మారుమోగిన శైవక్షేత్రాలు

0
  • తెలుగు రాష్ట్రాల్లో శివ నామస్మరణ
  • భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు శివుడు.. భోళా శంకరుడు. పత్రం పుష్పం ఫలం తోయం…వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు…జన్మానికో శివరాత్రి అంటారు గానీ, మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహా శివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. మహా శివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల ప్రకారం.. శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని, పూలు, ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందనేది శివ భక్తుల బలమైన విశ్వాసం..

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆ పరమ శివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. పురాణాలలో తెలియజేసిన మహా శివరాత్రిని ఏటా మాఘమాసం కృష్ణపక్ష చతుర్థశినాడు జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. దీంతో ఈ మహాశివరాత్రి పర్వదినాన రోజంతా ఉపవాసం చేసి.. రాత్రి అంతా జాగరణ చేస్తారు భక్తులు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తున్నారు. శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగారం చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అందుచేత ఈ పర్వదినం శివరాత్రిగా పిలవబడుతుంది. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది. పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే విభూతి తయారుచేయటానికి మహా శివరాత్రి పవిత్రమైనదని భావిస్తారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో మహాశివుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నిలయమైన శ్రీశైలంలో శివరాత్రి వేడుకల కోసం ఏర్పాట్లు రెండు రోజుల ముందుగానే పూర్తి అయ్యాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. తెలంగాణలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇరు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. అభిషేక ప్రియుడైన నీలకంఠునికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. రాజమండ్రి, కోటిలింగాలతో పాటు పలు పుష్కరఘాట్‌ల్లో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనం చేసుకుంటున్నారు.

జాగారం ఎలా ప్రారంభమైంది

అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి. ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు. జాగారం ఎందుకు చేస్తారు. జాగారం ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది. క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500?1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది. అయితే, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్‌ ఫ్లడ్‌ వంటి చరిత్రకారుల అంచనా. శివారాధనలో మూర్తి రూపం, లింగరూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని 12 శివుని ప్రసిద్ద ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.

ఉమ్మడి జిల్లాల్లో శివరాత్రి వేడుకలు

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌: మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నల్లమలలో కొలువైన ఉమామహేస్వరం, ఆలంపూర్‌ లోని బాల బ్ర¬్మస్వర స్వామి, రాయికల్‌ రామేశ్వరం, కందూరులోని రామలింగేశ్వర స్వామి ఆలయలాల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉంది.

ఖమ్మం: మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చారిత్రిక స్వయంభూ గుంటుమల్లన్న దేవాలయం తెల్లవారుజాము నుండే శివనామస్మరణతో మార్మోగుతోంది మెదక్‌ జిల్లాలో మహాశివరాత్రి వేడుకను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుఝాము నుంచే భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని ఎంపీ బీబీ పాటిల్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయగర్భగుడిలో శివలింగానికి అభిషేకం నిర్వహించిన ఆయన రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగాలని మొక్కుకున్నారు.

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కమ్మర్‌ పల్లి మండలం ఉప్లూర్‌ లో కొలువైన శ్రీబాలరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున నుంచే భక్తులు పోటెత్తారు.

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం రాజన్నకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అంతకుముందు టీటీడీ అర్చకులు, అధికారులు శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుననారు. క్యూలైన్లలో భారీగా భక్తులు వేచి ఉన్నారు.

వరంగల్‌: మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా శివాలయాలన్ని ఓం నమశ్సివాయ భక్తినామస్మరణతో భక్తులు పునీతులవుతున్నారు. వరంగల్‌ జిల్లాలోని శైవక్షేత్రాలన్ని భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

కడప: మహా శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని కడప జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని మృత్యుంజయకుంట శివాలయం, పొలతల, నిత్యపూజకోన, హత్యరాల పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది శివాలయాలు భక్తజనసంద్రంగా మారాయి.

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాకినాడ రామారావుపేటలోని అన్నపూర్ణ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

నెల్లూరు: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. నెల్లూరులోని శ్రీభువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వర స్వామి సంగమేశ్వరాలయం, రామతీర్ధం, కోటి తీర్ధం, గండవరం, చిరమన, ఘటన సిద్ధేశ్వరం, సిద్ధుల కోన ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు.

కర్నూలు: మహాశివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లాలో శివ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. అన్ని దారులు శ్రీశైలం వైపే చూపిస్తున్నాయి. శ్రీశైలం మల్లిఖార్జునుడిని దర్శించుకునేందుకు భక్తులు శివ ఆలయాల వద్ద బారులు తీరారు.

శ్రీకాకుళం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని శైవక్షేత్రాల్లో పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో కిక్కిరిసిన ఉమారుద్రకోటేశ్వరాలయం.

చిత్తూరు : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తజనంతో నిండిపోయాయి. హరనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీకాళహస్తి, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం, పల్లి కొండేశ్వరుని ఆలయం, మొగిలేశ్వరుని ఆలయం, సురుటుపల్లి శివాలయాలలో తెల్లవారు ఝామునుంచే భక్తుల బారులు తీరారు. శ్రీకాళహస్తిలో మహాలఘు దర్శనం ప్రవేశపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here