Featuredస్టేట్ న్యూస్

కృష్ణాలోకి గోదారి నీళ్లు..!

  • గోదావరి జలాల తరలింపుపై సుదీర్ఘ చర్చలు
  • సాధ్యాసాధ్యాలపై అధికారుల ప్రణాళిక
  • మిగులు జలాలను కృష్ణాకు తరలించేందుకు సుముఖుత
  • తదుపరి సమావేశంలో ముఖ్యమంత్రలకు నివేదిక
  • హైదరాబాద్‌లో ముగిసిన ఇరురాష్ట్రాల అధికారుల భేటీ

హైదరాబాద్‌ :

కృష్ణా నదిలోకి గోదావరి నీటి తరలింపుపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ర ఉన్నతస్థాయి ఇంజినీర్లు చర్చించారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడి జలసౌధలో అధికారులు భేటీ అయ్యారు. కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులకు 1300 టీఎంసీల నీరు అవసరం అని, తెలంగాణకు ప్రతిసారి కృష్ణా నుంచి 500 టీఎంసీల నీరు వస్తోందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ రావు తెలిపారు. సాగర్‌, శ్రీశైలంకు నీటి తరలింపుపై మరో సమావేశంలో చర్చిస్తామన్నారు. సీఎంల భేటీకి ముందు మరోసారి అధికారుల సమావేశం ఉంటుందన్నారు. ఆ సమావేశం తర్వాత సీఎంలకు నివేదిక అందజేస్తామన్నారు. కాగా, ఈ సమావేశంలో గోదావరి నుంచి కృష్ణాకు నీటి తరలింపుపై ప్రాథమికంగా చర్చించామని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలవరం, దుమ్ముగూడెం, ఇంద్రావతి కలిసిన తర్వాత మరోపాయింట్‌ ఉండేలా అంచనాలు రూపొందిస్తామని చెప్పారు. ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరిలో దాదాపు 1000 టీఎంసీల నీళ్లుంటాయన్నారు. ఇద్దరు సీఎంలు రోజుకు 4 టీఎంసీల నీటీని తరలించాలని అనుకున్నారని,

దీనిపై లోతుగా చర్చించామని చెప్పారు. కృష్ణా బేసిన్‌ లో రోజురోజుకు నీటి లభ్యత తగ్గిపోతుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టడంతో ఇన్‌ఫ్లో పడిపోయింది. దీంతో కృష్ణాపై ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో గోదావరి నది నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లను తరలించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన అత్యుత్తమంగా ఉండడంతో ఆదిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా అధికారుల స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇరిగేషన్‌ అధికారులు హైదరాబాద్‌ జలసౌధలో సమావేశమయ్యారు. తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్‌ రావు, వెంకటేశ్వర్‌ రావు, అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహరావు, విశ్రాంత ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌ రెడ్డి, ఓఎస్డీ శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే, ఇరు రాష్టాల్ర ఇంజినీర్లు ఈ మీటింగ్‌ కు హాజరయ్యారు. రెండు రాష్టాల్ర అవసరాలు, నీటి లభ్యతను గుర్తించారు. గోదావరి నుండి ఎంత నీటిని వాడుకోవాలనే అంశంపై సూతప్రాయంగా ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే నీటి తరలింపు, రూట్‌ అలైన్‌ మెంట్‌, తదితర అంశాలపై తదుపరి సమావేశంలో చర్చిస్తారు. ప్రాథమికంగా గోదావరిలో 1000 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని తేల్చారు. మన అవసరాలకు 700 నుంచి 800 టీఎంసీలు అవసరం ఉంటుంది. రెండు రాష్టాల్రకు సుమారు 1300 టీఎంసీల నీళ్లు అవసరం ఉంది. మన రాష్టాన్రికి 500 టీఎంసీల అష్యూర్డ్‌ వాటర్‌ ఉంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌ లో ఉన్న ప్రాజెక్టులకు ఉన్న డిమాండ్లపై చర్చించారు. గోదావరి నీటిని కలిసి ఏవిధంగా వాడుకోవలన్న అంశంపైనే అధికారులు చర్చించారు. గోదావరి నుండి కృష్ణా బేసిన్‌ కు నీటి తరలింపునకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ప్రాథమిక అవసరాలు, నీటిని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై లోతుగా చర్చ జరిగింది. గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌ కు నీటి తరలింపునకు సంబంధించి ఏపీ నుంచి మూడు, నాలుగు ప్రతిపాదనలొచ్చాయి. తెలంగాణ అధికారులు కూడా రెండు రకాల ప్రతిపాదనలు చేశారు. నీటి తరలింపునకు ఉన్న సమస్యలు, ఇబ్బందులు అన్నింటిపై తరువాత సమావేశంలో చర్చించనున్నారు. మొత్తంగా ఇదే అంశంపై ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close