Uncategorizedస్టేట్ న్యూస్

సేంద్రియ రైతులకు వరాలు

  • సేంద్రియ వ్యవసాయంతోనే ఆరోగ్యానికి రక్ష
  • రసాయనిక ఎరువుల పంటలతోనే క్యాన్సర్‌ జబ్బులు
  • సేంద్రియ వ్యవసాయం..ఉత్పత్తులపై వెబ్‌సైట్‌
  • సిద్దిపేట జిల్లాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట

సేంద్రియ వ్యవసాయంతోనే మనకు ఆరోగ్యమని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఎరువుల వాడకం వల్ల వచ్చే పంటలను తింటూ అనేక రోగాల బారిన పడుతున్నామని అన్నారు. క్యాన్సర్‌వంటి వ్యాధులు పెరుగుతుండటానికి కారణం మనం తీసుకునే కలుషిత ఆహారం నీరు, గాలి కారణమని చెప్పారు. విచ్చల విడిగా రసాయినిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటలు పండించడం వల్ల క్యాన్సర్‌ కేసులు ఎక్కువవుతున్నాయన్నారు. నియోజకవర్గంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల వివరాలు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వెబ్‌సైట్‌,ప్రత్యేక యాప్‌ను మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సేంద్రీయ ఆహార ఉత్పత్తులపై మక్కువ ఏర్పడిందన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో జర్గిన సేంద్రీయ. వ్యవసాయ రైతుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం వెబ్‌సైట్‌ ను ప్రారంభించారు. ఈ వెబ్‌ సైట్‌ ద్వారా సేంద్రీయ ఉత్పత్తులను దేశంలో ఏ మూల నుంచి అయినా కొనవచ్చన్నారు. ఈ వెబ్‌ సైట్‌లో సేంద్రీయ వ్యవసాయం చేసే రైతు వివరాలు, పొలం, ఫోటోలు, పంటవివరాలు, ఫోన్‌ నెంబరు వంటివి ఉంటాయన్నారు. సేంద్రీయ ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేయవచ్చన్నారు. సేంద్రీయ రైతులకు మంచి ధర వచ్చేందుకు, కొనుగోలు దారులకు నిజమైన సేంద్రీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ఈ వేదిక ఉపయోగపడు తుందని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. హైదరాబాదులో ఆర్గానిక్‌ ఉత్పత్తుల పేరుతో ఎరువులు, పురుగు మందులు వాడిన ఆహార ఉత్పత్తులు అమ్ముతున్నారని ఆక్షేపించారు. నిజమైన ఆర్గానిక్‌ ఉత్పత్తులు కావాలనుకునే వారు ఈ వెబ్‌ సైటు నుంచి కొనుగోలుచేయాలని సూచించారు. ఇది తొలి అడుగు మాత్రమే నని, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు పంట మార్పిడి పద్ధతి అవలంబించాలన్నారు. యాభై ఎకరాలకు ఒక క్లస్టర్‌ గా విభజించి సేంద్రీయ వ్యవసాయం చేస్తే వారికి ప్రభుత్వం నుంచి మూడేళ్లపాటు విడతల వారీగా 15 లక్షల రూపాయల సాయం అందిస్తామన్నారు. నాబార్డు ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు, మార్కెటింగ్‌ సదుపాయాలు సమకూర్చుతామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. కార్పొరేట్‌ సంస్థల సాయంతో రైతులకు ఆవులను సమకూర్చుతామన్నారు. అంతర్జాతీయ కంపెనీలు సైతం ఆర్గానిక్‌ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా అనుసంధానిస్తామని మంత్రి చెప్పారు. రైతులు నమ్మకంగా ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తే కొనుగోలుదారులు పొలాల వద్దకే వచ్చి పంటకొనుగోలు చేస్తానని చెప్పారు. వరంగల్‌, సిద్దిపేట రైతు బజారులో సేంద్రీయ ఉత్పత్తులు అమ్మడానికి ఉచితంగా స్టాల్స్‌ ఇస్తామన్నారు. రైతులు ఆర్గానిక్‌ వ్యవసాయం పై దృష్టి సారించాలని చెప్పారు. ఈ సమావేశంలో రైతులకు మంత్రి హరీష్‌ రావు ఆర్గానిక్‌ వ్యవసాయ పనిముట్లను అందజేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close