No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

తండ్రి సెంటిమెంట్ ఎవరికి ఫలించేను..!

తప్పక చదవండి
  • కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇద్దరు మహిళల తండ్రి సెంటిమెంట్ పోటీ ఆసక్తికరం..
  • ప్రచారంలో ఇరువురు ఎదురుపడిన సందర్బంలో పరస్పరం ఆలింగనం..
  • నియోజకవర్గంలో ఇద్దరు ఆడబిడ్డల ప్రశాంత రాజకీయ పోరు
  • ఎన్నికల బరిలో నిలిచి గెలిచేది ఎవరు.?
  • వెన్నెల, లాస్య నందితల రాజకీయ ప్రచారంపై తీవ్ర చర్చ

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరో వైపు టికెట్లు ఖరారైన అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఓటర్లను కలుసుకునే ప్రక్రియలో మునిగిపోయారు. రాష్ట్రంలోని ఒక నియోజకవర్గంలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఆ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఇద్దరూ మహిళలే ఉండటమే కాకుండా, తండ్రి సెంటిమెంట్ పని చేస్తుందనే నమ్మకంతో వారు ఎన్నికల బరిలో దిగడం గమనార్హం. ఆ నియోజకవర్గం పేరు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం. రాజధాని పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే జి. సాయన్న కుమార్తె లాస్య నందిత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల బరిలో నిలిచారు. సాయన్న, గద్దర్ ఇద్దరూ ఇదే ఏడాదిలో మృతి చెందారు. కంటోన్మెంట్ నుంచి జి. సాయన్న పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సెంటిమెంట్ బలంగా ఉన్న రోజుల్లో కూడా సాయన్న తెలుగుదేశం టికెట్‌పై గెలిచారంటే ఆయన వ్యక్తిగత చరిష్మా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సాయన్న భారీ మెజార్టీతో గెలిచారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూనే అనారోగ్యంతో మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీ ఆయన కుమార్తె లాస్య నందితకు టికెట్ ఇచ్చింది. కంటోన్మెంట్ పరిధిలో సాయన్న కుటుంబానికి మంచి పేరున్నది. సౌమ్యుడు, విద్యాధికుడు కావడంతో పాటు అవినీతి మరకలు ఏవీ లేని నాయకుడిగా సాయన్నకు పేరున్నది. లాస్య నందిత కూడా కార్పొరేటర్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తన తండ్రి చేసిన అభివృద్ధి పనులు, ఆయనకు ఉన్న మంచి పేరు తనను గెలిపిస్తుందని లాస్య ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

మరోవైపు ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల తొలి సారి ఎన్నికల బరిలో దిగారు. మొదట్లో గద్దర్ కొడుకు సూర్యంకు టికెట్ దక్కుతుందని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ చివరకు వెన్నెల వైపు మొగ్గు చూపింది. గద్దర్ అంటే కేవలం కంటోన్మెంట్‌కే పరిమితం అయిన వ్యక్తి కాదు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజా గాయకుడిగా మంచి పేరున్నది. గద్దర్ మరణించిన సమయంలో నగరంలో జరిగిన అంతిమ యాత్రకు లక్షల మంది ప్రజలు వెంట నడిచారు. గద్దర్ మరణం నుంచి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. అదే సమయంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో వెన్నెల ప్రచారంలో దిగిపోయారు. తన తండ్రి బతికి ఉన్న సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలకు హాజరైన విషయాన్ని వెన్నెల గుర్తు చేస్తున్నారు. విప్లవ ఉద్యమాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి పాత్రను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. గద్దర్ పై ఉన్న అభిమానం తప్పకుండా తనను గెలిపిస్తుందని ఆమె ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రి వదిలి వెళ్ళిన ఆయన గొంగడిని ఆయన గుర్తుగా వెన్నెల నిత్యం తన భుజంపై వేసుకొని కనిపించడం అందరినీ ఆకర్షిస్తోంది.

కంటోన్మెంట్‌లో ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరూ మహిళలే కాకుండా.. తొలి సారి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న వారే కావడం గమనించదగ్గ విషయం. అంతే కాకుండా ప్రజల్లో వారి తండ్రులకు మంచి పేరు ఉండటంతో గెలుపును అంచనా వేయడం కష్టంగా మారింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేయకుండానే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను లాస్య ప్రచారంలో వివరిస్తుండగా.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వెన్నెల ప్రజలకు చేరవేస్తున్నారు. మొత్తానికి తమ తండ్రుల మంచి పేరే తమను కాపాడుతుందని ఇరువురు భావిస్తున్నారు. మరి ఎవరివైపు తండ్రి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో డిసెంబర్ 3న కంటోన్మెంట్ ప్రజల తీర్పు చెప్పబోతోంది.

ఎన్నికల ప్రచారంలో ఎదురుపడి.. ఆలింగనం చేసుకున్న ఆడబిడ్డలు

సర్వసాధారణంగా ఎన్నికల పోటీలో నిలబడ్డ ప్రత్యర్థులు ఇరువురు ఒకచోట ఎదురుపడినప్పుడు పరస్పరం మొహం కూడా చూడడానికి ఇష్టపడని నేతలను ఎందరినో మనం చూస్తుంటాం. కానీ దానికి భిన్నంగా అంటోన్మెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఈ ఇద్దరు ఆడబిడ్డలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎదురుపడ్డారు. ప్రత్యర్థులైన ఈ ఇరువురు ఆప్యాయతతో ఆలింగనం చేసుకొని, ఒకరిని మరొకరు ఓటు తనకే వేయాలని ప్రేమపూర్వకంగా కోరుకోవడం, సదరు సన్నివేశం చూసిన వారందరినీ ఆశ్చర్యానికి, అహల్లాదానికి గురిచేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు