Thursday, September 19, 2024
spot_img

సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్‌ దాడి

తప్పక చదవండి
  • 100మందికిపైగా మృతి
  • మరో 240 మందికి తీవ్ర గాయాలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

సిరియాలో జరిగిన డ్రోన్‌ దాడిలో 100 మందికిపైగా మరణించారు. మరో 240 మంది గాయపడ్డారు. హోమ్స్‌ ప్రావిన్స్‌?లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్‌ వేడుక జరుగుతున్న సమయంలో మిలటరీ అకాడమీపై ఈ దాడి జరిగింది. మృతుల్లో మిలిటరీ క్యాడెట్స్‌ కుటుంబసభ్యులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మిలిటరీ కాలేజీలో శిక్షణ పూర్తికావడం వల్ల గురువారం క్యాడెట్స్‌కు గ్రాడ్యుయేషన్‌ డేను నిర్వహించారు. ఈ వేడుకలో వారి కుటుంబ సభ్యులు, సైనిక అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేడుక ముగిశాక అధికారులు, మిలిటరీ క్యాడెట్స్‌ అక్కడి ప్రాంతం నుంచి బయటకు వెళ్తుండగా డ్రోన్‌ దాడి జరిగింది. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా రక్తపు గాయాలతో, ఆహాకారాలతో భీతావాహ దృశ్యం కనిపించింది. బాధితుల ఆర్తనాదాలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వెంటనే తేరుకున్న సైనికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు తమవారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయుధ ఉగ్ర సంస్థలే గ్రాడ్యుయేషన్‌ డేను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు సిరియా మిలిటరీ ఆరోపించింది. ఈ దాడికి ప్రతిచర్య తప్పదని, ఉగ్రవాద గ్రూపులు ఎక్కడ ఉన్నా ప్రతిస్పందన ఉంటుందని పేర్కొంది. పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్‌తో మిలిటరీ అకాడమీని లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు సిరియా మిలిటరీ పేర్కొన్నట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు సిరియా ఆరోగ్యశాఖ మంత్రి హసన్‌ అల్‌ గబ్బాష్‌ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ వేడకకు సిరియా రక్షణ శాఖ మంత్రి కూడా హాజరయ్యారు. అయితే, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని నిమిషాలకే ఈ దాడి జరిగింది. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు సిరియా ప్రభుత్వం ప్రకటించింది. సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న తిరుగుబాటుదారులుగానీ, జిహాదీలు గానీ ఈ దాడిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు