Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

చతికిలపడుతున్న చదువులు..

విద్య అందరికి అందాలి.. అందరూ చదువుకోవాలి.. అందరూ చదివినప్పుడే గ్రామాలతో పాటు, రాష్ట్రాలు అభివృద్ది చెందుతాయి.. అందుకు ఎంతైనా, ఎన్ని లక్షలైనా, ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్వాలేదు.. అందరూ ఆనందంగా, నాణ్యతమైన విద్యను అందించడమే మన లక్ష్యమని చెపుతున్నా నాయకులు ప్రాథమిక విద్యావిధానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలలో విద్యావిధానం శరవేగంగా సాగడం మాట దేవుడెరుగు నిత్యం సమస్యలతో పల్లెలో ప్రభుత్వ అధికారుల పనితీరు వల్ల చదువు నత్తనడకగా సాగుతుంది. ఎక్కడ ఎన్ని పాఠశాలలు ఉన్నాయో, అందులో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో, ఎవరెవరు ఎప్పుడొస్తున్నారో పర్యవేక్షించే అధికారులు కరువయ్యారు. ప్రాథమిక పాఠశాలల్లో చదువులు మమ అనిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. పట్టింపులేని ప్రభుత్వం వలన చదువు చట్టబండల్లా మారిపోతుంది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణ రాష్ట్రంలో విద్య అందక ఒక్క బిడ్డ కూడా దూరం కావద్దని చెప్పిన ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం మాటలతోనే కోటలు దాటుతున్నారు. రోజురోజుకు జిల్లాలలో ప్రాథమిక విద్య పతనమవుతూ ఉంది. అందరికి విద్యను అందించడంలో మన అధికారయంత్రాంగ విఫలం చెందుతున్నారని తెలిపోతుంది. తెలంగాణలో పాత పదిజిల్లాలు ఉన్నప్పుడు ప్రతి జిల్లాకు ఒక్క జిల్లా విద్యాశాఖాధికారి ఉండేవారు. జిల్లాలోని విద్యావ్యవస్థ మొత్తం అతని పర్యవేక్షణలో ఉండేది. జిల్లా విద్యాధికారి ప్రతిరోజు డిప్యూటి డిఇవోలు, మండల ఎంఇవోలు పర్యవేక్షిస్తూ పటిష్ట విద్యావిధానం అమలుకు కృషిచేసేవాళ్లు. వారంలో ప్రతి రెండు, మూడు రోజులు మారుమూల గ్రామం, తండాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలను సైతం ఆకస్మిక తనిఖీలు చేసి గైర్హాజరైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేవారు. విద్యార్థులకు సరియైన విద్యను అందించడంలో నిత్యం పర్యవేక్షణ ఉండటంతో ఉపాధ్యాయుల్లో కూడా ఒక రకమైన భయంతో విధులను నిర్వర్తించేవారు. ఉమ్మడి జిల్లాలుగా ఉన్న విద్యావిధానానికి, కొత్త జిల్లాల విధానం వచ్చినప్పటి నుంచి మొత్తం విద్యావిధానం రూపురేఖలే మారిపోయాయని చెప్పవచ్చు. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో ఉన్న పది జిల్లాలను ముప్పైఒక జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాలుగా జిల్లా స్థాయి అధికారులను నియమించి మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండాలని భావించిన ప్రభుత్వం ఆలోచన బాగున్నా విద్యావిధానంలో చూస్తే మాత్రం ఇంకాస్త వెనుకబడిపోయిందని చెప్పవచ్చు. ఇరవై నుంచి ముప్పై మండలాలతో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. కాని సరిపడ మండలాలకు విద్యాధికారులను కేటాయించనే లేదు. ఒక్కొ మండల విద్యాధికారి నాలుగైదు మండలాలకు ఇంచార్జ్‌లకు పనిచేస్తున్నారు. అసలు వారెక్కడ ఉంటున్నారో, ఎక్కడ పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు. చాలా మంది మండల విద్యాధికారులు వారి సొంత పనులకు వెళుతూ కూడా ఏదైనా సమస్య వచ్చిందని చెప్పినా, ఉపాధ్యాయులు గైర్హాజరు విషయంపై సమాచారం ఇచ్చిన కనీస స్పందించిన వారే కరువయ్యారు. తాము శిక్షణలో జిల్లా కార్యాలయంలో ఉన్నామని చెపుతున్నారు కాని ఎక్కడున్నారంటే సమాధానమే లేదు. వీరికి తగ్గట్టుగా రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉపాధ్యాయులు పనితీరు కూడా మరీ అధ్వాన్నంగా తయారయ్యింది. ఇద్దరూ ఉన్న పాఠశాలల్లో ఒకరు ఒకరోజు వస్తూ, మరోకరు మరొక రోజు వస్తూ వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. మండల అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో ఉపాధ్యాయులు పనితీరును ప్రశ్నించేవారే రువయ్యారు. ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యావిధానమే చాలా బలమైనది. పునాది గట్టిగా ఉంటేనే కదా ఉన్నత ఫలితాలు సాధించడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతోంది. కాని బంగారు తెలంగాణలో విద్యావిధానం మరీ అధ్వాన్నంగా తయారయ్యింది. ఎవరూ ఎక్కడుంటారో, ఎవరూ ఇంచార్జ్‌ అధికారులే తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కో ఎంఇవోకు నాలుగైదు ఇంచార్జ్‌లు..

తెలంగాణలో ప్రాథమిక విద్యావ్యవస్థ నల్లేరు మీద నడకలా తయారయ్యింది. ప్రతి జిల్లాకు ఒక్క డిఇవో ఉండాల్సి ఉండగా అదీ కూడా ఇంచార్జ్‌ పాలనే దిక్కుగా మారిపోయింది. ఎంఇవోల వ్యవస్థ మాత్రం మరీ చెప్పలేనంతగా దిగజారిపోయింది. ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన అదిలాబాద్‌ జిల్లాలో అరవై, డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలాలకు మండల విద్యాధికారులే కరువయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న వారినే ఇంచార్జ్‌ ఎంఓవోలుగా నియమిస్తున్నారు. అదీ కూడా నాలుగైదు మండలాలకు నియమిస్తుడడంతో వారు ఎక్కడికి వెళుతున్నారో తెలియడమే లేదు. ఒక్కో మండలానికి మధ్య సుదీర్ఘ దూరం ఉండడంతో ఇంచార్జ్‌ మండల విద్యాధీకారులు ఎక్కడికి వెళ్లలేక, విధులకు సరియైన న్యాయం చేయలేకపోతున్నారు. ఒక్క అదిలాబాద్‌ జిల్లానే కాకుండా రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్న జిల్లాలలో కూడా అదే పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో అరకొర వసతులతో ఉంటున్న విద్యార్థులకు, నాణ్యమైన చదువులు లేక అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అరో సంవత్సరంలోకి అడుగెడుతున్న కనీస వసతులు లేని పాఠశాలలు వేలాదిగా ఉన్నాయి. అందరికి విద్య అందడం కోసం ఇప్పటికైనా మండలాల్లోని విద్యాధీకారులు నియామకం చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలకు ఒక్కరే ఎంఇవో..

వరంగల్‌ జిల్లా ఐదు భాగాలుగా విడిపోయి ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో 55 మండలాలు ఉన్నప్పటికి ఒకే ఒక్క రెగ్యులర్‌ ఎంఇవో విధులు నిర్వహిస్తున్నారు. మిగతా 54 మండలాలకు ప్రధానోపాధ్యాయులనే ఇంచార్జ్‌లుగా ఉంచారు. ఒక్కో ఇంచార్జ్‌కి ఐదారు మండలాలు అప్పగించారు. వారు అంతా సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు కావడంతో పాఠశాలలకు వెళ్లక, ఇటు ఎంఇవోలుగా బాధ్యతలు నిర్వర్తించక దేనికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నట్లు చెపుతున్నారు. అంతా వయస్సు పైబడడంతో అన్ని మండలాల బాధ్యతలు తామేలా నిర్వర్తించగలమని అంటున్నారు. ఒక్కో మండలానికి శివారు గ్రామాలు, గ్రామ పంచాయితీల గ్రామాలే కాకుండా, తండాలు, గూడాలు ఎన్నో ఉన్నాయి. ఇన్నింటిని ఒక్కరే పర్యవేక్షణ చేయాలంటే చాలా కష్టమని పని. ఏ గ్రామానికి, ఏ తండాకు ఎవరూ ఎప్పుడోస్తున్నారో, ఎప్పుడెళ్తున్నారో తెలియక ఉన్న ఉపాధ్యాయులు కూడా డుమ్మాలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని నోటిఫికేషన్‌ ద్వారా ఆ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించడమే లేదు. ఐదు సంవత్సరాలు ఇంచార్జ్‌ పాలనలకే దిక్కుగా మారిన చదువులు, రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ఇప్పటికైనా ప్రాథమిక విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close