మోదీ సర్కార్‌కు షాక్‌..

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మోదీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల సీబీఐ చీఫ్‌ అలోక్‌వర్మను ఆ పదవి నుంచి తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రింకోర్టు తప్పుబట్టింది. అంతేకాకుండా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) చీఫ్‌గా అలోక్‌ వర్మను తిరిగి నియమిస్తూ మంగళవారం సుప్రీం సంచలన తీర్పును వెలువరించింది. అలోక్‌వర్మను బలవంతంగా సెలవుపై పంపలేమని, ఆయననే సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ అని, స్వేచ్చగా నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉన్నందున రాజకీయ పక్షాలు జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇటీవల సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా మధ్య గొడవ జరగడంతో.. కేంద్ర ప్రభుత్వం వర్మను సెలవుపై పంపిన విషయం తెలిసిందే. దాన్ని సవాల్‌ చేస్తూ అలోక్‌ వర్మ .. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గంగోయ్‌ మంగళవారం సెలవు తీసుకోవడంతో.. ఆ తీర్పును జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ వినిపించారు. కోర్టు నెంబర్‌ 12లో తీర్పును వెలువరించారు. అయితే బాధ్యతలు చేపట్టినా.. అలోక్‌ వర్మ కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోకూడదని కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది. సీబీఐ చీఫ్‌ను నియమించే ప్యానల్‌ మాత్రం అతనిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం తెలిపింది. వర్మ, ఆస్థానాలపై అవినీతి ఆరోపణలు రావడంతో వివాదం ముదిరింది. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. వర్మను సెలవుపై పంపిన విషయం తెలిసిందే. సీబీఐ డైరక్టర్‌ రోల్‌మాడల్‌గా ఉండాలని సుప్రీం సూచించింది. సీబీఐ స్వయంప్రత్తిని కాపాడడమే ముఖ్యమన్నారు. ఏదేమైనా అలోక్‌ వర్మ.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రిటైరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అవినీతి ఆరోపణలు రావడంతో.. సీబీఐ చీఫ్‌గా ఆస్థానాకు అవకాశాలు సన్నగిల్లాయి. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై రైల్వే కుంభకోణం విచారణలో అవినీతి జరిగిందని డైరక్టర్‌ అలోక్‌ వర్మపై వీసీకి రాకేశ్‌ ఆస్థానా ఫిర్యాదు చేశారు. దాంతో వివాదం తారాస్థాయికి చేరుకున్నది. అలోక్‌ వర్మ కేసులో.. కేంద్ర ప్రభుత్వ నియామాలను ఉల్లంఘించిందని కోర్టు అభిప్రాయపడింది. వర్మ అంశాన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపించాల్సి ఉందని పేర్కొన్నది. చీఫ్‌ జస్టిస్‌, ప్రధానితో పాటు ప్రతిపక్షనేతకు ఆ అంశాన్ని చేరవేయాలని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీం తన తీర్పులో అభిప్రాయపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here