ఎవడబ్బ సొమ్మని… ‘పారిశ్రామికం’ పక్కా దోపిడీ

0

అందరూ సుద్దపూసలే

  • అందినకాడికి కుమ్ముడే
  • చట్టానికి సవరణలు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఏ ప్రభుత్వం వచ్చినా చెప్పేది అభివృద్ధి మా లక్ష్యం. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు అంటూ అందమైన దృతరాష్ట్ర కౌగిలి ఎర. దోపిడీకి బార్లా తెరిచిన రహదారులు. వాళ్ళబ్బ సొత్తు కాదుకదా..! ఐదేళ్ళపాటు అందినకాడికి..ఎవడికి దొరికినంత వాడి ఇష్టారాజ్యం. ప్రభుత్వం మారుతుంది. మళ్ళీ కొత్త నవరస సంగీతం ముసుగులో పాత పాటే. పథకం పేరు మారుతోంది. మళ్ళీ దర్జాగా దోపిడీ. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా జెండా ఏదైనా వాళ్ళందరి ‘ఎంజెండా’ ఒక్కటే. ధనార్జనే ధ్యేయం. తరాలు కూర్చొని తిన్నా తరగని సంపాదనే వారి అంతిమ లక్ష్యం. గత ఐదేళ్ళలో ఇలా ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏకంగా 32వేల ఎకరాలు కేటాయించారు. అందులో ఎంత సద్వినియోగం అయిందనే విషయం తాజా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ‘ఎవడబ్బ సొమ్మురా..?’ అని నిజాన్ని నిగ్గదీసి నిలదీసే అడిగే మిగిలిన మూడు ఎస్టేట్లు మౌనవ్రతం చేస్తున్న సజీవ దర్పణం. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న మరో సంచలన పరిశోధన కథనం.

అసలు కథ: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో ప్రభుత్వం జిల్లాకు లక్ష ఎకరాలు చొప్పున 13 లక్షల ఎకరాలు సేకరించనున్నట్లు ప్రకటించింది. విజన్‌ డాక్యుమెంటులోని పారిశ్రామికాభివృద్ది అంశంలో ఈ విషయాన్ని స్పష్టంగా పొందుపరిచింది. 2015 అక్టోబర్‌ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7.82 లక్షల ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు నాటి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

చట్టాల సవరణ: ఇలా కేటాయింపులు చేయడం కోసం చట్టాలను సవరించింది. ఎకనామిక్‌ డెవలప్మెంట్‌ బోర్డుకు ఒక ప్రైవేటు వ్యక్తిని నియమించి అతని ద్వారా పెద్దఎత్తున వ్యవహారం నడిపించింది. ఆయా భూములను కూడా విదేశాల నుండి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు తొలి ప్రాధాన్యతగా కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికప్పుడు కేటాయించేందుకు వీలుగా 2.73 లక్షల ఎకరాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు సగర్వంగా తెలిపింది.

ఎంఎస్‌ఎంఈ పార్కుల ‘అంకురం’: ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల పేరుతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 7500 ఎకరాలు సేకరించాలని అధికారులను అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. టెక్నాలజీ అభివృద్ది కోసం అంకుర ప్రాజెక్టుల పేరుతో మరికొన్ని సంస్థలకు భూ కేటాయింపులు జరపాలని నిర్ణయించారు. నాటి ప్రభుత్వ హయాంలో వేర్వేరు కంపెనీలకు ఎపిఐఐసి ద్వారా సుమారు 32 వేల ఎకరాలు కేటాయించారు. అవి ‘ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. కంపెనీల పరిస్థితులు ఏమిటి’ అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది.

అందరూ సమ్మతీయులే: ఈ భూములు పొందిన వారందరూ పారిశ్రామిక వేత్తల రూపంలోని బినావిూలుగా చలామణీలో రాజకీయులు కావడం విశేషం. ఇది ఏస్థాయిలో జరిగిందంటే తమ పక్కనే ప్రాణాలు అడ్డుగా పెట్టే అత్యంత నమ్మకస్తులైన ఆ,పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు కూడా తెలియదు.

నివేదిక ఎప్పుడు..?: పారిశ్రామిక అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం భారీ స్థాయిలో జరిపిన భూదందా లోగుట్టు వెలికి తీయడం పట్ల తాజా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఏ సంస్థలకు ఎంతెంత కేటాయింపులు చేశారన్న వివరాలను ఆయన ఇప్పటికే అధికారులను కోరారు. అయితే నాటి వ్యైవహారాలలో భాగస్తులైన ‘వంధిమాగధులు’అధికారులు అంత తేలిగ్గా ఆ నివేదికను తాజా సి.ఎం.కి అందిస్తారో లేదో వేచిచూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here