Featuredఅంతర్జాతీయ వార్తలు

నిధులు లేక పడకేసిన పథకాలు..

రూపాయి లేదు… నిధులు లేవు… చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు.. బాలింతలకు కెసిఆర్‌ కిట్‌ డబ్బులు లేవు. సగంలోనే ఆగిపోయిన రైతుబంధు నిధులు.. పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు జీతాలకు కటకటగానే ఉంది. ఇప్పటికి ఒక్క శాఖకు మంత్రి లేరు. నిధులు రాక, పనులు లేక ఇబ్బందులు పడుతున్న యంత్రాంగం.. సంతకాలు లేక గుట్టలు గుట్టలుగా పైళ్లు పేరుకు పోతున్నాయి. ఎప్పుడు నిధులు వస్తాయో, ఎప్పుడు పనులు పూర్తవుతాయో తెలియక అటు లబ్దిదారులు నానా యాతలు పడుతున్న పట్టించుకునే వారే కనబడడం లేదు. ఎన్నికల ముందు ఎన్నికల కోడ్‌, ఎన్నికల అయ్యాక నిధుల కొరతతో బంగారు తెలంగాణలో లబ్దిదారులు జీవి తాలు ఎదురుచూపులేక సరిపోతున్నాయి. రేపో, మాపో బడ్జెట్‌ ముంచుకొస్తున్నా దానికి సంబం ధించిన మంత్రినే ఇప్పటివరకు నియమించనేలేదు.. పథకాలు గొప్పగా ఉన్న నిధులు లేక అన్ని చతికిలపడుతున్నాయి… రేపురేపంటూ అధినేత చెపుతున్న మాటలు రెండునెలలు దాటినా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు బంగారు తెలంగాణలో…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రజల పథకాలను అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలను ఆకర్షించే వినూత్న పథకాలు చేపట్టినప్పటికి ఇప్పటికి వాటి అమలులో మాత్రం సరియైన పనితీరు కనబర్చడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ మూడు సంవత్సరాలు పాలన ముగిసిన తర్వాత రైతులందరికి పంట పండించడానికి ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదని రైతు బంధు పథకం ప్రారంభించారు. రైతుల కంట కన్నీరు ఒలకకూడదనే ఆలోచనతో చేపట్టిన పథకం ఆలోచన బాగానే ఉన్నాకాని స్థానిక రెవెన్యూ అధికారుల అలసత్వం వల్ల అది మధ్యలోనే నీరుగారిపోయింది. సగం మంది పథకం ద్వారా లబ్దిచేకూర్చిన, మిగతా సగం మందికి రైతుబంధు పథకానికి సంబంధించిన నిధులు అందలేదనే తెలుస్తోంది. ఒక రైతులు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంటే అతనికి పది గుంటల భూమికి పట్టాగా మారి వెయ్యి రూపాయలు వచ్చినట్టు సమాచారంలో ఉంది. మిగతా డబ్బులకోసం అధికారుల చుట్టు తిరిగి తిరిగి వేసారినా రెవెన్యూ అధికారులు చేతివాటం వల్ల మధ్యలోనే నిలిచిపోయింది. అన్ని పత్రాలు, అన్ని సర్టిఫికెట్లు ఉన్న వారికి మాత్రం సగం డబ్బులు వచ్చి, సగం ఆగిపోయినట్లు తెలుస్తోంది. రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా ఇప్పటివరకు వాటి గురించి పట్టించుకున్న వారు మాత్రం ఒక్కరంటే ఒక్కరూ లేరు. నిధులు లేకనే ప్రభుత్వం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజధానిలో కూడా చిన్నచిన్న మరమ్మత్త పనులతో పాటు, కాంట్రాక్టు పనులు చేసినా వారికి కూడా పనులుచేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా మంజూరు చేయలేదని గగ్గోలు పెడుతున్నారు. రేపుమాపంటూ నెలలు దాటి, సంవత్సరాలు గడుస్తున్నాయంటూ అధికారులు సమాధానం చెపుతున్నారు. పనులు కోసం అప్పులు చేసి మరీ పూర్తి చేస్తే సంవత్సరాలు గడుస్తున్నా పట్టింపులేదని అధికారులను ప్రశ్నిస్తే మేము మాత్రం ఏమి చేయాలి మా జీతాలే మాకు సక్రమంగా రావడం లేదంటూ వారు సమాధానం చెపుతున్నట్లు తెలుస్తోంది.

బాలింతలకు అందని కెసిఆర్‌ కిట్‌ డబ్బులు…

బాలింతలందరూ ఏలాంటి ఆనారోగ్యానికి గురికాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కెసిఆర్‌ కిట్‌నుప్రారంభించింది. తల్లి, బిడ్డకు సంబంధించిన వస్తువులన్నింటిని అందజేశారు. దానితో పాటు మంచి పౌష్టికాహరమైన ఆహారం కోసం ప్రతి కాన్పుకు పన్నెండు వేలు, పదమూడు వేలు అందిస్తోంది. ఆలోచన మంచిగానే ఉన్నా కాన్పు ఐనా బాలింతలకు సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటివరకు నిధులు జాడే లేదు. పుట్టినపాపలు నడుస్తున్నారు కాని డబ్బులు మాత్రం ఇప్పటికి అందడం లేదు. ఆసుపత్రుల్లోనూ, ఆశ కార్యకర్తలను ఎప్పుడూ అడిగినా ప్రభుత్వం నుంచి ఇంకా మంజూరు కాలేదు. ప్రభుత్వం మంజూరు చేసినప్పుడే ఇస్తామని సమాధానం దాట వేస్తున్నారు. అవసరానికి రావాల్సిన డబ్బులలో కూడా ఇంత జాప్యం జరుగుతే ఏలా అని బాలింతలు ప్రశ్నిస్తున్నారు. కొంతమందికి సకాలంలో చెల్లించి సంవత్సరం నుంచి వాటి డబ్బులు రావడం ఆగిపోయింది. ప్రభుత్వం మాత్రం వాటి గురించి పట్టించుకోవడమే లేదు. ప్రజలకు సంబంధించిన పలు పథకాలకు నిధులు లేక మూలన పడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వం ఆసుపత్రులకు కనీస నిధులు కూడా రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నిత్యం అవసరమయ్యే రైతులకు, బాలింతలు పథకాలలో కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు.

       తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ ఇప్పటికి ప్రజల సమస్యలపై, ప్రజల అభివృద్దిపై దృష్టి సారించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న కూడా ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదు. గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన తెరాస ప్రభుత్వం ఇప్పుడు మాత్రం నిధులు, పథకాల అమలులో మాత్రం వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అన్ని పథకాలకు తగినంత నిధులు కేటాయించి ప్రజలకు అవసరమయ్యే పథకాలపై ప్రత్యేక దృష్టిసారించేవారు. విద్య, వైద్య పథకాలకు సంబంధించిన వాటిలో నిర్లక్ష్యానికి తావిచ్చేవారు కాదు. కాని రెండవసారి అధికారంలోకి వచ్చి రెండు నెలలుపైగానే దాటుతోంది కాని గత ప్రభుత్వంలో అమలులో పథకాలనే కొనసాగిస్తున్నప్పటికి వాటికి తగినంత నిధులు లేకపోవడంతో ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామాలకు సంబంధించిన నిధులతో పాటు, రైతుబంధు, బాలింతలకు సంబంధించిన కాన్పు డబ్బులు కూడా సకాలంలో అందించాలని లబ్దిదారులు కోరుతున్నారు. ప్రభుత్వ పథకాలు సకాలంలో అందిస్తేనే వాటిని సరియైన పనికి వినియోగించుకుంటారని వారు అంటున్నారు. ప్రజల మన్ననలు పొందిన తెరాస ప్రభుత్వం పథకాలకు సంబంధించిన నిధులలో తాత్సారం చేయకుండా వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సామాజిక నిపుణులు అంటున్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే విద్య, వైద్యం రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటికి మంత్రి శాఖలను నియమించాలని అప్పుడే ప్రజల సమస్యల పరిష్కారమయ్యే దిశగా పనిచేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close