ఎట్టకేలకు విడిపోయిన ఉమ్మడి హైకోర్టు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హైకోర్టు విభజనపై గెజిట్‌ నోటిఫికేషన్‌ను బుధవారం నాడు కేంద్రం విడుదల చేసింది.జనవరి 1వ తేదీ నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడ ఉమ్మడి హైకోర్టును విభజించాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు డిమాండ్‌ చేసింది.ఈ విషయమై పలుమార్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రంతో చర్చించారు. నాలుగేళ్ల విరామం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. ఉమ్మడి హైకోర్టును విభజించకుండా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అడ్డుకొన్నాడని టీఆర్‌ఎస్‌ నేతలు గతంలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రానికి చెందిన హైకోర్టుకు 16 మంది న్యాయమూర్తులు, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఏపీకి రమేష్‌ రంగనాథ్‌, సి.ప్రవీణ్‌ కుమార్‌, వెంకటశేషసాయి, దామ శేషాద్రినాయుడు, సీతారామ్మూర్తి, దుర్గాప్రసాదరావు, టి. సునీల్‌ చౌదరి, ఎం. సత్యనారాయణమూర్తి,జి. శ్యామ్‌ ప్రసాద్‌, ఉమాదేవి, బాలయోగి, రజనీ, సోమయాజులు, విజయలక్ష్మీ, ఎం, గంగారావు, వెంకటనారాయణలను ఏపీకి కేటాయించారు. ఇక తెలంగాణకు వెంకట సంజయ్‌ కుమార్‌, రాంచందర్‌ రావు, రాజశేఖర్‌ రెడ్డి, సి.నవీన్‌ రావు,కోదండరామ్‌ చౌదరి, బి.శివశంకర్‌ రావు, షమీమ్‌ అక్తర్‌, పి. కేశవరావు, అభినంద్‌ కుమార్‌ షావిలై, అమర్‌ నాథ్‌ గౌడ్‌ లను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఉన్న భవనంలోనే కొనసాగుతోంది. ఏపీ హైకోర్టుకు అమరావతిలో ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణం చివరి దశలో ఉంది. ఏపీ హైకోర్టు అమరావతిలోని కొత్త భవనంలో పనులను ప్రారంభించనుంది. హైకోర్టు విభజనకు సంబంధించి కొన్ని రోజులకు ముందు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇవాళ ఢిల్లీలో తెలంగాణ సీఎంకేసీఆర్‌ ప్రధానమంత్రి మోడీని కలుసుకొన్న వెంటనే హైకోర్టు విభజనకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here