Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

  • శివప్రసాద్‌ మృతి పార్టీకి తీరనిలోటు
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు

చెన్నై, సెప్టెంబర్‌21(ఆర్‌ఎన్‌ఎ) : తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంలో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాగా మూడు రోజుల క్రితం చెన్నైలోని హైదరాబాద్‌కు మెరుగైన చికిత్సకోసం తరలించారు. శుక్రవారం ఆయన మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. కాగా వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. అవన్నీ పుకార్లేనని, శివప్రసాద్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా శనివారం ఆయన చికిత్స పొందుతూ మృతిచెందాడు. 1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో శివప్రసాద్‌ జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ అభ్యసించిన శివప్రసాద్‌.. ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయనకు భార్య విజయలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఆయన సేవలందించారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగానూ పనిచేశారు.

సినిమాల్లో నటిస్తూ శివప్రసాద్‌ రాజకీయాల్లోకి వచ్చారు. తెదేపాలో చేరిన ఆయన 1999-2004 మధ్య ఆయన సత్యవేడు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999-2001 మధ్య కాలంలో రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2014లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన బరిలో దిగి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన శివప్రసాద్‌ ఓటమిపాలయ్యారు. ఏపీ ప్రత్యేక ¬దా కోసం పార్లమెంట్‌లో తెదేపా ఎంపీలు పోరాడిన సమయంలో శివప్రసాద్‌ వివిధ వేషదారణలతో దేశవ్యాప్తంగా ఆకర్షించారు. సామాజిక చైతన్య కార్యక్రమాలంటే ఆయనకెంతో ఇష్టం. శివప్రసాద్‌ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చేది వివిధ సమస్యలపై తనదైన వేషధారణలతో ఆయన చేపట్టే నిరసనలే. రాష్ట్ర విభజన సమయంలో, ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక ¬దా కోరుతూ వివిధ వేషాలతో ఆయన నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు. శివప్రసాద్‌ నిరసనలు భిన్నంగా ఉండటంతో అందరి దృష్టి ఆయనపై ఉండేది. పార్లమెంట్‌ సమావేశాలు జరిగే సమయంలో రోజుకో వేషధారణతో ఆయన నిరసన చేపట్టేవారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం శివప్రసాద్‌ తన వాణిని బలంగా

వినిపించేవారు. రాముడు, కృష్ణుడు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, హిట్లర్‌, మాంత్రికుడు.. ఇలా విభిన్న వేషధారణలతో ఆయన తనదైన శైలిలో పార్లమెంట్‌ ఆవరణలో పలు ప్రజా సమస్యలపై నిరసన గళం విన్పించేవారు.

సినీరంగంలోనూ రాణించిన శివప్రసాద్‌..

రాజకీయాల్లోకి రాకముందు శివప్రసాద్‌ సినీరంగంలో మంచి సేవలందించారు. శివప్రసాద్‌ స్వతహాగా రంగస్థల నటుడు. ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా పలు చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తులసి, దూసుకెళ్తా, ఆటాడిస్తా, మస్కా, కుబేరులు, ఒక్కమగాడు, కితకితలు, డేంజర్‌, ఖైదీ చిత్రాల్లో ఆయన నటించారు. దర్శకుడిగానూ ఆయన ప్రతిభ కనబర్చారు. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో చిత్రాలకు శివప్రసాద్‌ దర్శకత్వం వహించారు.

తెలుగుదేశం పార్టీకి తీరని లోటు – చంద్రబాబు నాయుడు

శివప్రసాద్‌ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భాంత్రి, విచారం వ్యక్తం చేశారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసుల్లో శివప్రసాద్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close