తెరాసకు ఇవే చివరి ఎన్నికలు కావాలి

0

కోదాడ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నాలు గేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇచ్చిన హావిూలను నెరవేర్చారని.. తెరాసకు ఇవే చివరి ఎన్నికలు కావాలని ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు అన్నారు. కోదాడలో ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌ పద్మా వతికి మద్దతుగా నిర్వహించిన ఎన్నిక ల ప్రచార సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన తర్వాత సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాల్జేసిన ఘనుడు కేసీఆర్‌ అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెరాసను ఇంటికి పంపాలని ప్రజలను కోరారు. తెరాస పాలనలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. ఇవే తెరాసకు చివరి ఎన్నికలు కావాలన్నారు. డిసెంబర్‌ 11తర్వాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్‌.. మాజీ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు వెళ్లలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. దేశంలో రెండే కూటమిలు ఉన్నాయని.. భాజపా కూటమిలో ఉంటారా? భాజపాయేతర కూటమిలో ఉంటారా? అని తెరాస, ఎంఐఎంను చంద్రబాబు ప్రశ్నించారు. భాజపాతో కేసీఆర్‌కు సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఎంఐఎం నేత అక్బరుద్దీనే పరోక్షంగా ఓ సభలో చెప్పిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మిషన్‌ భగీరథలో పైపులైన్లు మాత్రమే వేశారు తప్ప నీళ్లు రాలేదన్నారు. ఇచ్చిన ఎన్నో హావిూలను కేసీఆర్‌ విస్మరించారని విమర్శించారు. అభివృద్ధికి తాను అడ్డుపడ్డానని కేసీఆర్‌ అంటున్నారని, ఆయన చేసిన ఏ అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడ్డానో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఏరోజూ క్షేత్ర స్థాయిలోకి రాని కేసీఆర్‌.. ఓట్లు అవసరమయ్యే సరికి ప్రజల వద్దకు వస్తున్నారని దుయ్యబట్టారు. తెరాస పాలనలో అన్ని వ్యవస్థలూ గాడితప్పాయని, వాటిని గాడిలో పెట్టాలంటే ప్రజాకూటమికి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లలో దుర్మార్గపు పాలన సాగించారని చంద్రబాబు విమర్శించారు. అర్థరాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి రేవంత్‌ను అరెస్ట్‌ చేశారని, రేవంత్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికమన్నారు. ఓడిపోయే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మురిగిపోతుందని, టీడీపీ లేకుంటే కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్తే లేదన్నారు. అహంకారంతో మాట్లాడే వ్యక్తులను ఇంటికి పంపాలని అన్నారు. మోదీతో కేసీఆర్‌ లాలూచీపడ్డారని విమర్శించారు. నియంతలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని, పగలు ఎంఐఎంతో.. రాత్రి బీజేపీతో కేసీఆర్‌ స్నేహ చేస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం, కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనన్నారు. కేసీఆర్‌ మాట్లాడితే.. చంద్రబాబు అడ్డుపడు తున్నాడని అంటున్నాడని విమర్శించారు. డబుల్‌బెడ్రూం ఇళ్లు ఎవరికైనా వచ్చాయా? ప్రతిఇంటికి నీళ్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా? దళితుడిని సీఎం చేస్తానంటే నేను అడ్డుపడ్డానా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డానా? మహిళలకు మంత్రిపదవి ఇస్తానంటే అడ్డుపడ్డానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పాలనను తిరిగి గాడిలో పెట్టే సామర్థ్యం ప్రజా కూటమికే ఉందని, ప్రజలంతా కూటమికి మద్దతుగా నిలిచి బంగారు పాలన తెచ్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here