గెలిచే మందుంది.. పగ్గాలు ఇవ్వండి..!

0

అధ్యక్షపదవి రేసులో సంగారెడ్డి ఎమ్మెల్యే

  • అధికారంలోకి వచ్చే దమ్ముంది..
  • గెలిచే ఆయుధాలు ఉన్నాయి..
  • కుంతియాతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్‌ :

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి తాను కూడా పోటీదారునేనని సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డినే కొనసాగించాలన్నారు. ఒకవేళ మార్పు అనివార్యం అయితే తాను కూడా ఆ పదవిని ఆశిస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. టిపిసిసి చీఫ్‌ గా తనను నియమించాలని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జి కుంతియాను కోరినట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. అయితే ప్రస్తుత టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తెచ్చేందుకు తన దగ్గర ఓ మందు ఉందని ఆయన తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కాలని ఆయన కోరారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా కాంగ్రెస్‌ గెలుపునకు పార్టీ నేతలు , కార్యకర్తలు ఏకమై అంకితభావంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎలక్షన్‌, హుజుర్‌ నగర్‌ లో ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కొనసాగించాలని కోరారు. ఒక వేళ పీసీసీ మార్చాలనుకుంటే పార్టీలో సమర్థులు చాలా మంది ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీ అయితే ఒక్కరే హీరో ఉంటారు కానీ.. కాంగ్రెస్‌ లాంటి జాతీయ పార్టీలో చాలామంది హీరోలు ఉంటారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సంపత్‌, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ ఆలీ పోటీలో ఉన్నారని చెప్పారు.

అవకాశం ఉంటే తనకు కూడా పీసీసీ ఇవ్వాలని కుంతియాను కోరినట్టుగా చెప్పారు జగ్గారెడ్డి. తాను ఎవ్వరికీ పోటీ కాదనీ? ఇది తన అభిప్రాయం మాత్రమే అన్నారాయన. ఆర్గనైజేషన్‌ ను కాపాడడానికి పని చేస్తా.. అధికారంలోకి వస్తే కనీసం మంత్రి పదవి కూడా అడగను. పార్టీ బలోపేతం కావాలంటే కేసీఆర్‌ ను బీజేపీని తిట్టాల్సిన అవసరం లేదు. నాకు పీసీసీ ఇవ్వండి నా దగ్గరో మెడిసిన్‌ ఉంది. మొత్తం మార్చుతా పార్టీని అధికారంలోకి తీసుకువస్తా అని జగ్గారెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here