Featuredస్టేట్ న్యూస్

కేసీఆర్‌ కిట్లతో భరోసా

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు
  • సిబ్బంది కొరతే అసలు సమస్య
  • తాత్కాలిక సిబ్బందిని నియమిస్తే పరిష్కారం

హైదరాబాద్‌ : ఇటీవల కేసీఆర్‌ కిట్ల పంపిణీ జరిగిన తరవాత ప్రభుత్వ అస్పత్రులకు గర్భిణుల రాక సంఖ్యపెరిగింది. అయితే పలు ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల కొరత కారణంగా చాలచోట్ల ప్రసవాలకు సమస్యగా మారుతోంది. ఈ విషయంలో కేసీఆర్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆస్పత్రులను పరిపుష్టం చేసేందుకు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటే తప్ప సమస్యలు తీరవు. అందుకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ నడుం బిగించాల్సి ఉంది. ఇకపోతే నర్సులు, డాక్టర్ల కొతర కారణంగా ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిచే వారికి నరకం చూపిస్తున్నారు. కొద్ది క్షణాల్లో సాధారణ ప్రసవం జరిగే పరిస్థితులున్నా గర్భిణి బంధువులకు ఏదో ఓ కారణం చెబుతూ వెంటనే శస్త్ర చికిత్సతో ప్రసవం చేయకపోతే కష్టమంటూ బెంబేలెత్తిస్తున్న సంఘటనలున్నాయి. కాన్పు కష్టమవుతోందని..కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని..ఉమ్మనీరు తాగాడని..బిడ్డ బరువు ఎక్కువగా ఉందని భయపెడతారు. సాధారణ ప్రసవాలు నామమాత్రంగానే సాగుతున్నాయని జాతీయ ఆరోగ్య మిషన్‌ ఇటీవల చేపట్టిన కుటుంబ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరత, డాక్టర్ల కొరత వెరసి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్లకు దారితీస్తోంది. దానికి తోడు బీపీ పెరిగిందని..వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే చిన్న ప్రాణానికే కాదు పెద్ద ప్రాణానికే ముప్పని అంటారు. నెలలు నిండినా పురిటి నొప్పులు రావడం లేదని కత్తికి పదను పెడతారు.ఒకరిద్దరు ప్రైవేటు వైద్యులు సాధారణ ప్రసవం చేస్తామని చెప్పి చివరి క్షణంలో డబ్బుల కోసం శస్త్రచికిత్స చేశారంటూ ఆస్పత్రుల ముందు ఆందోళనలు నిర్వహించిన సంఘటనలు సైతం ఉన్నాయి. దేశంలోకెల్లా అత్యధికంగా తెలంగాణలో 58 శాతం ప్రసవాలు శస్త్ర చికిత్సలు జరుగుతుండగా తెలంగాణలోనే అత్యధికంగా ఉమ్మడి ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను వేళ్ల మీద లెక్కించ వచ్చు. ఆస్పత్రిలో అవసరమైనంత మంది స్త్రీ వైద్య నిపుణులు లేకపోవడం కడుపు కోతలు పెరగడానికి మరో కారణంగా భావిస్తున్నారు. సాధారణ ప్రసవాల కోసం ప్రయత్నించాలంటే నిరంతరాయంగా ప్రసవాల లేబర్‌ రూమ్‌లో స్త్రీ వైద్య నిపుణులు ఉండాలి. శస్త్ర చికిత్సల కోసం, గర్భిణులకు కాన్పుకు ముందు నెలవారీ పరీక్షల కోసం అదనంగా వైద్యులు అవసరం. ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగే ప్రసవాల్లో 70 శాతం మేరకు శస్త్ర చికిత్సలే జరుగుతున్నాయనే విషయం వెల్లడవుతోంది. మొదటి కాన్పు సాధారణ ప్రసవం అయినప్పుడు మాత్రమే దాదాపుగా రెండో, మూడో కాన్పులకు సాధారణ ప్రసవం కోసం వైద్యులు వేచి చూస్తున్నారు మినహా మొదటి కాన్పు అనగానే శస్త్రచికిత్స చేయడానికి ఉపక్రమిస్తున్నారు. గర్భిణి బంధువులే శస్త్ర చికిత్స ప్రసవం కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్న సంఘటనలు సైతం ఉన్నాయి. మరోవైపు ఫలానా ముహూర్తంలో బిడ్డ పుడితే భవిష్యత్తు బాగుంటుందంటూ శస్త్ర చికిత్సలతో ప్రసవాలు చేయించుకుంటున్న వారు సైతం ఉన్నారు. కాస్త ఓపిక పడితే సాధారణ ప్రసవం జరుగుతుందని వైద్యులు చెబుతుంటే,గర్భిణి నొప్పులతో బాధపడుతున్నా వైద్యులు శస్త్రచికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆందోళనలు తరచూ ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొంటున్నాయి. మొదటి కాన్పు సాధారణ ప్రసవానికి అత్యధికంగా 8 నుంచి 10 గంటలు పట్టే అవకాశముండటంతో అప్పటి దాకా నొప్పులు భరించే శక్తి గర్భిణికి ఉండకపోవడంతోపాటు ఆమె పడుతున్న నొప్పులను చూడలేక వైద్యులపై ఆమె బంధువులు ఒత్తిళ్లు పెంచడంతో తప్పనిసరై శస్త్ర చికిత్సకు వెళ్లాల్సి వస్తోందని వైద్యులు అంటున్నారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కేవలం ఇద్దరే స్త్రీ వైద్య నిపుణులుంటున్నారు. ఇక వీరు శస్త్ర చికిత్సలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యులతోపాటు వైద్య సిబ్బంది కొరత సైతం ప్రభుత్వ ఆస్పత్రులని వేధిస్తోంది. సాధారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ వైద్య, మత్తు వైద్య నిపుణుల కొరత ఉండటంతో ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆయా పోస్టులు అత్యధికంగా ఖాళీలే కనిపిస్తుంటాయి. అవసరమైన స్త్రీ, మత్తు వైద్య నిపుణులను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేందుకు వారు ముందుకు రావడం లేదు. శస్త్ర చికిత్స అవసరం లేదని నచ్చజెప్పినా వినకుండా ప్రైవేటుకు వెళ్తుండటంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ దుష్పచ్రారం చేస్తుంటారు. ప్రసవం తేదీకి ఒకటి రెండు రోజులు ఎక్కువగా కాగానే శస్త్ర చికిత్సకు ఒత్తిడి తెస్తుంటారు. అరుదైన కాన్పులు, హైరిస్క్‌ కేసుల్లో మాత్రం తప్పనిసరిగా శస్త్ర చికిత్సతో ప్రసవం చేయాల్సిందే. సాధారణ ప్రసవాలపై మొదట గర్భిణులు, వారి బంధువుల్లో సంపూర్ణ అవగాహన పెరగాల్సి ఉంది. దీనికన్నా ముందు ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించాల్సి ఉంది. కేసీఆర్‌ కిట్‌లు వచ్చిన తరవాత ప్రసవాల సంఖ్య పెరుగుతున్నా సిబ్బంది కొరతను తీర్చాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఈ మేరకు సిఎం కేసీఆర్‌ దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close