కేసీఆర్‌ ‘గులాబీ’కి రైతు దూరం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రైతు బంధు పథకం కింద వ్యవసాయం కోసం ఇచ్చే పెట్టుబడి నిధులను ధనవంతులైన రైతులు అతి తక్కువ మొత్తంలో తిరిగి చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద తెలంగాణ సర్కార్‌ ఇప్పటికే రూ.10వేల కోట్లను పంపిణీ చేస్తే కేవలం రూ.2.4 కోట్ల చెక్కులను 1,543 మంది రైతులు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి

ప్రతి ఏటా రూ.10వేలకు పెంచారు. ఖరీఫ్‌లో నాలుగువేలు, రబీలో నాలుగువేల చొప్పున చెల్లించనున్నారు. తొలుత ఈ స్కీమ్‌ను తెలంగాణ సర్కార్‌ ప్రవేశపెట్టిన సమయంలో ఏటా ఎకరానికి రూ.8వేలు మాత్రమే చెల్లించేది. అయితే గత డిసెంబర్‌ మాసంలో జరిగిన ఎన్నికల సమయంలో రైతు బంధు పథకం కింద చెల్లించే సహాయాన్ని రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. రైతు బంధు పథకం కింద పేద రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే సర్కార్‌ ప్రవేశపెట్టింది. ధనవంతులైన రైతులు మాత్రం ఈ పథకం కింద ప్రభుత్వం నుండి వచ్చిన చెక్కులను తిరిగి ప్రభుత్వానికి చెల్లించడంలో అంతగా ఆసక్తి చూపడం లేదు. గ్యాస్‌ సబ్సిడీకి సంబంధించి కేంద్రం అనుసరించిన తరహాలోనే రైతు బంధు పథకం కింద కూడ ధనవంతులైన రైతులు ఈ పథకం నుండి తమకు తాముగా స్వేచ్ఛగా మినహాయింపును తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ వినతికి ఆశించినంతగా స్పందన లేదు.

తెలంగాణ రాష్ట్రంలో 6500 మంది రైతులు 25 నుండి 66 ఎకరాల భూమిని కలిగి ఉన్నారు. అయితే భూ సీలింగ్‌ యాక్ట్‌ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కేవలం 56 ఎకరాల భూమి మాత్రమే ఉండాలి. ఇందులో మెట్ట భూమి కేవలం 25 ఎకరాలు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతు బంధు పథకం కింద చెక్‌లను తీసుకొంటున్న  ధనవంతులైన రైతులు ఈ డబ్బులను తిరిగి ఇచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అత్యధికంగా రైతు బంధు పథకం కింద తీసుకొన్న చెక్‌లను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చినట్గుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఈ జిల్లా నుండి రూ.55 లక్షలను  తిరిగి ప్రభుత్వానికి వచ్చాయి. కుమ్రంభీమ్‌ జిల్లా నుండి కేవలం నాలుగు చెక్‌లు మాత్రమే ప్రభుత్వానికి వచ్చాయి. ఈ జిల్లా నుండి కేవలం రూ.45వేల200 మాత్రమే ధనిక రైతులు తిరిగి చెల్లించారు. కేవలం రూ.2.4 కోట్లు మాత్రమే ఖరీఫ్‌ సీజన్‌ లో ప్రభుత్వానికి తిరిగి రైతుల నుండి వచ్చాయి. రబీ సీజన్‌లో ఇంకా ఒక్క రైతు కూడ ఇంత వరకు చెక్‌లను తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు. రూ.5.156 కోట్లను ఖరీఫ్‌ సీజన్‌లో రైతు బంధు పథకానికి చెల్లించారు. మరో వైపు రబీ సీజన్‌లో రూ.4844 కోట్లను ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. సీఎం కుటుంబ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ ఎంపీ జి. నగేష్‌, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి లు రైతు బంధు పథకం కింద వచ్చిన చెక్‌లను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here