జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణ మొదటికి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆస్తుల కేసులో జగన్‌ దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లపై సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. రెండున్నరేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతుండగా న్యాయమూర్తి బదిలీతో వాదనలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ కేసు మొదటికి వచ్చినట్లయింది. సీబీఐ ఈడీ కోర్టులో జగన్‌ ఆస్తుల కేసు శుక్రవారం విచారణకు రాగా.. తదుపరి

విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. జగన్‌ ఆస్తుల కేసులో మొత్తం 11 అభియోగపత్రాలను సీబీఐ నమోదు చేసింది. విచారణ ప్రక్రియలో భాగంగా నిందితులుగా ఉన్నటు వంటి జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, మిగతా నిందితులు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. నేరానికి ఎలాంటి సంబంధం లేకుండానే తమపై అక్రమంగా కేసులు బనాయించారు కాబట్టి ఎఫ్‌ఐఆర్‌, ఛార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని పిటిషన్లు వేశారు. వీటిపై గత కొంతకాలంగా వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం 11 కేసులకు గానూ 4 కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. రెండున్నరేళ్లుగా ఇది కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకట రమణను ఏపీకి కేటాయించడంతో బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తి డిశ్చార్జ్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుంది. ఒక్కో ఛార్జిషీట్లో తీర్పు వెల్లడించినట్లయితే ఇతర కేసులపై ప్రభావం పడుతుందని భావించి.. అన్ని కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వాలని గతంలో సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు జరగనున్నాయి. అందుకు మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here