Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

కృష్ణమ్మకు వరదపోటు..

  • ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరదనీరు
  • నిండుకుండను తలపిస్తున్న డ్యాంలు
  • జూరాల 33 గేట్లు, శ్రీశైలం ఏడుగేట్లు, సాగర్‌ 14గేట్లెత్తి దిగువకు నీటి విడుదల
  • 7వ సారి శ్రీశైలం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తిన అధికారులు

నల్గొండ

కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొతక్కుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదనీరు ప్రాజెక్టుల్లోకి చేరుతుంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఏడు గేట్లు, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుండి 14గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం అయిన తరువాత ఒకే సంవత్సరం ఒకే సీజన్‌లో ఏడోసారి డ్యామ్‌ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. జులై మూడో వారంలో కూడా డ్రైగా కనిపించిన శ్రీశైలం ప్రాజెక్టు.. రిజర్వాయర్‌.. ఆ తర్వాత వరుసగా వస్తున్న వరద నీటితో పూర్తిస్థాయికి నిండింది. కర్నాటక, మహారాష్ట్రల్లోని కృష్ణా రివర్‌ బేసిన్‌లో కురిసిన భారీ వర్షాలు నదిలోకి భారీగా వరదనీరు చేరేలా చేసింది. ఫలితంగా ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌, జూరాల, తుంగభద్ర ఢ్యామ్‌ల నుంచి తరచూ లక్షలాది క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు పలు మార్లు చేరువైంది. దాంతో ఒకే సీజన్‌లో అది కూడా జులై-అక్టోబర్‌ నెలల మధ్య కాలంలో ఏడు సార్లు శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌ నీరు వదిలారు. తాజాగా తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం వరకు మూడు గేట్లు ఎత్తిన అధికారులు వరద ఉధృతి పెరగడంతో బుధవారం మధ్యాహ్నం సమయానికి ఏడు గేట్లు 10అడుగుల మేర ఎత్తి 1.95లక్షల క్యూసెక్కుల నీటిని కదిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 215 టీఎంసీల నీరు ఉంది. స్పిల్‌ వే ద్వారా లక్షా 95వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌ కుడి ఎడమ కాలువలకు విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా మరో 68,729 క్యూసెక్కులను వదులుతున్నారు. ఏపీ పరిధిలో వున్న కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 850 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగినట్లు సమాచారం. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. ఈ ఉత్పత్తిలో యూనిట్లు సంఖ్య 850 మిలియన్లు దాటగానే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు జెన్‌కో సిబ్బంది రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎగువ నుంచి వరద ప్రవాహాలు భారీగా పెరగడంతో అధికారులు జూరాల ప్రాజెక్ట్‌ 33 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆల్మట్టి డ్యాం గేట్ల ద్వారా 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు నారాయణపూర్‌ డ్యాం 23 గేట్ల నుంచి 3,17,256 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. కుడి, ఎడమ కాల్వలకు అదేవిధంగా నెట్టెంపాడుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉదృతిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉంది. మరోవైపు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండను తలపిస్తుంది. సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులుగా ఉంది. దీంతో నాగార్జున సాగర్‌ 14గేట్లు ఎత్తి అధికారులు దిగువకు వరద నీటిని వదులుతున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close