ఈ నెల 23తో చంద్రగ్రహణాలు తొలుగుతాయి..

0

  • 300పైగా స్థానాల్లో గెలుపు ఖాయం
  • సమయం కోసం ఎదురుచూపు
  • కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు
  • కాంగ్రెస్‌ కనుమరుగు ఖాయం
  • తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :

కేంద్రంలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని, మళ్లీ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కేంద్రంలో 300పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ముందే స్పష్ఠంగా.. నమ్మకంగా చెప్పారని అన్నారు. ఇందుకు కారణం మోదీ ప్రభుత్వ పనితీరు, ఎన్డీయే అవినీతి రహిత పాలన అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల మనన్నలను మోదీ పొందారని అన్నారు. దీంతో దేశప్రజలంతా బీజేపీకే మెజార్టీ సంఖ్యలో మద్దతుగా నిలిచారని అన్నారు. అభివృద్ది, సంక్షేమం, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. దేశ అంతర్గత భద్రతలో ఎక్కడ రాజీ పడని నైజం ప్రధాని మోదీదన్నారు. సర్జికల్‌ స్టైక్ర్‌ విూద కూడా ప్రతిపక్షాలు, రుజువులు అడగడం సబబు కాదని లక్ష్మణ్‌ అన్నారు. మసద్‌ అజార్‌.. కేసీఆర్‌ చెవిలో చెప్పినట్టు దోమకూడా చనిపోలేదు అన్నారని, సైనికుల విూద కన్నా కూడా ఉగ్రవాది విూద కేసీఆర్‌కు నమ్మకం ఉన్నట్లుందని విమర్శించారు. ప్రజలు అమాయకులు కాదని, ప్రతిపక్షాలకు కర్రకాల్చి వాత పెడుతున్నారన్నారు. రామరాజ్యం రాబోతోందని, మోడీ ఓటమికి కూటమి కట్టి అజెండా లేకుండా వెళ్లారన్నారు. ప్రజలు వాటన్నింటినీ నమ్మలేదని, జైలు నుంచి బెయిల్‌ విూద ఉన్నవాళ్లంతా కూటమి కట్టారని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. బీజేపీ స్వతహాగా.. సాధారణ మెజారిటీ వస్తుందని లక్ష్మణ్‌ తెలిపారు. బెంగాల్‌లో ఎన్డీఏకు గతం కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని, మమత బెనర్జీ వల్ల హింస జరిగిందన్నారు. బీజేపీ కార్యకర్తల త్యాగాలు వృధా కావని, బెంగాల్‌ లాగానే తెలంగాణలో కూడా బీజేపీ రాజకీయాలను తిరగరాయబోతున్నని లక్ష్మణ్‌ అన్నారు. బెంగాల్‌ లాగా తెలంగాణలో నియంతృత్వం సాగుతుందని, తెలంగాణ సమాజం సమయం కోసం ఎదురుచూస్తోందని లక్ష్మణ్‌ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కనుమరుగు కాబోతుందని, హిందు ఉగ్రవాదం.. హైందవులు, బొందువులు అనడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. ఇది గమనించిన ప్రజలు నిశ్శబ్ద విప్లవంగా మారబోతోందన్నారు. దేశ సమగ్రతను కూడా భంగపరుస్తున్నారని, పుల్వామా అనంతరం దేశం అంత ఒక్కటిగా నిలవాల్సిన సమయంలో పాకిస్థాన్‌ అనుకూల బాషను వాడటంతో ప్రజలు తిరగబడ్డారన్నారు. మోదీ నవ భారత్‌ నిర్మాణం కోసం పనిచేస్తున్నారని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చారు.

ఇద్దరు చంద్రుల ఫ్రంట్‌లకు టెంటులేదు..

ఇద్దరు చంద్రులు ఫెడరల్‌ ఫ్రంట్‌, ఫ్యామిలీ ఫ్రంట్‌కు టెంటు లేదని లక్ష్మణ్‌ తేల్చిచెప్పేశారు. ఒకాయన అడవి బాట పడితే.. ఒకాయన ఢిల్లీ, కోల్‌కత్తా ఇలా భేటీలకు వెళ్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. టీడీపీని సోనియాగాంధీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయడని విమర్శించారు. కొన్ని విూడియా సంస్థలు కూడా చంద్రబాబు చక్రం తిప్పుతారని.. కేసీఆర్‌ బొంగరం తిప్పుతారని వంత పాడారని, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దొందూ దొందే అన్నారు. కేసీఆర్‌.. బీజేపీ యేతర ప్రభుత్వం అని.. కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతు అంటున్నారని విమర్శించారు. కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులు పెట్టుకోవడం ప్రజలు ఒప్పుకోలేదని, రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్ర గ్రహణం వీడుతోన్నదని, ఓటమికి చంద్రబాబు సాకులు వెతుకుతున్నారని అన్నారు. యూ టర్న్‌ మహానుభావుడు ట్యాపరింగ్‌ జరిగింది అని.. నేనే గెలుస్తా అని.. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. 2014లో విూరు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేసాయా అంటూ ప్రశ్నించారు. మొన్న మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే ఎందుకు గుర్తు లేదు, ఈవీఎంలు విచిత్ర మెంటాలిటీలో చంద్రబాబు ఉన్నారన్నారు. ట్యాపరింగ్‌ జరిగిందని మళ్ళీ నేనే గెలుస్తా అనడం దానికి కొన్ని సంస్థలు, వ్యక్తులు వంతపాడటం విడ్డూరంగా ఉందని లక్ష్మణ్‌ విమర్శించారు. అసంతృప్త టీఆర్‌ఎస్‌ వాదులు, తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు మరింత మంది బీజేపీ వైపు వస్తారని, తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయని లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here