No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

కొడంగల్‌లో చెల్లని నువ్వు కామారెడ్డిలో చెల్లుతావా?

తప్పక చదవండి
  • గంప గోవర్ధన్‌ ఆహ్వానం మేరకు కామారెడ్డిలో సిఎం పోటీ
  • కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేయడం మన అదృష్టం
  • మాచారెడ్డి మండలం గజ్యా నాయక్‌ తండాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్‌

కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రం సంధించారు. కొడంగల్‌లో చెల్లని నువ్వు కామారెడ్డిలో చెల్లుతవా..? అని మంత్రి ప్రశ్నించారు. మాచారెడ్డి మండలం గజ్యా నాయక్‌ తండాలో ఏర్పాటు చేసిన రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ప్రతిపక్షాల ఫ్యూస్‌లు ఎగిరిపోయాయి. కామారెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది. రాష్ట్రం మొత్తం కామారెడ్డి వైపు చూస్తున్నది. గంప గోవర్ధన్‌ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఒక నాయకునికి కావల్సింది ప్రాంతం అభివృద్ది, ప్రజల సంక్షేమం. రాష్ట్రంలోని 119 నియోజిక వర్గాల ప్రజలు కేసీఆర్‌ గారిని అభిమానిస్తున్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేయడం మన అదృష్టం. ప్రభుత్వం వచ్చాక వచ్చే అరు నెలల్లో మద్దిమల్ల నుంచి మాచారెడ్డికి కాళేశ్వరం ద్వారా సాగునీరు తీసుకొస్తాం’ అని అన్నారు. ‘గిరిజన బిడ్డల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రాబోయే రోజుల్లో అర్హులందరి పోడు భూములకు పట్టాలు ఇస్తాం. 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన నాయకుడు కేసీఆర్‌. కామారెడ్డి కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేస్తరు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు ఓటు వేస్తే తప్పు చేసిన వాళ్లం అవుతాం. సిమెంట్‌, సలకా ఇచ్చే నాయకులను నమ్మవద్దు. షబ్బీర్‌ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికే భయపడుతున్నడు. రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే కామారెడ్డి నుండి పోటీ చేయాలి. కొడంగల్‌లో చెల్లని నువ్వు కామారెడ్డిలో చెల్లుతవా’ అని మంత్రి ప్రశ్నించారు. ‘మాచారెడ్డి మండలం ఉద్యమాల గడ్డ. గత ప్రభుత్వాలు బాగా పని చేసి ఉంటే ఇప్పుడు ఇంత గోస ఉండేది కాదు. 11 దఫాలు 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు సాయం అందించిన నాయకుడు కేసీఆర్‌. కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ ఉంటే వార్త. ఇప్పుడు 24 గంటల కరెంట్‌. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్‌ తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రంలో 5 గంటల కరెంట్‌ ఇస్తున్నమని అన్నడు. అది చూసి మన రైతులు ముక్కున వెలేసుకున్నరు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేస్తే మళ్ళీ చీకటి రోజుల్లోకి వెళ్తాం. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలి’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు.
‘మూడోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3 వేల చొప్పున అర్హులైన ఆడబిడ్డలకు ఇస్తాం. కేసీఆర్‌ భీమా పథకం ద్వారా తెల్ల రేషన్‌ కార్డు కలిగిన అన్ని కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తాం. ఇప్పుడు తెలంగాణలో 3.5 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిచే స్థాయికి ఎదిగాం. దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు 15వ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు మొదటి స్థానానికి చేరాం. అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్‌ కార్డుదారులందరికి సన్న బియ్యం ఇస్తాం. మన రాష్ట్రంలో మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకూ కేసీఆర్‌ పథకాలు ఉన్నాయి’ అని మంత్రి చెప్పారు. ‘తెలంగాణలో హనుమంతుని గుడిలేని ఊరు లేదు. కేసీఆర్‌ పథకం లేని కుటుంబం లేదు. కార్యకర్తలే కథానాయకుల్లా మారి ప్రజలు ఓట్లు వేసే విధంగా ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడరాని భారీ మెజారిటీ కామారెడ్డి నుంచి రావాలే. 30 రోజులు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయండి. కామారెడ్డిని సిరిసిల్ల కంటే ఎక్కువ చూసుకుంటా’ అని మంత్రి కేటీఆర్‌ హావిూ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, ఫుడ్స్‌ కార్పోషన్‌ మాజీ చైర్మన్‌ తిర్మల్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు