Thursday, October 24, 2024
spot_img

బిఆర్‌ఎస్‌పై మహిళా బిల్లు ప్రభావం

తప్పక చదవండి
  • జాబితాలో మహిళలకు సీట్లు పెంచే ఛాన్స్‌
  • పార్టీలో జోరుగా చర్చిస్తున్నట్లుగా ప్రచారం

హైదరాబాద్‌ : మహిళల కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని మంత్రి కెటిఆర్‌ ప్రకటించారు. కవితమ్మ వల్లనే మోడీ తలొగ్గి మహిళా బిల్లును తీసుకుని వచ్చారని ఆమె అనుచరగణం ప్రచారం చేసుకుంది. ఫోటోలకు పాలాభిషేకం చేసుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా కవిత పోరాటం చేశారని కితాబునిచ్చారు. అయితే మహిళా బిల్లు పాసయినా మహిళా కోటా ఇప్పట్లో అమలు కాదు. ఈ క్రమంలో సిఎం కెసిఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్న అవకాశం ఉందన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. మహిళలకు సీట్ల కేటాయింపులో పెద్దపీట వేస్తారని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రకటించిన పలు సీట్ల స్థానంలో మహిళల కోసం మార్పులుచేర్పులు జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మహిళాబిల్లు కన్నా ముందే తాము సీట్లను కేటాయించి అమలు చేశామన్న క్రెడిట్‌ కోసం ఈ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తొలి పార్లమెంట్‌ సీటు కవితకు దక్కనుంది. ఇక అసెంబ్లీ సీట్లల కూడా కనీసం ఓ పదినుంచి 20 శాతం మహిళలకు కేటాయించే ప్రతిపాదన కెసిఆర్‌ పరిశీలనలో ఉందని పార్టీలో చర్చించుకుంటున్నారు. దాదాపు నెలన్నర క్రితం కేసీఆర్‌ ప్రకటించిన మొదటి జాబితా అభ్యర్ధుల్లో మార్పులు చేయకతప్పదని అనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ ఎలాగూ వస్తుందన్న యోచనలో మిగిలిన పార్టీల కన్నా ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే ఉపయోగం ఉంటుందని కెసిఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. 115 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. నిజంగా కేసీఆర్‌ ఆలోచన ఒకరకంగా ఇతర పార్టీలకు సవాల్‌ విసిరిందని అనడంలో సందేహం లేదు. అయితే మొదటి జాబితా ప్రకటించిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సడెన్‌ గా మార్పులు జరిగిపోతున్నాయి. దాని ప్రభావం తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ జాబితా మీద కూడా పడుతుందని అంటున్నారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ అయ్యింది. బిల్లు చట్టమైన తర్వాత 2029 న సార్వత్రిక ఎన్నికల నుండి అమల్లోకి వస్తుంది. 2024 ఎన్నికల నుండి వర్తించకపోయినా బిల్లు చట్టంగా మారగానే వెంటనే మహిళా నేతలైతే టికెట్లు డిమాండ్‌ చేస్తారు. అంటే 2024 సార్వత్రిక లోక్‌ సభ ఎన్నికల్లోపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలోను మహిళలకు రిజర్వేషన్‌ వర్తింపచేయాల్సి ఉంటుంది. లేకపోతే మహిళల ఓట్లు పార్టీలకు పడేది అనుమానమే. అందుకనే కేసీయార్‌ జాబితాలో మార్పులు చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇకపోతే చాలామంది సిట్టింగులపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. వ్యతిరేకత మామూలు జనాల్లోనే కాకుండా పార్టీ నేతలు, క్యాడర్లో కూడా పెరిగిపోతోంది. దీన్ని నిశితంగా గమనిస్తున్న కేసీఆర్‌ ఈ కారణాలను చూపించి మొదటిజాబితాను రద్దుచేసినా ఆశ్చర్యపోక్కర్లేదని పార్టీలోనే చర్చ కనిపిస్తోంది. మహిళా అభ్యర్థుల కోసం అంటూ మార్పులకు దిగే ఛాన్స్‌ ఉందన్న వాదన వస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు