ఎమ్మెస్కే పేరుతో వసూళ్లు నిందితుడు మాజీ రంజీ ఆటగాడు..

0

న్యూఢీల్లీ : బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరుతో పలువురి నుంచి నగదు వసూలు చేసిన నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు విశాఖలో నివసిస్తున్నాడు. ఎంబీఏ చదివిన నాగరాజుకు చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. దీంతో 2014లో ఆంధ్రా తరపున రంజీల్లో ప్రాతినిధ్యం వహించారు. 2016లో 82 గంటల పాటు నాన్‌స్టాప్‌గా క్రికెట్‌ ఆడి రికార్డులకు ఎక్కాడు. అతని ప్రతిభ చూసిన పలు స్వచ్ఛంద సంస్థలు స్పాన్సర్‌షిప్‌ కోసం ముందుకు రాగా, ఆ సొమ్ముతో జల్సాలకు అలవాటుపడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు కేటుగాడుగా మారాడు. ఈ క్రమంలో పలుమార్లు జైలు పాలయ్యాడు. తాను క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఓ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాటతీరును దగ్గర నుంచి గమనించి.. ఆయనను అనుకరిస్తూ మాట్లాడేందుకు కసరత్తు చేశాడు. తన ఫోన్‌లో ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరును ట్రూకాలర్‌లో చేర్చాడు. అదే నంబర్‌తో పలువురు ప్రముఖులకు ఫోన్లు చేస్తూ అచ్చం ఎమ్మెస్కేలా మాట్లాడాడు. నాగరాజు అనే కుర్రాడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఎంపికయ్యాడని.. అతనికి సహాయం చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన సెలెక్ట్‌ మొబైల్స్‌ ఎండీ మురళీని నమ్మించి రూ.2.88 లక్షల నగదును తన ఖాతాలో వేయించుకున్నాడు. ఆ తర్వాత విజయవాడ రామక ష్ణా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఫోన్‌ చేసి రూ. 3.88 లక్షలు వసూలు చేశాడు. తన పేరుతో ఎవరో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్‌ హైదరాబాద్‌, విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గట్టి నిఘా వుంచిన పోలీసులు నాగరాజు మోసాలు గుర్తించారు. ఈ క్రమంలో గురువారం గన్నవరం పరిసరాల్లో సంచరిస్తున్న అతనిని పట్టుకున్నారు. ఇతని దగ్గరి నుంచి ద్విచక్ర వాహనం, రూ.80,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here