈ ఫలితాలు బయటపెట్టాయి. వేగం, సమన్వయం విజయవ కాశాలను శాసిస్తాయని ఈ ఎన్నికల తీర్పుతో ప్రతిపక్షాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మీ నేత ఎవరు..?: అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ణయిస్తారన్న ప్రాథమిక విషయాన్ని కూటమి పక్షాలు విస్మరించాయి. కనీసం ముఖ్య మంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా.. కూటమి బలమైన నేతగా ఎవరో ఒకరు కేసీఆర్‌తో నేరుగా తలబడే ప్రయత్నం కూడా చేయలేదు. ఉత్తమ్‌ కుమా ర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, కోదండరామ్‌, ఎల్‌.రమణ వంటి నేతలు కూటమిలో ఉన్నా ఎవరు కూటమి నేతగా ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో బలమైన కేసీఆర్‌కు పోటీ ఎవరూ అనే అంశానికి ప్రతిపక్షాల వద్ద సమాధానం లేకుండా పోయింది. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పై వ్యతిరేకత ఉన్న చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్‌ తనను చూసి ఓటు వేయమని ప్రజలను కోరారు. ప్రతిపక్షాల నుంచి ఈ విధంగా అడిగే అవకాశమే లేకుండా పోయింది. ప్రజాకూటమిని విమర్శించేందుకు తెరాసకు ఇదో ఆయుధంగా మారింది. ‘పొత్తు’ పొడిచేప్పటికే నష్టం..: సీట్ల పంపిణీ కూడా కూటమి విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. కాంగ్రెస్‌ దాదాపు 15స్థానాల్లో అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. అంతేకాదు తెదేపా, తెజసలు కూడా తమకు కేటాయించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఆలస్యంగానే ప్రకటించాయి. దీంతో వారికి ప్రచార సమయం లేకుడాపోయింది. తెరాస ఒకేసారి దాదాపు 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చి రంగంలోకి దింపింది. ఒక్క కోదాడ, ముషీరా బాద్‌ అభ్యర్థుల విషయంలోనే కొంత జాప్యం జరిగింది. కొంగరకలాన్‌ సభ నిర్వహించే సమయంలోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారని సమాచారం బయటకు వచ్చింది. అది తెలిసి కూడా… అప్పటి నుంచే తమ వనరులను, పొత్తులకు వ్యూహాలను ప్రతిపక్షాలు సిద్ధం చేసు కోలేకపోయాయి. పొత్తుల గొడవతో బాగా నష్టపోతున్నామని తెజస నేత కోదండరామ్‌ చాలా సార్లు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన మాటలే నిజమయ్యాయి. తప్పుడు సంకేతాలు..: తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రొఫెసర్‌ కోదండరాం ఏర్పాటు చేసిన తెజస ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. తెజసకు కేటాయించిన సీట్లలో కూడా రెబల్స్‌ బరిలోకి దిగడంతో కూటమిలో ఐక్యత లేదన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది. తొలుత కోదండరామ్‌ జనగామలో బరిలోకి దిగుతారని ప్రకటించినా.. అక్కడ కాంగ్రెస్‌ నేత పొన్నాల తాను నామినేషన్‌ వేస్తున్నట్లు ముందే ప్రకటించారు. దీంతో మ దుస్వభావిగా, తెలంగాణ వాదిగా పేరున్న కోదండరాం అసలు ఎన్నికల బరి నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. కూటమి ఐక్యతపై ఇది కచ్చితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించింది. కూటమికి ఇంత నష్టం జరిగినా పొన్నాల గెలిస్తే అదొక త ప్తి. సాకారం కాని ఓట్ల బదలాయింపు..: పొత్తుల్లో ఓట్ల బదలాయింపు చాలా కీలకం. తాజా ఫలితాలను చూస్తే కాంగ్రెస్‌, తెదేపా మధ్య ఓట్ల బదలాయింపు జరగలేదని స్పష్టమవుతోంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేర్వేరు పార్టీలకు చీలిపోయింది. దీనికి తోడు భారీగా బరిలోకి దిగిన రెబల్స్‌ విజయావకాశాలను దెబ్బతీశారు. కాంగ్రెస్‌ 19 మందిపై వేటు వేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోపక్క భాజపా, ఎంఐఎంలతో ఎటువంటి పొత్తు లేకుండా తెరాస ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది. ఇది అంతిమంగా తెరాసకు లబ్ధి చేకూర్చింది. మరోపక్క ఎంఐ ఎంకు రాష్ట్రంలో ఉన్న సానుభూతి ఓట్లు మాత్రం నిరాటంకంగా తెరాసకు బదిలీ అయ్యాయి. చేసింది చెప్పుకోలేక.. : ‘తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్‌’ అనే విషయాన్ని ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరోసారి విఫలమైంది. పార్టీ అధినేత రాహుల్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీలు వచ్చి ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ వాదం తలకెత్తుకొన్న బలమైన నేతలు ఎవరూ తెరపైన లేకపోవడం కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చింది. తెలుగుదేశంతో పొత్తు ఉండటంతో ఆ విషయాన్ని బలంగా చెప్పడానికి కూడా కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద్దగా ప్రయత్నించలేదు. కేసీఆర్‌పై విమర్శలకే ఎక్కవుగా పరిమితం అయ్యారు. బోణీ కొట్టని తెజస, సీపీఐ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజాకూటమి వెనకబడింది. మొత్తం 119 స్థానాలకు గాను కూటమి పార్టీలైన కాంగ్రెస్‌ 17 స్థానాల్లో, తెదేపా 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన రెండు పార్టీలైన తెజస, సీపీఐ బోణీ కొట్టలేదు. కనీసం ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలోకి రాలేదు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎల్లారెడ్డి నల్లమడుగు సురేందర్‌ విజయం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here