Featuredప్రాంతీయ వార్తలు

వెంటాడుతున్న భయం

కేసీఆర్‌ ఊహించిన పరిణామాలు…

  • ఇచ్చిన మాట నేరువేరుస్తారా లేదా…
  • సూటిగా ప్రశ్నిస్తున్న తెరాస నాయకులు…
  • లేదంటే పార్టీ మార్పుకే సిద్దమంటూ సంకేతాలు…

ఇప్పటివరకు అధినేత కనుసన్నల్లోనే పార్టీ… ఆయన కనుసైగతోనే నాయకులు క్రమశిక్షణతో తల ఎత్తకుండా, మాట మాట్లాడకుండా ముందుకు నడిచేవారు.. ఆయన మాటంటే కార్యకర్తల నుంచి మంత్రుల వరకు వేదవాక్కు.. ఆయనతో మాట్లాడాలన్నా, సమస్యపై చర్చించాలన్నా కలవడానికి వెనుకాముందు ఆలోచించేవారు. అధినేత అంటే అందరికి అంత భయం.. పార్టీని క్రమశిక్షణతో, ఒంటిచేత్తో నడిపిస్తూ రెండవసారి కూడా అధికారంలోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి కెసిఆర్‌. ఇదే భయంతో ఇంకో పది, పదిహేను సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలని తెలంగాణలో తనకు, తన పార్టీకి ఎదురు లేదని భావించినా కెసిఆర్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో నామరూపాల్లేకుండా చేశారు. తెలుగుదేశం ఎప్పుడో కంటికి కనబడకుండా పోయింది. ఇంకా బేఫికర్‌గా ఉన్నా గులాబీ బాస్‌కు కొత్త కొత్త తలనొప్పులతో గుబులు మొదలవుతున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను ఇప్పటివరకు బుజ్జగిస్తూ మీకు అవకాశం వచ్చినప్పుడు, నామినేట్‌ పోస్టు, లేదా ఏదైనా మంచి అవకాశం కల్పిస్తామని చెపుతూ వచ్చేవారు. అధినేతను చూసి అడిగే ధైర్యం ఇంతవరకు ఏ ఒక్కరూ చేయనేలేదు. కాని ఇప్పుడు ఒక్కొక్కరు మాకు ఇచ్చినా మాట మరిచిపోయారు, ఇప్పుడు అమలు పరుస్తారా లేదా అంటూ అడగడం ప్రారంభించారు.. నాయకుల్లో అనుకోకుండా హఠాత్తుగా అంత మార్పు వచ్చేసరికి అధినేత కెసిఆరే అవాక్కవుతున్నట్లు తెలుస్తోంది.. గులాబి బాస్‌తో మాట్లాడడానికే భయపడే నాయకులు ఒక్క అడుగు ముందుకేసి అడిగేసరికి వీరందరికి ఇంత ధైర్యం ఏలా వచ్చిందనే మీమాంసలో పడ్డట్లు సమాచారం. తీరా కారణాలు వెతికేసరికి బిజెపియే దీనికి ప్రధాన కారణమని తెలిసేసరికి టిఆర్‌ఎస్‌ అధినేతకు చిన్నగా ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.. ఇన్నిరోజులైనా ఇచ్చిన మాట తీర్చలేదని ఒక్కసారి ఆలోచించాలని అనే రీతిలో ప్రశ్నించే సరికి ఏమి చెయ్యాలో అర్థంకాని పరిస్థితిలో తెరాస అధినాయకత్వం పునారోలచనలో పడినట్లు తెలిసిపోతుంది… ఇప్పుడిప్పుడే సొంత పార్టీలో మొదలవుతున్న ప్రశ్నలు రేపు ఎక్కువై అందరూ ఇచ్చిన హమీల కోసం నిలదీస్తే అప్పుడు పరిస్థితి ఏంటనే గుబులుతో అధినాయకత్వం ఆందోళన చెందుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి) :

ఎప్పటికి ఒక్క దేశానికి కాని, రాష్ట్రానికి కాని ఎప్పటికి ఒక్కరే రాజులు కాలేరు.. ఎప్పటికి బంటులు బంటులుగానే మిగిలిపోలేరు.. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు ఆసక్తిని రేపుతున్నాయి.. కొన్ని సంవత్సరాల వరకు అధికారం తన చేతి దాటిపోవద్దని భావించిన కెసిఆర్‌కు రోజురోజుకు వింత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇతర పార్టీలనుంచి వలసలు మొదలెట్టిన కెసిఆర్‌కు ఇప్పుడు తన సొంత పార్టీ నాయకుల నుంచి వచ్చే వినూత్న పరిణామాలకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలిసిపోతుంది. రాజకీయానికి వైకుంఠపాళికి పెద్ద తేడా ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా ఒక్క సంఘటన, ఒక్క మాట, ఒక్క ప్రశ్న చాలు మొత్తం క్రమశిక్షణ అదుపుతప్పడానికి, పరిస్థితి తలకిందులు కావడానికి ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో జరుగుతున్నదీ అదే.. తెలంగాణలోని తాజాగా రాజకీయం చూస్తే ఇదే విషయం అర్థం కాకమానదు. తెలంగాణలో కెసిఆర్‌తో తలపడే నాయకుడు ఎవరూ లేరని, ఇంకా పది, పదిహేను సంవత్సరాల వరకు తమ టిఆర్‌ఎస్‌ పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్రంలో రెపరెపలాడుతూ ఎగరాలనే ధీమాతో ఆ నాయకత్వం ఉంది. అధికారం తమ చేతిలో నుంచి పోవడానికి కనీసం కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని భావించినా నాయకులకు ఇప్పుడు కొన్ని సంఘటనలు, అనుకోని పరిణామాలు చూస్తుంటే మాత్రం గుండె దడ మొదలైనట్లు తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు శత్రుదుర్భేద్యంగా ఉన్న గులాబీ కోటకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కోలుకోని దెబ్బతీసింది. ఇతర పార్టీలకు ఏమాత్రం అవకాశం లేదని భావించి ప్రజా సమస్యలకు పట్టించుకోకుండా ఏకచ్చాత్రిపత్యంగా ముందుకు సాగుతున్న కెసిఆర్‌కు బిజెపి వేసే అడుగులు ఆందోళన పుట్టిస్తున్నట్లు తెలిసిపోతుంది.. ఎవరి అంచనాలకు మించకుండా వేగంగా దూసుకువస్తున్న బిజెపిని అడ్డుకోవడం టిఆర్‌ఎస్‌ వల్ల అవుతుందా, లేదా అనేది ఇప్పుడు అందరిలో అనుమానం మొదలయ్యింది.. వారి వేగానికి రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ భవిష్యత్తు ఏలా ఉండబోతుందనే విషయమే అందరిలో గుబులు రేపుతుందని తెలిస్తుంది..

అధినేతనే ప్రశ్నిస్తున్న నాయకులు….

సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో నాలుగు ఎంపీ స్థానాల్ని బిజెపి తన ఖాతాలో వేసుకొంది.. తెలంగాణ ఓటర్ల నిర్ణయంతో కమలనాథుల్లో కొత్త ఆశలు, కొంగొత్త ఆకాంక్షలు మొదలయ్యాయి. తాము ఇప్పటివరకు సరైన రీతిలో ప్రయత్నం చేయలేదు కాని ప్రత్యేకంగా దృష్టిసారిస్తే ఫలితాలు ఇంకామరో విధంగా ఉండేదని అనుకుంటున్నారు. తెలంగాణలో బిజెపిని ఆదరించటానికి అభిమానం చూపించటానికి అందలం ఎక్కించటానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్న విషయాన్ని అర్థం చేసుకున్న కమలనాథులు.. తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. తమ కన్ను పడిన క్షణం నుంచి ప్రత్యర్యులకు కౌంట్‌ డౌన్‌ మొదలెట్టి అలవాటు ఉన్న కమలనాథులకు తమకు చెమటలు పట్టేలా ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో హడావుడి చేసిన కెసిఆర్‌ సంగతి చూడాలని మోడీ, షాలు గట్టి నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. దీంతో బిజెపి నాయకులు తెర వెనుక మంత్రాంగాన్ని మొదలు పెట్టిన వైనాన్ని కెసిఆర్‌ గుర్తించినట్లుగా తెలుస్తోంది. తన తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గులాబీ నేతలను టచ్‌లోకి తీసుకుంటున్న కమలనాథులు.. కొత్త కొత్త హామీలు ఇవ్వటం షురూ చేసినట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకూ తమకు ఎదురే లేదని ఫీలైన కెసిఆర్‌ సైతం ఇప్పుడు కాస్త అసౌకర్యానికి గురి అవుతున్నట్లు చెబుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల గురించి అడగటానికి సైతం సాహసించని టిఆర్‌ఎస్‌ నేతలు పలువురు తాజాగా తమకిచ్చిన వాగ్దానాలను ఎప్పుడు పూర్తి చేస్తారన్న సంకేతాల్ని బలంగా అధినేత ముందు వినిపించడం మొదలైందని చెబుతున్నారు. మొన్నటివరకు తమదే రాజ్యమన్నట్లుగా వ్యవహరించిన గులాబీ బాస్‌కు బిజెపి అధినాయకత్వం మొదలెట్టిన ఆపరేషన్‌తో కొత్త గడబిడ మొదలైందంటున్నారు. ఇది కెసిఆర్‌ స్థాయి నుంచి ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలోకి జాతీయ నాయకులు మోడీ, షాలు స్వయంగా రంగంలోకి దిగితే టిఆర్‌ఎస్‌ పరిస్థితి, కెసిఆర్‌ ఆశలు ఏమవుతాయనేదే ఇప్పుడు టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో వచ్చిన అనుమానంగా చెబుతున్నారు. ఇతర పార్టీలను వలసల ద్వారా ప్రోత్సాహించిన కెసిఆర్‌ తమ నాయకులను కాపాడుకుంటారా, లేదా బిజెపి కెసిఆర్‌ వ్యూహాలను అధిగమించి కారులో నుంచి నాయకులను ఖాళీ చేస్తుందా అనేది ఇప్పుడు తెలంగాణలో ఆసక్తిగా మారిపోయిన రాజకీయం… రాష్ట్రంలో ఎత్తులకు పై ఎత్తులు వేసిన కెసిఆర్‌ కమలనాథుల దాటికి ఎంత మేరకు తట్టుకుంటారనేదీ వేచి చూడాల్సిందే…

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close