నోటికి తాళం

0
  • యోగి, మాయావతిపై ఈసీ కొరడా
  • యోగిపై 72గం||, మాయావతిపై 48గం|| నిషేదం
  • నేటి ఉదయం 6గం|| నుంచి అమల్లోకి
  • సుప్రీం హెచ్చరికలతో కొరడా ఝుళిపించిన ఈసీ

న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్‌పీ అధినేత్రి మాయావతిపై కొరడా ఝుళిపించింది. వీరిరువురు మతపరమైన వ్యాఖ్యలు చేస్తుండటాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల కమిషన్‌ కొద్దిరోజులు నిషేదం విధించింది. యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటలు, మాయావతిపై 48 గంటలు నిషేధం విధించింది. ఈసీ నిర్ణయం ప్రకారం యోగి మూడు రోజులు, మాయావతి రెండు రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. యూపీలో ఎన్నికల ప్రచారం సమయంలో సీఎం యోగి ఆదిత్యనాధ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విూకు అలీ ఉంటే మాకు బజరంగ్‌బలి ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడమేనంటూ ఆయనపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. మాయావతి సైతం మత ప్రాతిపదికపైనే బీజేపీ టిక్కెట్లు ఇస్తోందన్నారు. యోగికి ఓట్లేసేటప్పుడు అలీ, బజరంగ్‌బలి అంటూ యోగి చేసిన వ్యాఖ్యలను ముస్లింలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈసీ యోగి, మమత వ్యాఖ్యలపై మందలించింది.

ఈసీని మందలించిన సుప్రింకోర్టు..

కాగా ఈ నెల 7న యోగి ఆదిత్యనాథ్‌, మాయావతి చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అ అంశాన్ని పలువురు న్యాయవాదులు ప్రస్తావించారు. ఫిర్యాదులు అందినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 7న ఇద్దరు నేతలూ మతపరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈసీ కనీసం ప్రస్తావించడంగానీ, దానిపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటన గానీ చేయలేదని.. దీనిపై న్యాయస్థానం జోక్యంచేసుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టింది. మతపరమైన, సైనికపరమైన, దేశభద్రతకు సంబంధించిన అంశాలపై రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రసంగాల్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్న సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. అసలు ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ఇలాంటి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించింది. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో స్పందించిన ఈసీ మాయావతికి నోటీసు జారీ చేశామని, ఈ నెల 12కల్లా ఆమె సమాధానం పంపాల్సిందని, కాని ఆమె నుంచి ఇంకా సమాధానం రాలేదని ఎన్నికల సంఘం లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. మరి విూరు ఏం చేయదలిచారంటూ కోర్టు ప్రశ్నించగా...  పార్టీ  గుర్తింపు తాము రద్దు చేయలేమని, అలాగే ఆమెను అనర్హురాలిగా ప్రకటించలేమని.. కేవలం సూచనలు సలహాలు ఇవ్వడమే తమ పని అని చెప్పారు. దీనికి 

ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు… దీనిపై సమగ్ర విచారణ చేస్తామని మంగళవారం ఉదయం మళ్ళీ కేసు విచారిస్తామని పేర్కొంది.

సుప్రిం హెచ్చరికలతో ఈసీ కొరఢా..

బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌లు మతపరమైన వ్యాఖ్యలు చేసినా ఈసీ కేవలం హెచ్చరికలతో మాత్రమే వదిలేసింది. వారి వ్యాఖ్యలపై పలు ఫిర్యాదులు అందినా నోటీసులు ఇచ్చి వివరణ ఇవాలని కోరింది. కాగా రాజకీయ నేతలు తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నా ఈసీ నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతుందంటూ పలువురు పలువురు సుప్రింను ఆశ్రయించడంతో సుప్రిం ఈసీని ప్రశ్నించింది. దీంతో సుప్రిం నిలదీసిన ఒకట్రెండు గంటల్లోనే ఈసీ చర్యలు చేపట్టింది. మతపరమైన వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం ఉదయం 6గంటల నుంచి 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశించింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ వ్యాఖ్యలుచేసిన మాయావతిపై 48గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయవద్దని ఆంక్షలు విధించింది. ఇదిలాఉంటే భాజపా తరుపున బరిలోకి దిగుతున్న జయప్రదపైనా ఎస్పీ నేత అజీంజ్‌ఖాన్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీనిపైనా యూపీలో తీవ్ర దుమారం రేగుతోంది.. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు, బీజేపీ నేతలు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో అజీంజ్‌ఖాన్‌పైనా ఈసీ చర్యలు తీసుకుంటుందా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here