Featuredస్టేట్ న్యూస్

ఎక్కడిదక్కడే గప్‌చుప్‌…

  • కోడ్‌ పేరుతో పనులు వాయిదా.
  • రోజుల వ్యవధిలోనే ఎన్నికలు..
  • ఒత్తిడి గురవుతున్న అధికారులు…
  • ఇబ్బందులు పడుతున్న జనాలు…

ఫైలు ముందుకు కదలడం లేదు.. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవ్వడం లేదు.. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కార్యాలయాల చుట్టు తిరిగి తిరిగి నాయకులతో పాటు ప్రజలు కూడా విసుగు చెందుతున్నారు.. వెంటవెంటనే ఎన్నికలు రావడం అందుకు తగ్గట్టు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో ఏ ఒక్క పని సక్రమంగా జరగడమే లేదు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగగానే ఎమ్మెల్సీ ఎన్నికలు, అవి ముగియగానే సర్పంచ్‌ ఎన్నికలు, అదీ ముగిసాయో లేదో, వెంటనే పార్లమెంట్‌ ఎన్నికలు, వాటి ఫలితాలు రానే లేదు.. ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలంటూ మళ్లీ కోడ్‌ మీద కోడ్‌ వచ్చింది. ఇవి ముగియగానే ఇంకేం ఎన్నికలు వస్తాయో, మళ్లీ ఎన్నికల కోడ్‌ ఎప్పటివరకు ఉంటుందో అంటూ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఒకదానివెంట మరొకటి ఎన్నికలు వరుసగా రావడంతో అన్ని శాఖల అధికారులు గత ఐదారు నెలల నుంచి విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేదంటున్నారు.. అధికారుల వాదనే ఇలా ఉంటే ప్రజలకు కావాల్సిన కనీస సదుపాయాలు, అభివృద్దిపనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులు ముందుకు సాగాలన్నా, పైళ్లు ముందుకు కదలాలన్నా కోడ్‌ ముగిస్తేనే వాటికి రెక్కలంటున్నారు… ఈ కోడ్‌ ముగియగానే మళ్లీ ఎన్నికలంటే మాత్రం ఇంకా పాలన పడకేసినట్టేనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఇప్పుడు అందరి నోటా ఒకటే మాట.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోఉంది.. ఇప్పుడేమి పనులు జరుగవు.. ఫైలు కదలాలన్నా, అభివృద్ది పని ప్రారంభించాలన్నా, ప్రారంభించిన పని పూర్తవ్వాలన్నా ఎన్నికలు అయ్యాకనే అంటున్నారు. విరామం లేకుండా ఒకదాని తర్వాత మరొకటి ఎన్నికలు రావడంతో చాలా గ్రామాల్లో అభివృద్ది నత్తనడకనే వేసింది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ అంతో, కొంతో తాగునీటి సమస్యకు సంబంధించిన పనులు జరుగుతున్నా అదీ కూడా నిధులు లేక మరుగునపడుతున్నాయి. పనులన్నీ పూర్తికాకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ కార్యాలయాలలో సాధారణ పరిపాలన మొత్తం స్తంభించిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏ పని చేపట్టాలన్నా ఎన్నికల కోడ్‌ అమలులో ఉందంటూ చెపుతూ దాటవేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఉన్నా ఫైళ్లు మాత్రం ముందుకు కదలడమే లేదు. ఎన్నికలు సంఘం కొరడా చూపిస్తూ అడుగు ముందుకు వేయనీయడం లేదు. గత ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ప్రతిష్టంభన మరో నెల రోజుల పాటు కొనసాగనుండగా, మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభమైతే మరో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి నిబంధనలు ముగిశాయి.. కాని మళ్లీ ఇరవై రోజుల తరువాత పంచాయతీ ఎన్నికల కారణంగా మరోసారి ఎన్నికల కోడ్‌ తెరపైకి వచ్చింది. ఓవైపు ఎన్నికలు, మరో వైపు ఎన్నికల విధుల కారణంగా అధికార యంత్రాంగం అంతా బిజీబిజీగా మారిపోయిందనే చెప్పవచ్చు.. ఆ తరువాత కొన్ని నెలలు మాత్రమే గడువు ఉండగా, బ్జడెట్‌ సమావేశాలు పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ తరుణం లోనే పార్లమెంట్‌ ఎన్నికల నియమావళి రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. దీంతో ప్రజలు వారికి సంబంధించిన మామూలు పనుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రెవెన్యూ పరిపాలనతో పాటు వ్యవసాయ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల శాఖలే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలన్ని ఇంచుమించుగా స్తంభించిపోయాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా రెవెన్యూ శాఖల ద్వారా భూములకు సంబంధించిన వ్యవహరాలే కాకుండా అనేక కార్యకలాపాలకు ఎన్నికల కోడ్‌ ఆటంకంగా మారుతోంది. గత ఆరు నెలల నుంచి సాధారణ ప్రజానీకం తమ పనుల కోసం కార్యాలయాల చూట్టు తిరుగుతూ అలసిపోతున్నారన్న ఆరోపణలను వినిపిస్తున్నాయి. దీంతో పాటు వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలకు సైతం ఎన్నికల కారణంగా గ్రహణం పట్టిందని చెపుతున్నారు.

కోడ్‌ కారణంగా నిలిచిపోయిన పథకాలు.. ఎన్నికల కోడ్‌ కారణంగా పలు ప్రభుత్వ పథకాలు నిలిచిపోయాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో సబ్సిడీ పథకాల కోసం లబ్దిదారుల ఎంపిక పక్రియ పూర్తైనప్పటికి ఆ పథకాల అమలుకు ఎన్నికలు బ్రేక్‌ వేస్తున్నాయి. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే ఎన్నికల కమిషన్‌ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ వైపు ఎన్నికల కోడ్‌ కారణంగా, మరోవైపు అధికార యంత్రాంగం అంతా ఎన్నికల పనుల్లో నిమగ్నమైపోయారు. దీంతో పాటు వివిధ రకాల సంక్షేమ, అభివృద్ది పథకాలు సైతం అర్థాంతరంగా నిలిచిపోనున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే అనేక రకాల సబ్సిడీ పథకాల కోసం ఎంపికైన లబ్దిదారులంతా ఈ పథకాలు తమకు ఎప్పుడు వర్తిస్తాయోనన్న ఆందోళనలో ఉన్నారు. వరుస ఎన్నికల పుణ్యమా అని ఈ లబ్దిదారులంతా తీవ్ర మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైనందున ఆ పక్రియను కొనసాగించే బాధ్యత అన్ని శాఖలపై ఉన్న సామాన్యల జీవితాలపై అధిక ప్రభావం చూపుతోంది. ఎన్నికలనేవి ప్రజాస్వామ్యపరిరక్షణకు ప్రధాన అంశాలైనప్పటికి రోజుల వ్యవధిలోనే ఎన్నికలు ఒకదానివెంట మరొకటి ఎన్నికలు నిర్వహించడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒక ఎన్నికలు ముగియగానే తగినంత సమయం ఇచ్చి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేశాక మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇటు ప్రభుత్వం, ఎన్నికలు సంఘం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది..

ఆరునెలల నుంచి ఖాళీ లేని అధికారులు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారులు ఆరునెలల నుంచి ఖాళీలేరని, వరుసగా వస్తున్న ఎన్నికలతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరవైనాలుగు గంటలు విధుల్లో ఉండే పోలీసులకు వరుసగా ఎన్నికలతో తలకు మించిన భారంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు అంటే ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక ప్రతిరోజు టెన్షన్‌గానే ఉంటున్నట్లు తెలుస్తోంది. మండే ఎండలకు తోడు ఎన్నికలు సీజన్‌ రావడంతో ఎవరికి ఏం చెప్పుకోలేక పనిచేస్తుపోవడమే తప్ప ఇంకేం చేయలేమంటున్నారు పోలీస్‌ సిబ్బంది. వారితో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల, రెవెన్యూ అధికారులకు కూడా ఎన్నికల విధుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలు బాధ ఎప్పుడుముగుస్తుందో ఏంటో అని అధికారులు తల్లడిల్లుతుంటే సామాన్య జనాలు మాత్రం పనులన్నీ ఆగిపోయాయని తలపట్టుకుంటున్నారు.. తీరా ఎంపిటిసీ, జెడ్పీటిసి ఎన్నికలు ముగిశాక మళ్లీ మున్సిపల్‌ ఎన్నికలంటే మాత్రం ఇంకా పనులన్నీ పడకేసినట్టేనని అధికారుల విధులకు విరామం లేకుండా ఎన్నికలు పని చేయాల్సిందేనంటున్నారు… ఎన్నికలు ఇంకెన్ని రోజులు సాగుతాయో మాత్రం అర్థమే కావడం లేదు..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close