తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం..

0

  • మండుతున్న ఎండలు
  • పెరగనున్న వడగాల్పులు
  • బయపడుతున్న జనం
  • జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నడు. భానుడి ధాటికి జనం అల్లాడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు అధికంగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పగలే కాకుండా రాత్రివేళ కూడా వేడిగాలులు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని రోజులు ఇదే రకమైన వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే గానీ బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు ఏపీలోని చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 1.5 కిలోవిూటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడి వర్షం కురుసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 23 శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడి.. దాని ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడిమికి, వడగాల్పులకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలు దాటిందంటే బయటకు రాలేకపోతున్నారు. అత్యధికంగా కరీంనగర్‌ లో 45.6 డిగ్రీలు నమోదు కాగా.. జనగామలో 45.5 డిగ్రీలు, మహబూబాబాద్లో 45.3 డిగ్రీలు, పెద్దపల్లిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. మరోవైపు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్ణాటకకు అనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు పశ్చిమబెంగాల్‌ నుంచి తెలంగాణ విూదుగా దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటకు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

పెరగనున్న వడగాల్పులు!

రాష్ట్రంలో మరోసారి వడగాల్పులు పెరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 29 వరకు తీవ్రస్థాయిలో వడగాల్పులు ఉండొచ్చని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఎక్కువగా వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వడగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల మోస్తరు స్థాయిలో వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు రాయలసీమకు వర్షసూచన ఉన్నట్టు తెలిపింది. రాయలసీమలో పలుచోట్ల ముందస్తు రుతుపవన వర్షాలు కురిసే సూచన ఉన్నట్టు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది.అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

యాదాద్రికి ఎండల దెబ్బ

యాత్రికులకు తప్పని యాతన

యాదగిరిగుట్ట: ఒక వైపు విస్తరణ పనులు.. మరోవైపు మండే ఎండలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని వ్యాపారులను బేజారెత్తిస్తున్నాయి. అలాగే వచ్చే యాత్రికులు కూడా బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఉగ్రభానుడి దాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాటు తీవ్ర ఉక్కపోత, వేడి గాలులతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్ల విూదకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే నిప్పుల వర్షం కురుస్తుండడం, పొద్దంతా వేడి గాలులు వీస్తుండడంతో ఇంటా బయటా వేడి హడలెత్తిస్తున్నది. మధ్యాహ్నం ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులకు విఘాతం కలుగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పనులు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జరగడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ విస్తరణ పనుల్లో కొంత నెమ్మది కనిపిస్తోంది. ఇకపోతే వారంలో ఒకటి, రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో వ్యాపారాలు జరగక సతమతమవుతున్నారు. ఎండల తీవ్రతతోనూ భక్తుల రాక తగ్గుముఖం పట్టిందన్న వాదనలు ఉన్నాయి. నీటి ఇక్కట్లే కాకుండా వసతుల కరవు కూడా యాత్రికులను యాతన పాలు చేస్తోంది. అన్నీ కలిపి భక్తుల రాకకు ఆటంకాలవుతున్నాయని స్థానికులు అంటున్నారు. సెలవులు మొదలైనా రద్దీ మాత్రం అంతంతమాత్రమే ఉండటంతో దుకాణాలు, స్వామిదర్శన వరుసలు ఇలా వెలవెలబోయి కనిపించాయి. దీనికితోడు దేవుడి నిత్యరాబడి సైతం తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర రాజధాని నగరానికి సవిూపాన ఉన్న ఈ క్షేత్రానికి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వచ్చేవారు. కానీ మండుటెండల కారణంగా భక్తుల రద్దీ తగ్గడంతో ఆశించిన స్థాయిలో గిరాకీలేక పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇటీవల విస్తరణ పనులతో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేసవి వచ్చిందంటే చాలు ఆలయ పరిసరాలు, పట్టణ వీధులు కిటకిటలాడటం సహజం. ఇక అత్యధిక సంఖ్యలో వచ్చే భక్తులతో వ్యాపారస్థులు తమ బేరాలు జరుపుకుంటూ ఆర్థిక లావాదేవీలు పొందేవారు. ప్రస్తుతం మాత్రం దుకాణాల నెలసరి అద్దెలు చెల్లించడం కూడా కష్టంగానే మారిందని వ్యాపారస్థులు వాపోతున్నారు. స్థానికంగా బస సదుపాయాల కరవు తిష్టవేయడంతో వచ్చిన భక్తులు సైతం బసచేయలేక తిరుగు పయనమవుతున్నారు. దీంతోనూ వ్యాపారాలు కుంటుపడ్డాయని చెప్పక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here