నిర్లక్ష్యానికి బాధ్యులెవరు.? గాలిలో కలిసినా విద్యార్థుల ప్రాణాలు

0

అనుమతి లేని బడి ఏలా నడుస్తోంది..

జిల్లా విద్యాశాఖ నిద్రపోతుందా..

ఆర్టీఓ వాహనాల తనిఖీలను మరిచిందా..

రెండురోజులు హడావుడీ. మళ్లీ షరా మామూలే…

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా ఒక తప్పు జరిగిందంటే అందుకు ఎన్నో కారణాలుంటాయి.. ఎంతో మంది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం ఉంటుంది. మనం ఓట్లేసి గెలిపించినా నాయకుల అసమర్థత ఉంటుంది.. అవకాశం ఉండి కూడా పనిచేయని వ్యవస్థ చాతగానితనం ఉంటుంది.. తప్పు జరిగాక ఒకరి మీద ఒకరు తోచుకుంటూ రెండు రోజులు నానా హడావుడీ చేసి చేతులు దులుపుకోవడం మన ప్రభుత్వయంత్రాంగానికి వెన్నతో పెట్టిన విద్యనే.. ఆభం శుభం తెలియని విద్యార్థులు ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళుతుంటే వారి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం జరిగాక స్పందించే నాయకగణం, చర్యలు తీసుకుంటామని చెపుతున్న అధికారకగణం, అసలు తప్పు జరగడానికి గల కారణాలపై మాత్రం లోతైన విశ్లేషణ చేయదు. ఇప్పటివరకు ఏ ప్రమాదంపై చేయలేదు.. చేసిన వాటినుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు.. ఆ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాల అనుమతి లేకుండా ఏలా నడుస్తోంది, ఆ పాఠశాలకు ఫిట్‌నెస్‌ లేని వాహనానికి అనుమతి ఇచ్చిందెవరూ.. పెద్ద పాఠశాల భవనంతో జిల్లా అధికారులకు తెలియకుండానే పాఠశాల నడిపిస్తున్నారా.. వాహనం పనితీరుపై తనిఖీ చేయాల్సిన రోడ్డు రవాణా శాఖ నిద్రపోతుందా, లేక మామూళ్ల మత్తులో జోగుతుందా.. చిన్న జిల్లాలు ప్రజలకు దగ్గరలో అధికారులు సమస్యలు లేకుండా పనిచేస్తారని చెపుతున్న ప్రభుత్వానికి అధికారుల పనితనం మాత్రం మొత్తం డొల్లగానే కనబడుతోంది.. గత కొన్ని సంవత్సరాల నుంచి అనుమతి లేకుండా పాఠశాల నడుస్తున్న పట్టించుకొని విద్యాశాఖ, వాహన పనితీరుపై తనిఖీ చేయని రోడ్డు ట్రాన్స్‌ఫర్‌ శాఖ, వీరిపై పర్యవేక్షణ మరిచినా జిల్లా కలెక్టర్‌, తాగుతూ వాహనాలు నడుపుతున్న పట్టించుకొని పోలీస్‌శాఖ, రోడ్లు గుంతలు, గుంతలుగా ఉన్నా స్పందించని రోడ్డు రవాణా శాఖ.. వీరందరిని పనితీరు ఏలా ఉందో ఒక్కసారి కూడా విచారణ చేయని ప్రభుత్వశాఖ ఇంత మంది నిర్లక్ష్యానికి మూడు కుటుంబాలకు కడుపుకోత మిగిల్చి, ముగ్గురు చిన్నారులను బలితీసుకున్నారు.. ప్రమాదం జరిగినా తర్వాత హుటాహుటీన వస్తూ, హడావుడీ చేస్తూ ఎంతోకొంత ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ మళ్లీ యధా రాజా, తధా ప్రజా అన్నట్లుగా మారిపోయే ప్రభుత్వ యంత్రాంగం మనది..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి నిర్లక్ష్యానికి అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా దిద్దుబాటు చర్యలకు మాత్రం ప్రభుత్వం పూనుకోవడం లేదు. సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వాగ్వేశరీ-శ్రీచైతన్య ప్రైవేట్‌ పాఠశాలలు అనుమతి లేకుండా పాఠశాల నడిపిస్తున్న తనిఖీ చేయాల్సిన అధికారులు కళ్లు మూసుకొని ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిపోతుంది. తనిఖీల బాధ్యత, విధుల నిర్వహణ తన పని కాదనుకున్నారో, మరేమో తెలియదు కాని జిల్లా అధికారుల చాతకానితనానికి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ముగ్గురి విద్యార్థుల ప్రాణాలు కలిసిపోయాయి. వేములవాడ పట్టణంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పిల్లల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల రోదనలతో చూసే వారు సైతం కంటితడి పెట్టిన సంఘటనలవి. వాగ్వేశరీ-శ్రీచైతన్య ప్రైవేట్‌ పాఠశాలకు వేములవాడ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ప్రతిరోజు చదువుకోవడానికి పాఠశాల ఏర్పాటు చేసిన బస్సు ఏపీ15టివి7800లో వస్తుంటారు. పాఠశాలకు పదవ తరగతి వరకు అనుమతి లేకున్నా, పాఠశాల బస్సుకు ఫిట్‌నెస్‌ లేకున్నా అదే వాహనంలో నిత్యం విద్యార్థులను తీసుకొస్తుంటారు. పాఠశాల మినీబస్సు కెపాసిటీ కేవలం పదిమంది కాగా పాఠశాల యాజమాన్యం నిత్యం ఇరవైఐదు మంది విద్యార్థులతో తరలిస్తోంది. కాని అక్కడ రోడ్డు సరిగ్గా లేకపోవడం, వాహనం ఫిట్‌నెస్‌ లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 12.30కి డ్రైవర్‌ నిర్లక్ష్యమో, మరే ఇతర కారణమో తెలియదు కాని ఇరవై ఐదు మంది విద్యార్థులతో ఉన్న పాఠశాల వాహనం బోల్తాపడింది. అటుగా వెళ్తున్న తిప్పాపురంకు చెందిన యువకులు స్కూల్‌ వ్యాన్‌ బోల్తా పడిన విషయాన్ని గమనించిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులతో రోదనలతో చెల్లాచెదురుగా పడివున్న విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. వాహనం కింద ఇరుక్కుపోయిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వట్టెంల గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న మణిచందన (15) మానాల గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రెండవ తరగతి చదువుతున్న దీక్షిత (8), మరో విద్యార్థి రిషి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

కన్నీరుమున్నీరైనా ప్రజలు..

విద్యార్థుల మృతదేహలను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారిపోయింది. చిన్నారి విద్యార్థులను చూస్తూ స్థానిక ప్రజల సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు. ఫిట్‌నెస్‌ లేని వాహనాలను నడపడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిపిన ఆర్టీఏ అధికారులు ఈ వాహనాలను రోడ్ల మీద ఏలా తిప్పనిస్తున్నారని ఆర్టీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతి లేకున్నా అధికార బలంతో ధనార్జనే ధ్యేయంగా స్కూళ్లను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. చిన్నారి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న పాఠశాల యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరిపై చర్యలు తీసుకుంటారు..

వేములవాడలో జరిగినా ప్రమాదంపై ఏ అధికారిపై చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్‌ చేస్తారో, పాఠశాల యజమాన్యంపై కేసు నమోదు చేస్తారా, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్టీఏ అధికారులపై చర్యలు తీసుకుంటారో తెలియాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అనుమతి లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా సంపాదనే ప్రథమ కర్తవ్యంగా నడుస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు వేలల్లో ఉన్నాయనే విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసిందే. ఐనా పై అధికారుల అదేశానుసారమో, రాజకీయ నాయకుల ఆజ్ఞానుసారమో తెలియదు కాని ఒక్కరిపై కూడా ఈ విద్యాసంవత్సరం చర్యలు తీసుకోలేదు. కార్ఖానాల్లా ఇరుకు ఇరుకు గదుల్లో చదువులు సాగిస్తూ, ఫిట్‌నెస్‌ లేని వాహనాల్లో అనుమతికి మించి విద్యార్థులను ఎక్కిస్తూ ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడుతున్న అధికారయంత్రాంగం నిజాయితీగా పనిచేస్తే అనుమతి లేని పాఠశాలలన్నీ ఎప్పుడో మూతపడేవి. ప్రభుత్వ పాఠశాలలకు కనీస సదుపాయాలు కల్పించి అభివృద్ది చేస్తే విద్యార్థులతో కళకళలాడేవి. ఎవరికి వారుగా చేతులు దులుపుకుంటూ తప్పించుకోవడమే మన అధికారయంత్రాంగానికి మామూలైపోయింది. ఇప్పుడు ఎవరిపై ఏలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఈటెల..

విద్యార్థుల ఘోర రోడ్డు ప్రమాదం తెలియగానే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంత్రి ఈటెల రాజేందర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించి సరియైన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గాయాల పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్య అందేలా జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు బండి సంజయ్‌ మృతిచెందిన విద్యార్థులకు సరియైన న్యాయం జరిగేలా కృషిచేస్తానని వెల్లడించారు. జిల్లా ఎస్పీ హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకొని శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here