Featuredస్టేట్ న్యూస్

వనంలో.. జనజాతర

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

5-8 వరకు మహా జాతర

నాలుగు రోజుల పాటు మహా జాతర

వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు ముందే సరిహద్దు జిల్లాలైన హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ నుండి భక్తులు మేడారంకు చేరుకున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించారు. వనదేవతలు సమ్మక్క.. సారలమ్మలను దర్శించుకొని గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. జాతర సందర్భంగా కోట్లాది మంది ప్రజలు మేడారంను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారం జాతర జరుగనుంది.

అడ్డగుట్ట (ఆదాబ్‌ హైదరాబాద్‌):పరమ పావని, జగత్‌ జనని, కోరిన వరలిచ్చే.. కల్పవల్లి,తప్పులను క్షమించి కష్టాలను రూపు మాపే..మా అమ్మ.. మాఇంటి ఎలవేల్పు సమ్మక్క, సారలమ్మ.. అమ్మ..నీకు వందనం. జగన్మాత నీకు వందనం. అంటూ భక్తులు మేడారం జాతరకు పోటెత్తుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం. సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు ఇప్పటి నుంచే భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ములుగు జిల్లాల్లో రెండేళ్లకోసారి జరిగే మహా జాతరను గిరిజన సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు గిరిజనుల జనాభా అధికంగా ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్‌ నుంచి కోటికి పైగా మంది భక్తులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారని జిల్లా పాలనా యంత్రాంగం అంచనా వేస్తోంది. మేడారం జాతరలో భాగమైన గుడిమెలిగె కార్యక్రమాన్ని క్రితం నెల 28న పూర్తి చేశారు. అప్పటినుంచి భక్తుల రద్దీ మొదలైంది ఇప్పటికి దాదాపు 25 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

జంపన్న వాగులో పుణ్యస్నానాలు

జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు.. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు. జంపన్నవాగుకు లక్నవరం నుంచి మిషన్‌ భగీరథ నీరు తరలిస్తున్నారు.దీంతోపాటు రెండు కోట్ల విలువతో మూడు భారీ స్టోరేజ్‌ వాటర్‌ ట్యాంకులు,యాబైకి పైగా భక్తులు నివాసం వుండే పరిసరాల్లో మినీ వాటర్‌ ట్యాంకులను నిర్మించారు.

కాగా, ఫిబ్రవరి 5-8వ తేదీ వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు. అయితే, జాతర సమయంలో రద్దీ ఇంకా భారీగా ఉండే అవకాశం ఉండటంతో.. ముందస్తుగానే భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.

ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు

ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు జాతర జరగనుంది. ఫిబ్రవరి 5వ తేదీ కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజులను గద్దెలపైకి తీసుకొస్తారు.ఫిబ్రవరి 6వ తేదీ గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని గద్దె మీదకు తీసుకొస్తారు.ఫిబ్రవరి 7వ తేదీన వన దేవతలకు మొక్కుల చెల్లింపు చేస్తారు. ఫిబ్రవరి 8వ తేదీన తల్లుల వనప్రవేశం తో జాతర ముగుస్తుంది. భక్తులు భారీగా తరలివస్తుండటంతో అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి,సత్యవతి రాథోడ్‌, సారలమ్మ జాతర ఏర్పాట్లను వారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. ఇక భద్రతా ఏర్పాట్లపై పోలీసులు అధికారులతో డీజీపీ సమావేశం నిర్వహించారు.30,000వేల మంది అన్ని శాఖల ఉద్యోగులతో పాటు 10,000 వేలమంది పోలీసులు. మేడారం జాతర కొరకు నియమించినట్లు అధికారులు తెలిపారు.జాతర మొతంగా 500 సీసీ కెమెరాలు ఏర్పాటుతోపాటు,సమ్మక్కా, సరాలమ్మ గద్దెలదగ్గర 41 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలు అధికారులను ఆదేశించారు.

కాగా, మేడారం జాతర భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇది విగ్రహాలు లేని జాతర. సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. కుంభ మేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్గడ్‌, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తల పిస్తుంది.

1940 వరకు గిరిజనులు మాత్రమే ఈవేడుకను చిలుకలగుట్టపై నిర్వహించేవారు. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలా ది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు.కోయ గిరిజనుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ. శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి. 1940 వరకు గిరిజనులు మాత్రమే ఈవేడుకను చిలుకలగుట్టపై జరుపుకునేవారు. కానీ1940 తర్వాత ఏటేటా జనం పెరగడంతో జాతరను కొండకింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్లను ముందుగానే సిద్దంగా ఉంచిన గద్దెలపై కుంకుమబరినే రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెలపై ప్రతిష్టిస్తారు.

జాతర ఏర్పాట్లకు 75 కోట్లు

75 కోట్ల రూపాయలలో.. రహదారుల మరమ్మత్తుల కోసం ఆర్‌అండ్బీకి రూ.8.5 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీరాజ్‌ శాఖకు రూ.3.50 కోట్లు, ఇక ఇరిగేషన్కు రూ.4 కోట్లు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ శాఖకు రూ.4 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్కు రూ.19 కోట్లు కేటాయించారు. ఇక అంతే కాదు దేవాదాయ శాఖకు రూ.3 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.4 కోట్లు, డీపీవోకు రూ.3.65 కోట్లు, ఆర్టీసీకి రూ.2.48 కోట్లు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్‌ శాఖకు రూ.11 కోట్లు, రెవెన్యూ విభాగానికి రూ.7.50 కోట్లు, డీటీడీవోకు రూ.55.36 లక్షలు, అగ్నిమాపక శాఖకు రూ.21 లక్షలు, పశుసంవర్థక శాఖకు రూ.21.90 లక్షలు,మత్స్య శాఖకు రూ.17.38 లక్షలు, ఎక్సైజ్శాఖకు రూ.20.49 లక్షలు, పర్యాటక శాఖకు రూ.50 లక్షలు, సమాచార పౌరసంబంధాల శాఖకు రూ.19.15 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖకు రూ.1.46 కోట్లు, అటవీ శాఖకు రూ.1.20 కోట్లు, ఐసీడీఎస్కు 10 లక్షలు కేటాయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్లాస్టిక్‌ రహితంగా..

సమ్మక్క, సారలమ్మ జాతరను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించడానికి జిల్లా పాలనాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. భక్తులు తమ వెంట ప్లాస్టిక్‌ వస్తువులను తీసుకుని రాకూడదని ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ములుగు జిల్లావ్యాప్తంగా దీనికి సంబంధించిన బ్యానర్లను కట్టారు. కరపత్రాలను పంచుతున్నారు. దీనితో పాటు జాతరకు వెళ్లే మార్గాలో పలు చోట్ల ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలను నెలకొల్పారు. రౌండ్‌ ద క్లాక్‌ తరహాలో ఈ కేంద్రాలు పని చేస్తాయి.

మేడారంలో హైఅలర్ట్‌

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం.. మేడారం జాతర ఇప్పటికే ప్రారంభమైన సమయంలోనే కరోనా భయాలు వ్యాపించిన నేపథ్యంలో జాతర జరిగే ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించామని మంత్రి తెలిపారు. ఆరుగురు జిల్లావైద్యాధికారులు, 16చోట్ల ఉచిత వైద్య శిబిరాలు, 2,000 వైద్యసిబ్బంది, 13 మంది ఫుడ్‌ ఇన్స్పెక్టర్లను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేస్తున్నామన్నారు. మేడారం జాతరకు ఈ ఏడాది కూడా కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని వైద్యఆరోగ్య శాఖ భూపాలపల్లి పేర్కొన్నారు.

హైద్రాబాద్‌ నుంచి దారి

హైదరాబాద్‌ నుంచి నేరుగా వరంగల్‌ చేరుకొని అక్కడనుంచి 110 కిలోమీటర్ల దూరంలో ములుగు చేరుకొని తాడ్వాయి మండలంలోవున్న మేడారం చేరుకోవచ్చు. లేదా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ హైదరాబాద్‌ నుంచి మేడారం వరకు ఆర్డినరీ నుంచి మొదలుకుని వజ్ర ఏ సి బస్సులను రోజుకు 500బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచింది. ఒకవేళ కుటుంబ సమేతంగా వెల్లలనుకునేవారికి 50 మందికి పైబడి ప్రయాణికులు ఉంటే బస్సు బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. షషష. ్‌రత్‌ీష. షశీఎ నుంచి ఆన్‌ లైన్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఈ వాహనాలకు 32 పార్కింగ్‌ స్లాట్స్‌ కేటాయించారు. విఐపి, వివిఐపి, ప్రైవేటు వాహనాలకు వేల ఎకరాల్లో పార్కింగ్‌ కేటాయించారు.పస్రా, భూపాలపల్లి, తాడ్వాయి, ఏటూరునాగారం వెళ్లే దారిలో ఈ పార్కింగ్‌ సౌకర్యాలు కల్పించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close