ఢాకాలో అగ్ని ప్రమాదం

0

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 70మంది సజీవదహనమ య్యారు. వివరాల్లోకి వెళితే.. ఢాకాలోని రసాయన, ప్లాస్టిక్‌ గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో 70మంది సజీవ దహనం కాగా, మరో 50మంది గాయపడ్డారు. పాత ఢాకాలోని చౌక్‌బజార్‌ ప్రాంతంలో గల హజీ వాహెద్‌ మాన్షన్‌ గోదాములో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రసాయనాలను భద్రపరిచారు. అక్కడ గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న నాలుగు భవనాలకు వ్యాపించాయి. వీటిలో ఓ కమ్యూనిటీ సెంటర్‌ కూడా ఉంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రమాదంలో ఇప్పటివరకు 70మంది సజీవదహనమయ్యారు. మరో 50 మందిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. 37అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ.. గోదాం ఉన్న ప్రాంతంలో రహదారులు ఇరుగ్గా ఉండటంతో మంటలను అదుపుచేయడం కష్టంగా మారింది. కాగా.. భవనాల్లో ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అగ్నిమాపకసిబ్బంది యత్నిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో సహాయకచర్యలు ఆటంకం ఏర్పడింది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న భవనంలో రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లో ప్లాస్టిక్‌ గోదాంతో పాటు కొన్ని ఇళ్లు కూడా ఉన్నాయి. వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. గతంలో కూడా ఢాకాలో ఇలాంటి ఘెర అగ్ని ప్రమాదం సంభవించింది. 2010లో జరిగిన ఈ ఘటనలో సుమారు 120మంది మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here