Featuredజాతీయ వార్తలు

గాంధీజీ హత్య ఎఫ్‌ఐఆర్‌ నెం:68/48

అనంచిన్ని వెంకటేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌

మహాత్మాగాంధీ ఓ అధ్భుతం. ఆయన చుట్టూ అనేక వివాదాలు. ఊహించని మరణం. కాల్చింది ఒకరు కాదు. ఇద్దరనే ఆరోపణలు. బుల్లెట్‌ గాయా లపై ఇప్పటికీ గందరగోళమే. ఇలా అ’సత్యాలు’ అనేకం రాజ్యమేలాయి. ఏలుతున్నాయి. ఆ విషయాలు పక్కన పెట్టి గాంధీజీ హత్య జరిగిన రోజు ఏం జరిగింది. ‘ఎఫ్‌ఐఆర్‌ నెం. 68/48లో ఏముంది.? ఆ తరువాత ఏం జరిగింది.? తుది తీర్పు వరకు ఎం జరిగింది.?’ అనే విషయాలపై ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ స్వయంగా సేకరించి ‘గాంధీ వర్థంతి’ సందర్భంగా ఇస్తున్న ప్రత్యేక పరిశీలనా కథనం.

మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే..

1948, జనవరి 30, శుక్రవారం, రోజూలాగానే మొదలయ్యింది. గాంధీ తెల్లవారుఝాము మూడున్నరకే లేచా రు. ప్రార్థన చేసుకుని, ఓ రెండు గంటలు కాంగ్రెస్‌ కొత్త బాధ్యతలు, విధానాల విూద దృష్టి పెట్టి, మిగతావారు లేచేలోపు, ఆరు గంటలకి మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు. మళ్ళీ ఎనిమిది గంటలకు లేచారు. ఎప్పటిలాగే ఆయనకి నూనెతో మాలిష్‌ జరిగంది. స్నానం చేసాక మేక పాలు, ఉడికిన కూరగాయలు, ముల్లంగి, నారింజ రసం ఆరగించారు. అదే సమయానికి, ఢిల్లీ నగరంలో మరో మూల, ఓల్డ్‌ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ వెయిటింగ్‌ రూమ్లో నాథూరాం గాడ్సే, నారాయణ్‌ ఆప్టే, విష్ణు కర్కరే ఇంకా నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ, గాంధీ ఉపాహారం తరువాత, తనని కలవడానికి సపరివారంగా వచ్చిన పాత స్నేహితుడు రుస్తమ్‌ సోరాబజీతో కాసేపు సంభాషించారు. తరువాత ఢిల్లీలోని ముస్లిం లీడర్లను కలిసి ‘విూ సమ్మతి లేకుండా వార్ధా వెళ్ళలేను’ అని చెప్పారు.

పటేల్ను ఎందుకు కలిశారంటే..:

తరువాత, గాంధీగారి సన్నిహితులు అయిన సుధీర్‌ ఘోష్‌, ప్యారేలాల్‌ కలిసి లండన్‌ టైమ్స్లో వచ్చిన వార్త ‘నెహ్రూ, పటేల్‌ మధ్యన అభిప్రాయబేధాలు’పై స్పందించమని కోరారు. ఆరోజు సాయంకాలం వారిద్దరి ముందూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని గాంధీ అన్నారు. అక్కడ బిర్లా హౌస్కి బయలుదేరేముందు గాడ్సేకి వేరుసెనగలు తినాలనే కోరిక కలిగింది. అతని మిత్రుడు ఆప్టే వాటిని ఎలాగోలా సంపాదించి మిత్రునికి ఇచ్చాడు. అవి తిన్నాక తృప్తిగా బయలుదేరారు. సాయంత్రం నాలుగు గంటలకి వల్లభాయ్‌ పటేల్‌ తన కూతురు మనీబేన్‌ తో సహా గాంధీని కలిసి ప్రార్థనా సమయం.. 5 గంటలు దాటే వరకూ ముచ్చటించారు. అదే సాయంత్రం నాలుగుంపావుకి గాడ్సే, అతని మిత్రులు టాంగా ఎక్కి కనాట్‌ ప్లేస్కి వెళ్ళారు. అక్కడినుండి ఇంకో టాంగా తీసుకుని బిర్లా హౌస్కి బయలుదేరారు. హౌస్కి ముందు రెండు వందల గజాల దూరంలోనే టాంగా ఆపించి దిగారు. ఇక్కడ గాంధీ.. పటేల్తో మాట్లాడుతూనే, ఒకచేత్తో చరఖా చేత పట్టి, మరో చేత్తో ఆభా తెచ్చిపెట్టిన సాయంత్రం భోజనం చేయసాగారు. ప్రార్థనా సభకి ఆలస్యంగా వెళ్ళడం గాంధీకి ఇష్టం ఉండదు. ఈ విషయం గురించి ఆభా ఆందోళన చెందసాగింది. కానీ పటేల్కు ఈ విషయం గుర్తు చేసే ధైర్యం ఆమెకి లేదు. పైగా ఆయనకు ఉక్కుమనిషి అని పేరు కూడా ఉంది. అలాగని, ఆలస్యం అవుతోందని గాంధీకి చెప్పే ధైర్యమూ లేదు. చివరికి హాల్లో ఉన్న జేబు గడియారం తీసి టైము చూపించే ప్రయత్నం చేసారు. అది గమనించిన మనుబెన్‌ గాంధీకి చెప్పగా ఆయన ప్రార్థనా సభకి 5.10 ని. బయలుదేరారు.

అలా వెళుతుండగానే..

తన సహాయకులైన ఆభా, మను లతో కలిసి నడుస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ ప్రార్థనా సభకు చేరుకున్నారు. అక్కడకు చేరాక ప్రజలకు అభివాదం చేసారు. ఎడమవైపు నుండి నాథూరామ్‌ గాడ్సే, గాంధీగారి వైపుకి వంగడం చూసి, ఆయన పాదాలకు నమస్కరించబోతున్నాడని మను భావించింది. అసలే ఆలస్యం అయిపోయిందనుకుంటే ఇలా మధ్యలో వచ్చి ఇంకా జాగు చేస్తున్నాడని ఆభా కాస్త చిరాకు పడ్డారు. గాడ్సే విసురుగా మనుని తోసుకుంటూ ముందుకి వచ్చాడు. మను చేతిలో ఉన్న మాల, పుస్తకం రెండూ కిందపడిపోయాయి. అవి తీసుకోవడానికి ఆమె క్రిందకు వంగారు. అదే సమయంలో గాడ్సే తుపాకీ తీసి ఒకదాని వెనుక ఒకటి.. మూడు గుళ్ళు.. గాంధీ చాతీవిూద, పొట్టలోకి దిగేట్టు పేల్చాడు. ఆయన నోటి నుండి ”రామ్‌….రా…మ్‌” అనే శబ్దాలు వెలువడ్డాయి. మరుక్షణం ఆయన శరీరం నేలకొరిగిపోయింది. ఆభా వెంటనే ఒరిగిపోతున్న ఆయన తలను తన చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నం చేసారు.

చివరిగా…

డాక్టర్‌ అంబేడ్కర్‌ మాటలతో ముగింపు. ”నా మనస్సులో గాంధీజీ అంటే ప్రేమ ఉంది. ఏది ఏమైనా కానీ, గాంధీజీని వెనుకబడిన ప్రజలు తమ ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించారు. అందుకే ఆయన స్వర్గం నుంచి కూడా ఆశీర్వాదాలు అందిస్తారు” (గుజరాతీ ప్రచురణ, పేజీ నెం.540)

ఃనీలీ

హత్య – సందేహాలు

1948 జనవరి 30వ తేదీన సాయంత్రం 05.17కి మహాత్మాగాంధీ హత్య జరిగింది. బిర్లామందిరంలో తన సహాయకులు అబ్బా ఛటోపాధ్యాయ, సిస్టర్‌ సన్నోలతో మహాత్మాగాంధీ కలిసి వస్తున్నపుడు నాథురామ్‌ గాడ్సే తుపాకితో కాల్చి చంపాడు. అడ్డుకున్న అబ్బాని నాధురామ్‌ ఎడమ చేతితో పక్కకు తోసేశాడు. ‘రెండుసార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది తెలియలేదని, ఏదో క్షణికావేశంలో చేశాన’ని కాకుండా పథకం ప్రకారమే గాంధీ హత్యకు పూనుకున్నానని ఆయన తేల్చి చెప్పాడు. నాథురామ్ను ఆ క్షణాన గట్టిగా పట్టుకుని సైన్యానికి, పోలీసులకు అప్పగించింది అమెరికా సహాయ కాన్సులర్‌ హెర్బర్టు రెయినర్‌ జూనియర్‌ అని అమెరికా రికార్డులు చెబుతుండగా, భారత్‌ రికార్డుల్లో ఆయన ప్రస్తావనే లేదు. నాథురామ్‌ వాడింది బెరెట్ట ఎం 1934 పిస్టల్‌, అలాంటివి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒక దాని రిజిస్ట్రేషన్‌ సంఖ్య 719791 కాగా, నాథురామ్‌ వాడిన పిస్టల్‌ నెంబర్‌ 606824. ఈ పిస్టల్‌ 7బుల్లెట్లు మాత్రమే కాల్చగలుగుతుంది. నాథురామ్‌ మూడు బుల్లెట్లు కాలిస్తే ఇంకా ఆ తుపాకిలో నాలుగు మాత్రమే బుల్లెట్లు ఉండాలి. కాని గాంధీకి అయిన బుల్లెట్‌ గాయాల లెక్కపై ఇప్పటికీ గందరగోళం ఉంది. ఇటలీ నుండి నాలుగో గ్వాలియర్‌ ఇన్‌ ఫంటరీకి చేరిన ఈ రెండు తుపాకులు జగదీష్‌ ప్రసాద్‌ గోయల్కు చేరాయి. ఆయన వాటిలో ఒక దానిని ఉదయ్‌ చంద్కు ఇవ్వగా, మరొకదానిని నాథూరం గాడ్సేకు చేర్చారు. ఈ శక్తివంతమైన పిస్టల్‌ ఇండియాకు ఎలా చేరిందనే దానిపై ఇప్పటికీ సమగ్ర విచారణ జరగలేదు.

కుట్రదారులు?:

గాంధీ హత్య ఘటనపై కన్నాట్‌ సర్కస్లో నివసించే నందలాల్‌ మెహతా తుగ్లక్‌ రోడ్లోని పోలీసులకు 5.45కి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారంతో పోలీసులు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 302 కింద కేసు నమోదు చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో నందలాల్తో పాటు వెండి వ్యాపారి లాలా బ్రిజ్‌ కిషన్‌, సర్దార్‌ గురుబచన్‌ సింగ్‌ తదితరులతో పాటు అక్కడ పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. బుల్లెట్‌ గాయాలైన గాంధీని వెంటనే సహచరులు తన 3వ నెంబర్‌ గదికి తీసుకువెళ్లి సపర్యలు చేసినా కాపాడలేకపోయారు. 1948 మే 4వ తేదీన ముంబై పబ్లిక్‌ సెక్యూరిటీ మెజర్స్‌ యాక్ట్‌ -1947 కింద కేంద్రం స్పెషల్‌ కోర్టును ఏర్పాటు చేసింది. ఐసిఎస్‌ అధికారి ఆత్మచరణ్‌ స్పెషల్‌ జడ్జిగా నియమితులయ్యారు. రెడ్‌ ఫోర్టులో పై అంతస్థులో కోర్టు కార్యకలాపాలు కొనసాగాయి. మే 15వ తేదీన రెడ్‌ ఫోర్టు కింది అంతస్థులో ఒక గదిని ప్రత్యేక జైలుగా మార్చి దోషులను ఉంచారు. మే 27న చార్జిషీట్‌ దాఖలు చేయగా, జూన్‌ 21న దిగంబర్‌ ఆర్‌ బాడ్గే క్షమించమని, అప్రూవర్గా మారుతానని కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం జూన్‌ 18న ఆమోదం తెలిపింది. అప్పటి ముంబై అడ్వకేట్‌ జనరల్‌ సి.కె.దఫ్తరి చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గా నియమితులయ్యారు. ఆయనకు ఎన్‌.కె.పెటిగర, ఎం.జి. వ్యవహార్కర్‌, జె.సి.షా, జ్వాలా ప్రసాద్‌ సహకరించారు. సావర్కర్‌ తన తరఫున న్యాయవాదులు ఎల్‌.బి. బోప్టకర్‌, జుమందాస్‌ మెహతా, గణపత్‌ రాయ్‌, కె.ఎల్‌.బోప్టకర్‌, బి.బెనర్జీ, జె.పి.మిట్టర్‌, ఎన్‌.పి.ఐయ్యర్‌ ను నియమించుకున్నారు. ముంబైకి పరిమితమైన సెక్యూరిటీ మెజర్సు యాక్ట్‌ ను ఢిల్లీకి సైతం విస్తరింపచేసి జూన్‌ 24న విచారణ ప్రారంభించి నవంబర్‌ 6 వరకూ కొనసాగింది. నిందితుడు శంకర్‌ కిష్టయ్య 297 పేజీల వాంగ్మూలాన్ని వేరుగా సమర్పించారు. ఈ కేసులో 149 మంది సాక్షులను విచారించిన పోలీసులు, 720 పేజీల వాంగ్మూలం, 420 డాక్యుమెంటరీ ఆధారాలు, 80 ఉపయోగపడే ఆధారాలను పోలీసులు సేకరించి కోర్టు ముందుంచారు. అంతా కలిపి 11,186 పేజీల డాక్యుమెంట్లు ఇవి. నిందితుల పరస్పర వాదనలు డిసెంబర్‌ 1 నుండి 30వ తేదీ వరకూ జరిగాయి. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 302, సెక్షన్‌ -109, సెక్షన్‌ -114, సెక్షన్‌ 12-డి బి, ఆయుధ చట్టం సెక్షన్‌ 10, సెక్షన్‌ 19(డి), సెక్షన్‌ 14,15, సెక్షన్‌ 19(ఎఫ్‌) ల కింద, పేలుడు పదార్థాల చట్టం సెక్షన్‌ 4బి, సెక్షన్‌ 6, చేతి గ్రెనేడ్లు ఉన్నందుకు సెక్షన్‌ -5 కింద 1948లో కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని 8024 టెలిఫోన్‌ నెంబర్‌ నుండి ముంబైలోని 60201 నెంబర్కు ఫోన్‌ వచ్చిందని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. సావర్కర్‌ కార్యదర్శి గజానన్‌ విష్ణు దామ్లే, బాడీగార్డు అప్పా రామచంద్ర కసర్‌ లను ప్రశ్నించి ఉంటే మరిన్ని వివరాలు తేలేవనే వాదన తర్వాత బలపడింది. జనవరి 10 నుండి ఈ కుట్రకు అంతా కలిసి పథకం పన్నినట్టు పోలీసులు ఆరోపించారు. 207 పేజీల తుది తీర్పును, అప్పీళ్లపై 55 పేజీల అదనపు తీర్పును ప్రత్యేక జడ్జి ఆత్మాచరణ్‌ వెలువరించారు.

ఃనీలీ 2

భద్రత వద్దన్న గాంధీజీ

తన ప్రాణానికి ముప్పు ఉందని భద్రత కల్పిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పినప్పటికీ.. ఆనాడు మహాత్మా గాంధీ తనకు భద్రత వద్దని తిరస్కరించారని గాంధీజీ వద్ద సెక్రటరీగా పనిచేసిన కళ్యాణం అనే వ్యక్తి చెన్నైలో వెల్లడించారు. బలవంతంగా భద్రతను ఏర్పాటు చేస్తే దిల్లీ వదిలేసి వెళ్తానని హెచ్చరించారని చెప్పారు. రేపు గాంధీజీ వర్ధంతి సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన 96ఏళ్ల కళ్యాణం నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పలుమార్లు గాంధీజీకి ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వచ్చాయని,ప్రాణ హాని ఉందని, భద్రత ఇస్తామని హత్య జరగడానికి కొన్ని వారాల ముందు కూడా అడిగారని, కానీ గాంధీ అందుకు అంగీకరించలేదని తెలిపారు.

తనకు భద్రత కల్పించడాన్ని గాంధీ ఏమాత్రం అంగీకరించలేదని కళ్యాణం చెప్పారు.తాను భద్రతను నమ్మనని, తనకు అవసరం లేదని గాంధీజీ చెప్పేవారని తెలిపారు. అయినా బలవంతంగా సెక్యురిటీని పెడితే తాను దిల్లీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోతానని అనే వారని వెల్లడించారు. అప్పుడు ఒకవేళ గాంధీజీ భద్రతను అంగీకరించి ఉంటే ఆయన హత్య జరిగి ఉండేది కాదేమోనని, అధికారులు గాంధీ హత్యకు జరిగిన కుట్రను గుర్తించి అడ్డుకునే వారేమోనని చెప్పుకొచ్చారు. గాంధీజీ 1948 జనవరి 30వ తేదీన గాడ్సే చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. కళ్యాణం 1943లో గాంధీ దగ్గర చేరి, మహాత్ముడు చనిపోయే వరకు ఆయన దగ్గరే పనిచేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close