ఎన్నికల వేళ ఈబీసీ అస్త్రం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

మరో నాలుగునెలల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. అగ్రవర్ణాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. మోదీ నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్‌ సోమవారం ఆమోదించింది.. సోమవారం కేంద్ర కేబినెట్‌ భేటీ అయింది.. ఈ భేటీలో పలు విషయాలపై సుధీర్ఘ చర్చ జరింగింది. ఈసమావేశంలో గత కొంతకాలంగా పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్‌లు కల్పించాలని అగ్రవర్ణాల్లోని పేదలు డిమాండ్‌ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని మోడీ నిర్ణయంతో కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇప్పటికే గుజరాత్‌లోని పటేళ్లు, ఆంధ్రాలో కాపులు, ఇతర రాష్ట్రాల్లో జాట్లు తమకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కేబినెట్‌ నిర్ణయం కీలకంగా మారనుంది.. ఇదిలా ఉంటే రిజర్వేషన్‌లకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే 50శాతంకు మించి రిజర్వేషన్లు ఉండవద్దని సుప్రింకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో చట్టసవరణ ద్వారా 50శాతం రిజర్వేషన్‌లలో ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది.. కేవలం కులం ఆధారంగా కాకుండా, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలన్న ఆరెస్సెస్‌ సూచనతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ పూర్తయితే.. రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం, ఐదు ఎకరాలకు మించకుండా భూమి, వెయ్యి చదరపు అడుగుల్లో ఇంటిస్థలం మించకుండా ఉండేవారికి ఈ రిజర్వేషన్‌లలో అవకాశం కల్పించనున్నారు.

అమలు చేయాలంటే సవరణలు చేయాల్సిందే..

కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 16లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తికి రూ.8లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం, 5 ఎకరాల కంటే తక్కువ సొంత వ్యవసాయ భూమి, వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు, నోటిపైడ్‌ పురపాలిక పరిధిలో 109 గజాల కంటే తక్కువ నివాస స్థలం, నోటిపైడ్‌ కాని మున్సిపాలిటీ పరిధిలో 209 గజాల కంటే తక్కువ స్థలం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వారిగా పరిగణిస్తారని తెలుస్తోంది. వీరికి రిజర్వేషన్‌ వర్తించే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాల నుంచి సమాచారం. ఇప్పటి వరకు రిజర్వేషన్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం పొందని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు అందుతాయని తెలుస్తోంది. కుల ఆధారిత రిజర్వేషన్లు 50శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఈ పది శాతం రిజర్వేషన్‌పై సవరణలను పార్లమెంటు ఆమోదిస్తే కోటా 50శాతం దాటి పోనుంది.

రాజకీయ పార్టీల్లో చర్చ..

అగ్రవర్ణాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సోమవారం కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోవటంతో దేశవ్యాప్తంగారాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది. పలువురు కేంద్ర కేబినెట్‌ 

నిర్ణయంపై మండిపడుతుండగా.. పలువురు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు కేంద్రం ఎన్నికల స్టంట్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని, పార్లమెంట్‌, రాజ్యసభల్లో ఎలాగూ అమలు కాదని నామమాత్రంగా ఈ విధానం అమల్లోకి తెస్తుందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు ఉన్న పార్టీలు కేంద్ర కేబినెట్‌ తాజా నిర్ణయంపై తర్జన బర్జన పడుతున్నారు. 10శాతం రిజర్వేషన్లు మద్దతుగా నిలిస్తే.. ఇటుపక్క బీసీ, ఎస్టీ, ఎస్సీ ఓటు బ్యాంకు పార్టీకి దూరమవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కేంద్ర కేబినెట్‌ నిర్ణయించిన అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్‌లపై ఆలోచనలో పడ్డాయి.

బిల్లుకు తమ పార్టీ ఆమోదం ఉంటుంది – కేజ్రీవాల్‌

అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ సవాల్‌ చేశారు. పార్లమెంట్‌లో సవరణ బిల్లును తీసుకురావాలని కేజీవ్రాల్‌ డిమాండ్‌ చేశారు. ఆ బిల్లుకు తమ పార్టీ ఆమోదం తెలుపుతుందన్నారు. మోదీ ప్రభుత్వం ఎన్నికల దృష్టిలోనే ఈ నిర్ణయాన్ని తీసుకుందని, అదో రాజకీయ ఎత్తుగడగా తెలుస్తోందని కేజీ విమర్శించారు. 

ఇదే సమయంలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా కూడా రిజర్వేషన్ల అంశంపై స్పందించారు. ఇదో జుమ్లా దాడి అని అన్నారు. దీంట్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయన్నారు. పార్లమెంట్‌ ఉభయసభల్లో ఈ బిల్లుకు ఆమోదం దక్కడం కష్టమే అని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

నాన్చుడు నిర్ణయం…బీజేపీ మునగడం ఖాయం..! – హరీష్‌ రావత్‌

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని కేంద్రం చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ స్పందించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇలాంటి ఆర్భాటమైన ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. చాలాకాలం నాన్చి ఇప్పుడు ఆర్భాటంగా ప్రకటన చేశారని, ఐదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేవిూ లేదని అన్నారు. అబద్ధాలతోనే ఇన్నేళ్లూ కాలం గడిపిన బీజేపీకి ప్రజలు చరమగీతం పాడతారని, ఈ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని ఆయన అన్నారు.

మోదీ అంబులపొదిలో ఇదే చివరి బాణం – హార్దిక్‌ పటేల్‌

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ స్పందించారు. మోదీ 'తూణీరంలో చివరిబాణం' ఇదేనని అన్నారు. ఇది ప్రజలకు ఇచ్చిన 'లాలీపాల్‌' అయితే అది తప్పే అవుతుందన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చడంలో విఫలమైన పక్షంలో ప్రజలే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్రం తీసుకున్న కోటా నిర్ణయానికి రాజ్యాంగ సవరణ కీలకమని, ఆ దిశగా అడుగు పడాల్సి ఉంటుందని హార్దిక్‌ పటేల్‌ అన్నారు.

పేదరిక నిర్మూలనకు పథకాలు తీసుకురావాలి – ఒవైసీ

మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్రం తీరును తప్పుపట్టారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌ లో ఒవైసీ స్పందిస్తూ.. 'దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకునిరావొచ్చు. కానీ రిజర్వేషన్లు అన్నవి న్యాయానికి ఉద్దేశించినది. ఆర్థిక కారణాల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వలేం' అని 

తేల్చిచెప్పారు. ప్రస్తుతం కేంద్రం 49.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలులేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here