బంగారు తెలంగాణే లక్ష్యం

0
  • వనరుల వినియోగంలో రాష్ట్రాలకు వాటా ఉండాలి
  • సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రాలకు వదిలేయాలి
  • స్థానిక సంస్థలకు నిధులు పెంపు జరగాలి
  • 15వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌ : వనరుల వినియోగం రాష్ట్రాలకు అనుకూలంగా ఉండేలా విధానాలు రూపొందించాలని 15వ ఆర్థిక సంఘాన్ని సిఎం కెసిఆర్‌ కోరారు. అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించుకునే పరిపక్వత రాష్ట్రాలకు వచ్చిందన్నారు. కేంద్రం కంటే రాష్ట్రాల ఆర్థిక విధానాలే బాగున్నాయన్నారు. నగరంలోని జూబ్లీహాల్‌లో 15వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం కేసీఆర్‌ మంగళవారం భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అవసరాలను సీఎం ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. గతంలో గుజరాత్‌, కేరళ రాష్ట్రాలు అభివృద్ధి నమూనాలుగా ఉండేవని.. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనా ప్రాధాన్యం సంతరించు కుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రజల ఆశయాలు నెరవేర్చే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నట్లు తెలిపారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం కొత్త పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. రాష్ట్రాల సంబంధిత అంశాల్లో కేంద్ర వ్యయం 14 నుంచి 20 శాతానికి పెరిగింది. పెరుగుతున్న ఈ వ్యయానికి బదులు రాష్ట్రాలకు పన్నుల్లో వాటాగా కేంద్రం ఇవ్వొచ్చన్నారు. 50 శాతం ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సమగ్ర అవగాహన అవసరమన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అంశాన్ని కేంద్రం రాష్ట్రాలకు వదిలిపెడితే బాగుంటుందని సీఎం అన్నారు. ఆర్థికంగా సొంత పన్నుల ఆదాయం మెరుగ్గా ఉన్న రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలన్నారు. జీఎస్‌డీపీలో 3 శాతానికి పైగా రుణం తీసుకునే వెసులుబాటు ఉండాలన్నారు. జీఎస్‌డీపీలో ఒకశాతం అదనంగా రుణం తీసుకునే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచాలని కోరారు.

రానున్న ఐదేళ్లలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ. 40,169 కోట్లు అవసరమన్నారు. ఈ మొత్తాన్ని నిర్వహణ వ్యయంగా ఇచ్చేలా ఆర్థిక సంఘం సిఫారసు చేయాలన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు లక్ష్యంగా మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఐదేళ్లలో గ్రావిూణ ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ. 10,142 కోట్లు అవసరం కాగా.. పట్టణ ప్రాంతాల్లో నిర్వహణకు రూ. 2,580 కోట్లు అవసరమన్నారు. మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ. 12,722 కోట్లు గ్రాంటుగా ఇచ్చేలా సిఫారసు చేయాలని సీఎం ఆర్థిక సంఘం సభ్యులను కోరారు. రాష్ట్రంలో పంచాయతీల సంఖ్య 8,368 నుంచి 12,751కి పెరిగింది. పురపాలికల సంఖ్య 74 నుంచి 142కు పెరిగింది. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థలకు నిధులు పెంపు జరగాలన్నారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుట్లు సీఎం తెలిపారు. ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్లకు పైగా వ్యయమౌతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here