నటుడు అంబరీష్‌కు ఘనంగా అంత్యక్రియలు

0

కోరిక తీరకుండానే దిగ్గజ నటుడు తమను వదిలి వెళ్లిపోయారంటూ అభిమానులు కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో కలిపి అంబరీష్‌ మొత్తం 230 సినిమాల్లో నటించారు. అందులో కన్నడ చిత్రాలే 200 ఉండటం విశేషం. అంబరీష్‌ భార్య నటి సుమలత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 200 చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ ఆమె పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. 1972లో విడుదలైన తన తొలి చిత్రం నాగరహావు సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న అంబరీష్‌ తమ కుమారుడు అభిషేక్‌ను వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. నాగ్‌ శేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అమర్‌’ అనే కన్నడ సినిమా ద్వారా అభిషేక్‌ శాండల్‌వుడ్‌కు పరిచయం కానున్నాడు. అంబరీష్‌ పుట్టినరోజున మే 29న అభిషేక్‌ తొలి మూవీ అమర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. అభిషేక్‌, మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ తాన్యా హోప్‌ జంటగా నటించిన ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. కొన్ని రోజుల్లో మూవీ విడుదలకానుండగా, కుమారుడిని వెండితెరపై హీరోగా చూసుకోవాలన్న చివరి రోజుల్లో కోరిక తీరకుండానే రెబల్‌స్టార్‌, మహానటుడు అంబరీష్‌ కన్నుమూయడం సినీ ప్రేమికుల్ని కంటతడి పెట్టిస్తోంది. కాగా, అతిలోకసుందరి, ప్రముఖ నటి శ్రీదేవి తన ముద్దల తనయ జాన్వీ కపూర్‌ను వెండితెరకు పరిచయం చేసేందుకు చాలా శ్రమించారు. చివరికి జాన్వీ తొలి మూవీ దడక్‌ విడుదలకు కొన్ని రోజుల ముందే దుబాయ్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో బాత్‌టబ్‌లోనే తుదిశ్వాస విడవడాన్ని నేటికీ ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కంటతడిపెట్టిన చిరు, రజనీ, మోహన్‌బాబు కన్నడ రెబల్‌ స్టార్‌, నటి సుమలత భర్త అంబరీష్‌ మ తి పట్ల సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచిన అంబరీష్‌ పార్థివ దేహాన్ని ఆదివారం రజినీ, చిరంజీవి వేరువేరుగా సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ తీవ్ర భావేద్వేగానికి గురయ్యారు. సుమలతను చూసి కంటతడి పెట్టుకున్నారు. సుమలతను ఓదార్చారు. అంబరీష్‌ కుటుంబంతో రజినీ, చిరంజీవులకు మంచి సాన్నిహిత్యం ఉంది. రజినీకాంత్‌కు అంబరీష్‌ ఆప్త మిత్రుడు. మరోవైపు సుమలత, చిరంజీవి కలిసి పలు తెలుగు సినిమాల్లో నటించారు. టాలివుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు అంబరీష్‌ మతదేహాన్ని చూసి బిగ్గరగా ఏడ్చేశారు. చాలా సేపటి వరకు ఆయన దుఃఖం నుంచి తేరుకోలేదు. మరోవైపు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కూడా అంబరీష్‌ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అంబరీష్‌ భార్య సుమలత, కుమారుడు అభిషేక్‌ను ఓదార్చారు. వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

– ‘అంబరీశ్‌ ఇకలేరు. ఉదయాన్నే ఈ షాకింగ్‌ వార్త వినాల్సి వచ్చింది. గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’-అల్లు అర్జున్‌.

– ‘ఎంతో గొప్ప వ్యక్తి. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. సుమలత, కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గుండెపగిలిపోతోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- రాధికా శరత్‌కుమార్‌.

– ‘అంబరీశ్‌ సర్‌ ఇంత త్వరగా వెళ్లిపోవడం నిజంగా బాధాకరం. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ సర్‌’-ఈషా రెబ్బా.

– ‘అంబరీశ్‌ మరణవార్త విని షాకయ్యాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది అబద్ధం అయితే బాగుండు అనిపిస్తోంది. నా గొప్ప స్నేహితుడు ఇంత త్వరగా వెళ్లిపోయి మమ్మల్ని శోకసంద్రంలోకి నెట్టేశారు.’-ఖుష్బూ.

– ‘ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఆయన్ని పలుమార్లు కలిసినందుకు సంతోషంగా ఉంది. మరో లెజెండ్‌ వెళ్లిపోయారు’-రాయ్‌ లక్ష్మి.

– ‘మోహన్‌బాబు గారి ద్వారా పలు మార్లు అంబరీశ్‌ను కలిశాను. ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను. మిమ్మల్ని ఓ స్టార్‌గా, మాస్‌ లీడర్‌గా, నిజమైన స్నేహితుడిగా ఎందరో అభిమానులు మిస్సవుతారు సర్‌.’-బీవీఎస్‌ రవి.

– ‘అంబరీశ్‌ సర్‌ ఇకలేరంటే నమ్మలేకపోతున్నాను. సుమలత గారికి, ఆమె కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి’-కల్యాణి ప్రియదర్శన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here