Thursday, September 19, 2024
spot_img

మల్లోసారి ఆగమవ్వొద్దు..

తప్పక చదవండి
  • ఆలోచించి హస్తం గుర్తుపై ఓటు వేయండి..
  • బీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి.. కాంగ్రెస్‌దే కందనూలు..
  • ఎమ్మెల్యే, ప్రభుత్వంపై పెరిగిన తీవ్ర వ్యతిరేకత
  • సైలెంటైన బీఆర్‌ఎస్‌ ద్వితీయశ్రేణి నాయకులు
  • రాజేష్‌రెడ్డికి జై కొడుతున్న నియోజకవర్గ ప్రజలు

నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్‌ జెండా ఎగిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊరూరా కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారు. గడపగడపకు కాంగ్రెస్‌తో ప్రజల మధ్యకు వెళ్లిన ఆయనకు జనం నీరాజనాలు పడుతున్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేపట్టిన పథకాల అమలులో విఫలం కావడంతో ప్రభుత్వంపై, ఎమ్మెల్యే తీరుపై, ఆయా మండలాల్లో కొందరి నాయకుల పెత్తనం వల్ల పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలైన దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. ఊరికి ఒకట్రెండు చొప్పున ఇచ్చినా అవి కూడా బీఆర్‌ఎస్‌ అనుచరులకే అందించడం జరిగింది. దీనివల్ల అర్హులైన చాలా మంది నిరుపేదలకు అందలేదు. ఇక డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఒక్క పెద్దముద్దునూరులో మాత్రమే ఇచ్చారు. ఒక్క గ్రామంలో కూడా ఒక్క ఇంటిని నిర్మించలేదు. అదే కాంగ్రెస్‌ పాలనలో ఊరూరా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. ఇప్పటికీ చాలా మంది ఆ ఇండ్లల్లోనే నివసిస్తున్నారు. ఇక ప్రతి పథకం అమలులో ఎమ్మెల్యే సంతకం చేయాల్సి ఉండటంతో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ లాంటి పథకాలు అందలేదు. స్థానిక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుల వద్దకు వెళ్తే పార్టీలోకి చేరాలనడం, మా పార్టీ కాదు కదా అంటూ విమర్శించడం జరుగుతోంది. ఇవి ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయి. ఎంతో అభివృద్ధి చేశానని భావించిన స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డికి ప్రభుత్వ పథకాలు గుదిబండగా మారాయి. గ్రామాల్లో ఏ నోట చూసినా, ఏవర్గం చూసినా కాంగ్రెస్‌కు ఓటేయాలనే చర్చలే జరుగుతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, పింఛన్‌దారులు సైతం కాంగ్రెస్‌వైపు మళ్లడం బీఆర్‌ఎస్‌ నేతలకు విజయంపై ఆశలను రోజురోజుకూ సన్నగిల్లజేస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ ఉద్యోగులు కాంగ్రెస్‌కే 90శాతం ఓటింగ్‌ వేసినట్లు తెలుస్తోంది. ఇక సర్వే ఫలితాల్లోనూ కాంగ్రెస్‌ పేరే వస్తుండటంతో మూడోసారి హ్యాట్రిక్‌ సాధించి మంత్రి పదవిని అలంకరిస్తారని భావించిన ఎమ్మెల్యే అనుచరులకు ఈ పరిస్థితులు మింగుడుపడనీయడం లేదు. ప్రస్తుత పరిస్థితులతో ఎమ్మెల్యే మర్రి సైతం అసహనం, అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే కాంగ్రెస్‌కు మాత్రం రోజురోజుకూ గ్రాఫ్‌ పెరుగుతూ వస్తోంది. ఫలితంగా అధికారులు, పోలీసు వర్గాలు సైతం కాంగ్రెస్‌ నాయకుల పట్ల మెతకవైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ పరిస్థితులను అంచనా వేస్తున్న బీఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నాయకులు సైలెంట్‌గా ఉండటమే మేలని భావిస్తున్నట్లుగా (ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేకు, కొందరు నేతలకు స్థానిక కారణాలతో కొంత గ్యాప్‌ ఉంది. ఎంఎల్‌సీ దామోదర్‌ రెడ్డికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో రెండికి చెడ్డ రేవడిగా మిగలకుండా ద్వితీయ శ్రేణి నాయకులు నిశ్శబ్ధం పాటిస్తున్నట్లుగా, పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారని, గ్రామాల్లో ప్రచారం కూడా మొక్కుబడిగా చేస్తున్నారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంఎల్‌సీ దామోదర్‌ రెడ్డితో చాలా మంది బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు లోలోపల టచ్‌లో ఉన్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యే మర్రి రాజకీయ ఆధిపత్యం, వివాదాస్పద వ్యాఖ్యలు చూసిన మేధావులు, సామాన్యులు సైతం సౌమ్యులైన కూచుకుళ్లను గెలిపించాలని అంతర్గత సమావేశాల్లో నిర్ణయించుకున్నారు. ఇప్పటికే స్వచ్చందంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొన్న న్యాయవాదులు, ఉద్యోగులు, యువత, మైనార్టీలు, గిరిజనులు కాంగ్రెస్‌కు మద్దతుగా తీర్మానించుకొన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణతో పాటుగా కందనూలు కాంగ్రెస్‌దేనన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు