మామూలు ఇచ్చుకో..నచ్చింది చేసుకో..

0

అక్రమంగా కలప రవాణా చేస్తున్నారా… చేసుకోండి.. ఎవ్వరికీ భయపడాల్సిన పనేలేదు.. అమ్యామ్యాలిస్తే అడవంతా మీదే! అడవి సంరక్షణకు అధికారులకు ఎలాంటి సంబంధంలేనట్టే వ్యవహరిస్తారు. మీరే ఏం చేసినా చూడనట్టే ఉంటారు. హరితో శోభతో అలరారే అటవీ భూమిని కబ్జా చేస్తున్నారా…చెట్లు కూల్చేసి పోడుభూమిగా మార్చేస్తున్నారా? మీ ఇష్టం… మిమ్ముల్ని అడిగేనాథుడు ఉండడు. స్మగ్లింగ్‌ యాక్టివిటీ రెచ్చిపోయి జరుగుతున్నా ప్రశ్నించే అధికారి ఆ జిల్లాలో కనిపించడు.. ఏం చేయదలచుకున్నా కేసుల భయం లేకుండా స్వేచ్చగా చేసుకోవచ్చు…భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం రేంజ్‌లో జరుగుతున్న అవినీతి భాగోతాలపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం…

భూపాలపల్లి (ఆదాబ్‌ హైదరాబాద్‌): అడవిని కాపాడుకోవాలి.. పచ్చదనం నిండుగా వికసిస్తూనే వర్షాలు కురుస్తాయి.. వర్షాలు కురిస్తేనే రైతుల పంటలకు కొదువ లేకుండా పల్లెలన్నీ ఆనందంతో వికసిస్తాయి… అందుకు అడవిని కాపాడడం కోసం, అడవిని నుంచి అక్రమంగా తరలుతున్నా సంపదను కాపాడడం కోసం అటవీశాఖ నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాని ఇక్కడ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం పరిధిలో అటవీ రేంజ్‌ అధికారుల పనితీరు అంతా అమ్యామ్యాలకే అలవాటుపడ్డారు. ఏటూరునాగారం అభయారణ్యంగా పేరుపొందిన మంగపేట రేంజ్‌ పరిధిలో అవినీతి అటవీఅధికారుల వల్ల పచ్చదనం అంతా రోజురోజుకు కనుమరుగవుతోంది. మంగపేట మండలం అటవీ కార్యాలయంలో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతుందీ. అభయారణ్యంగా పేరుగాంచిన రేంజ్‌ అంతా మా పరిధిలోనే ఉంటుంది మమ్ముల అడిగేవారు, ప్రశ్నించే వారు ఎవ్వరూ లేరనుకుంటూ ప్రతి పనికి ఒక రేటును నిర్ణయించారు అక్కడి అటవీ అధికారులు. రేంజ్‌ పరిధిలోని అధికారులే మామూళ్లకు అలవాటు పడడంతో అక్కడ అటవీ స్మగ్లింగ్‌ మూడు పువ్వులు, ఆరుకాయలుగా కొనసాగుతుంది. పారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని బిక్షంపేట్‌ గ్రామంలో కొంతమంది స్మగ్లర్లు 19 జిట్రెగీ మొద్దులతో అర్ధరాత్రి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న రేంజ్‌ అధికారులు అర్థరాత్రి దాడిచేసి 19 జిట్రెగీ మొద్దులను పట్టుకొని అక్కడే పంచనామా నిర్వహించి వాటిని అదే ట్రాక్టర్‌లో పారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. అప్పుడే అటవీ అధికారులు కథ ప్రారంభించారు. పట్టుకున్న కర్ర పెద్దఎత్తును ఉండడంతో, కేసులు కూడా బలంగా ఉంటుందని స్మగ్లర్లను బెదిరిస్తూ అటవీ అధికారులు బేరసారాలకు దిగారు. మొత్తం 19 దుంగలలో 6 దుంగలను తాము తీసుకుంటామని, కేసులో మాత్రం 13 దుంగలు పట్టుకున్నట్లుగా పంచనామా మార్చుతామని అప్పుడు కేసు తీవ్రత కూడా తగ్గుతుందని చెప్పడంతో చేసేదేమి లేక కర్ర వ్యాపారులు కూడా మౌనంగా వెళ్లిపోయారు. తర్వాత ఆ నోటా, ఈ నోటా అటవీ అధికారుల అవినీతి బయటికి పొక్కడంతో ఆదాబ్‌, యాక్‌ ప్రతినిధి వెళ్లి పారెస్ట్‌ అధికారులను సంప్రదించగా తాము ఏలాంటి అవినీతికి పాల్పడలేదని, పట్టుకుందీ 13 దుంగలేనని చెప్పారు. అటవీశాఖ పక్కనే ఉన్న ఆరు దుంగలు ఎక్కడివనీ ప్రశ్నించగా అటవీ అధికారులు నీళ్లు నమిలారు. వాటికి మాకు సబంధం లేదని చెప్పగా, అందులో పనిచేసే కింది స్థాయి అధికారులు మాత్రం మొన్న జరిగిన దుంగల దాడిలో దొరికినవని చెప్పడంతో అసలు దొంగలు బయటపడ్డారు. కర్ర వ్యాపారులకు మద్దతు ప్రకటిస్తూ వారు చేసే అవినీతిలో ఇక్కడ అటవీ అధికారులు ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది…

ఈ రేంజ్‌ అధికారులు అవినీతి రారాజులు… మంగపేట రేంజ్‌లో పనిచేస్తున్న అటవీ అధికారులు అంటే అవినీతికి మహరాజులుగా పేరుగాంచారు. మంగపేట మండలం మల్లూరు బీట్‌ పరిధిలో అటవీ పొడు భూములను దున్నుతున్న ట్రాక్టర్‌ను పట్టుకొని మామూళ్లు తీసుకొని వదిలేసినట్లు పక్కా ఆధారాలు ఉన్నా పై అధికారులకు తెలియకుండా ఇక్కడి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మల్లూరుకు చెందిన పిట్టల సారయ్య సుమారు ఐదు ఎకరాలు అటవీ భూమిని అంతా చెట్లను నరికేసి, పోడుభూమిగా మార్చి, యంత్రాలతో దున్నుతుండగా అటవీశాఖ అధికారులు సిబ్బందితో దాడిచేసి ట్రాక్టర్‌ను రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. రేంజ్‌ ఉన్నతాధికారి దృష్టికి విషయం పోవడంతో ఉన్నతాధికారి, బీట్‌ అఫీసర్‌ ఇద్దరూ కలిసి బేరసారాలకు దిగి 30 వేలు డబ్బులు తీసుకుని ఫారెస్ట్‌లోకి మామూలుగా ప్రవేశించింది అని ట్రేస్‌పాస్‌ కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి పోడు దున్నిన ట్రాక్టర్‌ను సీజ్‌ చేయకుండా, కనీసం కేసు నమోదు చేయకుండా వదిలేశారు. అటవీశాఖ చట్టాల ప్రకారం పోడు భూములు దున్నిన వాహనంపై విచారణ జరిపి పంచనామా నిర్వహించి అందుకు తగిన చర్యలు తీసుకుంటారు. కాని అలాంటిదేమి లేకుండా చేతులు దులుపేసుకున్నారు. అదే పక్కన ఉన్న లింగాల రేంజ్‌ పరిధిలో పోడుభూములని దున్నిన ట్రాక్టర్లనీ సీజ్‌ చేసి ఎనిమిది నెలలుగా కార్యాలయంలోనే ఉంచారు. దున్నిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్కడ ఒకలాగ, ఇక్కడ ఒకలాగ చెయ్యడంతో అటవీశాక సిబ్బందే ఆశ్చర్యపోయారు.

ఆ రేంజ్‌లో డబ్బులిస్తే కేసులుండవు..

మంగపేట అటవీ రేంజ్‌ పరిధిలో గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలించినా, అక్కడి నుంచి కర్రను ఇతర ప్రాంతాలకు యధేచ్చగా తీసుకెళ్లినా కేసులు మాత్రం నమోదు కావు. అక్కడి అధికారులు అక్రమ వ్యాపారులకు అండగా ఉంటున్నారు. నీ పని నువ్వు చేసుకో, మాకు రావాల్సిందీ మాకు పంపు అనే ఒప్పందంతో అక్కడ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అక్కడి పోస్టింగ్‌ కోసం లక్షలు చెల్లించి వస్తూ, కోట్లకు పడగలెత్తుతున్నా ఏటూరునాగారం సబ్‌ డివిజన్‌ అధికారులు, భూపాలపల్లి జిల్లా పారెస్ట్‌ అధికారులు వారికేమి పట్టనట్లుగా ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులే అవినీతికి అజ్యం పోస్తుంటే ఇంకా వారిపై చర్యలు ఎవరూ తీసుకుంటారో అర్థమే కావడం లేదు. అటవీశాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి కట్టడి చేయాలంటే ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే అటవీ సంపదను కాపాడిన వారవుతారని, అడవి పచ్చదనంతో బాగుంటేనే అన్ని రంగాలు అభివృద్ది చెందుతాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. అవినీతికి అలవాటు పడ్డ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని పర్యావరణ వేత్తలు అధికారులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here