అందరూ తిరుగుముఖమే

0

దేశాన్ని వదులుతున్న మిలియనర్లు

రాజకీయాలే ప్రధాన కారణం…

అత్యధికుల చూపు బ్రిటన్‌ వైపే..

జన్మనిచ్చిన రుణం తీర్చుకునేందుకు విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు.. స్వంత ఊరు నుంచి ఎక్కడికెక్కడికో వెళ్లిపోయిన భారతీయులంతా మిలియనర్లుగా, బిలియనర్లుగా ఎదిగారు.. ఎంత ఎదిగినా పురిటిగడ్డను మరిచిపోకూడదంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా విదేశంలో ఉన్న భారతీయులు ఎంతోమందికి స్వదేశదారి పట్టారు. ఇక్కడ వ్యాపార అవకాశాలపై అంతగా మద్దతు లభించకపోవడం, రాజకీయాల ఆధిపత్యం అధికంగా ఉండడంతో అందరూ తిరుగుమొఖం పడుతున్నారని కొన్ని సర్వేల్లో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మన దేశం ఎదగాలి.. అన్ని రంగాల్లో ప్రపంచానికి దీటుగా మనం ముందుకు పోవాలి. స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ది చెందుతున్న దేశమని చెప్పుకుంటూనే ఉన్నాం. చెప్పుకునేంత అభివృద్ది జరగడం లేదు. అందుకే భారతదేశంలో గొప్ప గొప్ప చదువులు చదివిన వారందరూ విదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ మన దేశం వైపు చూడడం లేదు. అందుకే దేశంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే మేకిన్‌ ఇండియా అనే పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. విదేశాలలో పెద్ద పెద్ద స్థానంలో ఉన్నా భారతీయులంతా స్వదేశానికి తిరిగి వచ్చి కంపెనీలు, పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రకటించిన మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి కొన్ని విదేశీ కంపెనీలతో వచ్చాయి. అదే సమయంలో కొందరు ఎన్‌ఆర్‌ఐలు కూడా స్వంత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందడుగు వేసినా ఆ కార్యక్రమానికి పెద్దగా ఆదరణ లభించలేదు. వచ్చిన వారికి సరియైన నమ్మకంతో పాటు మద్దతు లభించకపోవడంతో ఎలా వచ్చిన వారు అలా వెళ్లేందుకే సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఆసక్తికరమైన ఆంశం బయటకు వచ్చింది. కొత్తగా విడుదలైన నివేదిక ప్రకారం ఇండియాకు చెందిన మిలియనీర్లు పెద్ద ఎత్తున విదేశాలకు తరలివెళుతున్న వైనం ఇప్పుడిప్పుడే బయటకు వచ్చింది. గడిచిన కొన్ని నెలల నుంచి ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లుగా కొన్ని నివేదికల ద్వారా బహిర్గతమయింది..

ఐదు వేలకు పైగా మిలియనీర్లు వెనక్కి

ఆఫ్రో ఆసియా బ్యాంక్‌ తో పాటు న్యూ వరల్డ్‌ వెల్త్‌ సంస్థ నిర్వహించిన పరిశోధనలో పలు షాకింగ్‌ అంశాలు బయటకు వచ్చాయి. గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ 2019 పేరుతో విడుదలైన ఈ నివేదికలోని అంశాలను చూస్తే గడిచిన ఏడాది వ్యవధిలో ఐదు వేలకు పైగా మిలియనీర్లు భారతదేశాన్ని విడిచి పెట్టి వెళ్లినట్లుగా లెక్క తేలినట్లుగా ప్రకటించారు. భారతదేశ ప్రధాని ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుగుతూ ఇండియాలో పెట్టుబడుల కోసం విశేషంగా శ్రమిస్తూ ఇండియా వరకు రప్పించారు. కాని ఇండియాకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు, ఎన్‌ఆర్‌ఐలకు కంపెనీ ఏర్పాటు కోసం సరియైన మౌలిక వసతులు కల్పించడంలో విఫలం చెందారని, దానితో పాటు అన్ని రాష్ట్రాల్లో రాజకీయాల జోక్యం అధికంగా ఉండటమే ప్రధాన కారణంగా చెపుతున్నారు. అందుకే ఇక్కడ పెట్టుబడులు, కంపెనీలు పెట్టి నష్టపోవడం కన్నా మళ్లీ తిరిగి వెనక్కిపోవడమే మంచిదనుకున్నట్లు తెలిసింది. బిలియనీర్లు దేశం విడిచి వెళుతున్నప్పుడు కూడా ప్రభుత్వం కాని, పాలకులు కాని వారికి మేమున్నామనే భరోసానిచ్చే వారు ఒక్కరూ లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇంత భారీగా వేలల్లో దేశాన్ని విడిచి వెళుతున్న వ్యక్తిగతంగా ఉన్న ఆదాయ వర్గాల వారు ఎక్కువగా బ్రిటన్‌ కే వెళుతుండటం గమనార్హంగా చెప్పుకోవచ్చు. బ్రిగ్జెట్‌ అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అక్కడి అవకాశాలు అందిపుచ్చుకోవటానికి, అక్కడి వ్యాపార అవకాశాలతో పాటు, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల నేపథ్యంలో బ్రిటన్‌ వెళ్లేందుకు వారు మక్కువ చూపుతున్నట్లుగా వెల్లడైంది. ఒక పక్క దేశీయంగా వ్యాపార అవకాశాలు భారీగా పెంచుతున్నట్లుగా చెప్పే మన కేంద్రప్రభుత్వం మాటలకు క్షేత్ర స్థాయిలో చేసే పనులకు పొంతన లేకుండా ఉంది. కేంద్ర నాయకుల ఆలోచనలకు, తాజా రిపోర్ట్‌ లెక్కలను చూస్తే చాలా భిన్నమైన రీతిలో సంకేతాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా మాటల వరకు ఒకటి, చేతలకు రాగానే మరొకటి అన్నట్లుగా వ్యవహరించడంతో మొదటికే మోసం వచ్చేలా కనబడుతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here