Featuredస్టేట్ న్యూస్

తొలి విడత పరిషత్‌ ఎన్నికలు

  • బ్యాలెట్‌ పేపర్లు తారుమారు
  • స్వతంత్య్ర అభ్యర్థి పేరులేదని ఆందోళన
  • కాంగ్రెస్‌, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ
  • పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడతలో 2096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. ఎంపీటీసీ కోసం గులాబీ, జడ్పీటీసీ కోసం తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలను వినియోగించారు. వేసవి తీవ్ర దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరినప్పటికీ ఎండ వేడిమితో మధ్యాహ్నానికి పోలింగ్‌ కాస్త మందకొడిగా సాగింది. సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి ఓటర్లు మరింతగా తరలివచ్చారు. దీంతో పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వేసే అవకాశం కల్పించారు. అయితే, కొన్ని చోట్ల అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్‌ పత్రాలు సరిపోలేదు. మరికొన్ని చోట్ల తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఓటు వేయబోమంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్‌, తెరాస మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ ముగిసింది. 217 ఎంపీటీసీ స్థానాలకు సాయంత్రం 4గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. కొమ్రంభీం ఆసిఫాబాద్‌లో ఆరు గ్రామాలు, మంచిర్యాల జిల్లాలో 7గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7గ్రామాలతో పాటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మూడు, ములుగు జిల్లాలో రెండు గ్రామాల్లో పోలింగ్‌ ముగిసింది. రంగారెడ్డి మొయినాబాద్‌ మండలం హజీజ్‌నగర్‌లోని 111 నంబర్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్‌ నిలిచింది. ఒక గ్రామానికి చెందిన బ్యాలెట్‌ పత్రాలు మరో గ్రామానికి చేరడంతో గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు ఇక్కడా కాసేపు పోలింగ్‌ నిలిపివేశారు. మరోవైపు ఇదే కారణంతో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం షేరిగూడెంలో కూడా పోలింగ్‌ నిలిచింది. జనగామకు చెందిన బ్యాలెట్‌ పత్రాలు షేరిగూడెంకు వచ్చాయని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. బ్యాలెట్‌ పత్రంలో స్వతంత్ర అభ్యర్థి జయమ్మ సిలిండర్‌ గుర్తు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న చౌటుప్పల్‌ ఆర్డీవో సురేశ్‌కుమార్‌ పరిస్థితిని సవిూక్షించారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్‌), కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లాలోని గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో పోలింగ్‌ బూత్‌లో ప్రచారంతో ఈ గొడవ చోటు చేసుకుంది. ఓటు వేస్తామంటూ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లిన ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు.. ఓటు వేయకుండా పోటాపోటీగా ప్రచారం చేయడం ప్రారంభించారు. దీంతో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలంలో ఇరువర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలను సముదాయించి శాంతిపజేశారు. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం దుద్దాగు గ్రామాన్ని పంచాయతీ చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించారు. వంటావార్పు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామ ప్రజలతో పోలీసులు, ఎన్నికల రిటర్న్నింగ్‌ అధికారుల చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోయింది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు గ్రామానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. దీంతో అక్కడ ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. అదేవిధంగా మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం చింతగూడలో ఓటర్లు ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు. ఓటు వేయడానికి తమకు డబ్బు పంచడం లేదని ఓటర్ల నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్‌ జిల్లాలోని కీసరలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డిపై దాడి జరిగింది. పోలింగ్‌ కేంద్రం వద్ద సుధాకర్‌ రెడ్డి పై సర్పంచ్‌ మాధురి వర్గీయుడు దాడి చేశారు. దీంతో కీసరలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. వేసవి కావడంతో 7గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఉదయం వేళలలో పోలింగ్‌ శాంతం భారీగా నమోదైంది. కాగా మధ్యాహ్నం వేళ పోలింగ్‌ మందగించి మళ్లీసాయంత్రానికి పుంజుకుంది. ఇదిలాఉంటే మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు దంపతులు ఓటు

హక్కు వినియోగించుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరీ మండలం కేంద్రంలోని 8 వార్డులో ఎర్రబెల్లి దయాకరరావు దంపతులు ఓటేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా తెరాసా అభ్యర్థుల వైపే ఉన్నారని, అన్ని ప్రాంతాల్లో తెరాస జెండాను ఎగురవేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్‌ కంకణబద్దులై ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ రాష్ట్రానికి చేస్తున్న సేవలను చూసి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని దయాకర్‌ అన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close