స్థానికంలో పోరు..హోరు

- పల్లెల్లో వేడెక్కిన పరిషత్ ప్రచారం
- నేటితో తొలివిడత ప్రచారానికి తెర
- ఏకగ్రీవాలపై పార్టీల నజర్
- కులసంఘాలకు తాయిలాలతో ప్రయత్నాలు
- 2జెడ్పీటీసీ..69ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్): జిల్లాల్లో పరిషత్ పోరుతో ప్లలెలు వేడెక్కుతున్నాయి. మొదటి విడత ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుండగా, అభ్యర్థులు గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్కు చెందిన అభ్యర్థులు అన్ని అస్త్రాలకు తెరలేపారు. పరిషత్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు గెలుపు కోసం అన్నిపార్టీల వారు పడరాని పాట్లు పడుతున్నారు. ఓటరల్ను మచ్చిక చేసుకోవడానికి అసవరమైన తాయిలాలు ప్రకటిస్తున్నారు. గ్రామాల్లో కుల సంఘాల ఓట్లు కీలకంగా మారడంతో గంపగుత్తగా ఓట్లు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు వాటిపై దృష్టి కేంద్రీకరిం చారు. కులసంఘాల పెద్దలతో మాట్లాడుతూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు రాబట్టుకునేందుకు హామీలు కుమ్మరిస్తున్నారు. ఈ నెల 4తో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ¬రెత్తిస్తున్నారు. ఎండ తీవ్రతతో ఉదయం, సాయంత్రం ప్రచారం చేస్తున్న అభ్యర్థులు మిగిలిన సమయంలో కుల సంఘాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గ్రామాల్లో అభ్యర్థి గెలుపు, ఓటముల్లో కుల సంఘాల పాత్ర కీలకంగా ఉంటుంది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు కూడా కుల సంఘాల పెద్దలను కలుస్తూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఒక్కో కుల సంఘానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతుంది. కొన్ని చోట్ల తాను గెలుపొందితే కుల సంఘానికి భవనం నిర్మించి ఇస్తామంటూ హామీలు కుమ్మరిస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల కుల సంఘాలకు కావాల్సిన టెంటు, వంట సామాగ్రిని కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో సగటున 2500 ఓట్లు ఉండగా, రెండు, మూడు కుల సంఘాలను కలిసి గంప గుత్తగా ఓట్లు రాబట్టుకుంటే గెలుస్తామనే భావనతో అభ్యర్థులు జోరుగా తాయిలాలు ప్రకటిస్తున్నారు.
పరిషత్ పోరులో బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం హామీలు కుమ్మరిస్తున్నారు. గ్రామాల్లో ప్రభావం చూపే ముఖ్య నాయకులను కలుస్తూ హామీలు ఇస్తున్నారు. తాము గెలుపొందితే మీకు సహాయపడు తానంటూనే పార్టీ అధినేతలతో మాట్లాడిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభావం చూపే నాయకులతో ఏకంగా ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో మా అభ్యర్థిని గెలిపించాలని, మీకు ఏ పని అంటే ఆ పని చేసి పెడుతామంటున్నారు. ఇంకొందరికి ముందస్తుగానే నగదు కూడా అందజేస్తున్నట్లు ప్రచారం కూడా సాగుతుంది. గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న ప్రభావాన్నిబట్టి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అప్పజెప్పుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. యూత్ సంఘాలను కూడా పిలిచి మాట్లాడుతున్నారు. కిట్లు కొనిపెడతామంటూ చేరదీస్తున్నారు. అలాగే మహిళా సంఘాలను కూడా మచ్చిక చేస్తున్నారు. అధికార పార్టీ మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తున్న పనులను వివరిస్తూనే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.
తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీమయ్యాయి. ప్రత్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో రెండూ అధికార తెరాస వశమయ్యాయి. దీంతో ఆ రెండు స్థానాలూ గులాబీ ఖాతాలో పడ్డాయి. తొలి దఫాలో 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. తెరాస ఖాతాలో 67, కాంగ్రెస్ ఖాతాలో రెండు స్థానాలు పడ్డాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో పది ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషం. మహబూబాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆరు చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొదటి విడతలో 2166 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. 69 ఏకగ్రీవం కావడంతో మిగతా 2097 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ జరగనుంది. 197 జెడ్పీటీసీ స్థానాలకు గాను రెండు ఏకగ్రీవం కావడంతో 195 స్థానాలకు అదే రోజు పోలింగ్ నిర్వహిస్తారు.