లక్ష్యం కోసం పోరాడండి

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): విద్యార్థుల తల్లిదండ్రులు నెరవేరని తమ కలలను పిల్లల ద్వారా నెరవేర్చుకునేందుకు ప్రయత్నించవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. పిల్లలను ఒత్తిడి పెట్టి వారిలో భయాన్ని పెంచవద్దన్నారు. మరో రెండు నెలల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ ‘పరీక్షా పే చర్చ 2.0’ కార్యక్రమం జరిగింది. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రధాని ముచ్చటించారు.పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దని, పరీక్షలే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలు నెరవేర్చాలని అనుకోవద్దని తెలిపారు. తల్లిదండ్రులకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే… విూరు నెరవేర్చుకోలేకపోయిన విూ కలలను విూ పిల్లలు నిజం చేస్తారని ఆశించకండి. ప్రతి పిల్లాడికీ తన సొంత సామర్థ్యం, బలాలు ఉంటాయి. ప్రతి పిల్లాడిలోని ఈ సానుకూలాంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.. అని ప్రధాని పేర్కొన్నారు. కాగా చదువుల్లో టెక్నాలజీ కారణంగా ఎదురవుతున్న ప్రతికూల ప్రభావంపై ఓ తల్లి అడిగిన ప్రశ్నకు ప్రధాని స్పందిస్తూ… టెక్నాలజీ అనేది విద్యార్థుల మేథో వికాసానికి తోడ్పడాలని పేర్కొన్నారు. విద్యార్థులకు టెక్నాలజీ తెలియడం మంచిదికాదని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. విద్యార్థులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం తెలియడం మంచిదే. టెక్నాలజీ అనేది విద్యార్ధుల మేధస్సు విస్తరించేలా ఉండాలి. వినూత్న ఆలోచింప జేయాలని పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై మాట్లాడుతూ.. జీవితంలో పరీక్షలు అనేవి చాలా ముఖ్యం. అయితే ఎవరూ వాటి గురించి ఆందోళన చెందకూడదు. ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ కాదు అన్న ఒకే ఒక్క భావనతో ఉండకూడదు. కాబట్టి మిమ్మల్ని విూరే ఇలా ప్రశ్నించుకోండి. ఇది విూ జీవితానికి సంబంధించిన పరీక్షా లేక కేవలం టెన్త్‌, ఇంటర్‌ వంటి గ్రేడ్ల కోసం రాస్తున్న పరీక్షా?అని ప్రశ్నించుకోండి. ఒక్కసారి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే విూలోని మానసిక ఒత్తిడి మొత్తం మాయమైపోతుంది.. అని ప్రధాని పేర్కొన్నారు. సమాజం ఆశావహ దృక్పథంతో ఉండాలి కానీ ప్రతికూలంగా ఉండకూడదు. ఎవరైనా మనపై ఆశలు పెట్టుకున్నారంటే… మనపై వారికి నమ్మకం ఉందని అర్థం. కాబట్టి ఆ అంచనాల ఒత్తిడికి లొంగకుండా, మనలను మనమే సమర్థులుగా తయారవ్వాలి.

దీన్ని సానుకూలంగా మలుచుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. గత ఏడాది కేవలం దిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లోని విద్యార్థులే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు రష్యా, నేపాల్‌, నైజీరియా, ఇరాన్‌, దోహా, కువైట్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌లలో చదువుతున్న పలువురు భారతీయ విద్యార్థులు కూడా వచ్చారు. పరీక్షలు ముఖ్యమైనవి కానీ.. అవి మన జీవితానికే పరీక్షలు కావని, అవి జీవితాలను ఆపవని అన్నారు. పిల్లలు విఫలమైనప్పుడు కూడా తల్లిదండ్రులు చిన్నారుల వెన్ను తట్టి ప్రోత్సహించాలని తెలిపారు. తన కొడుకు ఆన్‌లైన్‌ గేమ్స్‌పై చాలా ఆసక్తి చూపుతున్నాడని, ఏం చేయాలని ఓ తల్లి మోదీని ప్రశ్నించగా.. అది పబ్జి నా అని మోదీ అడిగారు. సాంకేతిక వల్ల లాభాలూ ఉన్నా నష్టాలు కూడా ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు దగ్గరుండి సాంకేతికత సాయంతో కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. విూరు లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం క్షమార్హం.. కానీ విూ లక్ష్యం చిన్నదైతే మాత్రం అది క్షమార్హం కాదని మోదీ వెల్లడించారు. విూరు రోజుకు 17 గంటలు పనిచేయడానికి ఏం అంశం మిమ్మల్ని ప్రోత్సహిస్తోందని ఓ విద్యార్థిని మోదీని ప్రశ్నించగా.. ఓ తల్లి కుటుంబం కోసం 24 గంటలు శ్రమించినట్లుగానే, నేను నా 1.25కోట్ల భారతీయ కుటుంబం కోసం శ్రమిస్తున్నానని సమాధానమిచ్చారు. రోజులోని 24 గంటలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలని మోదీ విద్యార్థులకు సూచించారు. సమయం సద్వినియోగం చేసుకోవడానికి ఎంబీఏలు అవసరం లేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here