కాశీలో గంగ మాయం

0

  • ప్రస్తావన లేని మిగిలిన తాళపత్ర గ్రంథాలు
  • స్వంత వారిని సైతం వదలని వైనం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

కాశీలో గంగ మాయం అవుతుందని, అసాంఘిక చర్యలు జరుగుతాయని, శ్రీశైలంలో అందుకు అతీతం కాదని, నదులు పొంగి నగరాలను ముంచెత్తుతాయని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన ‘కాలజ్ఞానం’లో పేర్కొన్నారు. రాజకీయుల గురించి, వారి హఠాన్మరణాల గురించి కూడా పేర్కొన్నారు. వారి నీతిమాలిన పాలనల గురించి, ధనార్జన గురించి ఘాటుగా స్పందించారు. స్మశానంలో సమానత గురించి కూడా వివరించారు.

ఇవీ వివరించిన విషయాలు: మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.

అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.

ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు. (బ్రిటిష్‌ పాలన)

మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు. (నాగమ్మ ఉదంతం)

పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.

ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ కామపీడితులౌతారు.

వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి.

మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.

ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.

చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.

కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.

ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.

శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు)రంకెలు వేస్తాడు. ‘ఖణ ఖణ’మని కాలు దువ్వుతాడు. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.

కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.

ఎంతో ‘మందీ మార్బలం’ ఉన్నా రాజులు హత్య గావించబడతారు. (దేశాధ్యక్షులు కెనడీ, అబ్రహం లింకన్‌, ఇందిరాగాంధీ తదితరుల హత్య)

గ్రామాలలో చోరులు పెరుగుతారు.

పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.

విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. (హార్డ్‌ ఎటాక్‌) రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి.

నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.

సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.

విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది.

గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.

సూర్య, చంద్రులు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు ‘నేనే దేవుడినని నన్ను పూజించండి’ అని పలుకుతాడు.

సింహపురి సీమ (నేటి నెల్లూరు) మొత్తం నీట మునుగుతుంది.

విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి. ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.

కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు. బనగాన పల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.

ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.

14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి.

కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకుతుంది.

యాగంటిలో నంది అంతకంతకూ పెరిగి రంకేస్తాడు.

నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు.

దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.

5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.

కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది.

జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు.

కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. (మహాత్మాగాంధీ) మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.

పట్ట పగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.

పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.

బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.

గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు.ఆ తరువాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది.అందువల్ల ఎందరో నష్టపోతారు.

గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.

మహానంది మరుగున మహిమలు పుడతాయి.

నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.

మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నారాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది.

కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.

ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.

పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు. (టెస్ట్‌ ట్యూబ్‌ బేబీలు)

కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులూ, గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.

కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.

ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచే వరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.

పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.

రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురి (నేటి న్యూఢిల్లీ)లో మహామారి అనే శక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.

శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి.

స్త్రీ, పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.

ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.

వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.

విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయలసింహాసనం బయట పడుతుంది.

నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులౌతారు.

వేదములు అంత్య జాతుల పాలౌతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.

బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంటభూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు ఔతాయి.

నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమధాంధులు, అజ్ఞానులై కొట్టుకు చస్తారు.

నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాలమీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగుల కొడతారు.

‘కాలజ్ఞానం’ గురించి దక్షిణాదిన ఒకరు లోతుగా పరిశీలిస్తారు. ధిక్కారణధోరణి గర్జనలా వినిపిస్తాడు.

కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి.

నేను వచ్చేసరికి విధవ వివాహాలు జరగటం మామూలై పోతుంది.

వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతీ లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. I పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు. (దేవతల ఫోటోలను అమ్ముకోవడం)

అరణ్యంలోనూ, భూమిలోనూ ధనం ఉండేను. (కలప, గ్రానైట్‌ అమ్మకాలు)

(రేపటి సంచికలో…ప్రచారంలో ఫేక్‌ ఫోటో..)

నీలీ:

జవాబు దొరకలేదు:

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన 5 కాలజ్ఞాన’ ప్రతులలో 4 ప్రతులను ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. దొరికే అవకాశం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here