విద్య, సేవ, మతం ముసుగులో… వేలకోట్లు స్వచ్ఛంద స్వాహా

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్ హైదరాబాద్)
మతం మత్తు లాంటిది. దానితో ఎన్ని జిమ్మిక్కులు అయినా చేయవచ్చు. విద్య పేరుతో వినసొంపుగా దోపిడీ జరిగింది.
సేవ ముసుగులో దేశానికి తరలి వచ్చే కోట్లాది రూపాయల నిధులు, దేశంతో పాటు తెలుగురాష్ట్రాలలో కూడా పక్కాగా పక్కదారి పట్టాయి. గత మూడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం 4,786 సంస్థలను రద్దు చేసింది. ఈ అక్రమార్కులు చట్టాలను తమ చుట్టాలుగా మలుచుకొని ఏకంగా గత ఐదేళ్ళలో ఇరవై వేల కోట్లు మింగేశారు. ఇవన్నీ విద్యా, సేవ, మతం ముసుగులో జరుగుతున్న సంఘటనలే. ఈ మొత్తం వ్యహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం జరిపిన దర్యాప్తు జరిపింది. ఈ అక్రమార్కుల చిట్టాను ‘ఆదాబ్ హైదరాబాద్’ చేతికి చిక్కింది.
తెలుగు రాష్ట్రాల్లో..: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇష్టారాజ్యంగా ఉన్న ఈ ఎన్జీఓ సంస్థలను కేంద్రం బాగానే కట్టడి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఈ సంస్థలు విద్యా, ఆర్థిక విశ్లేషణ పేరుతో కోట్లు కొల్లగొట్టాయి. ఇందులో ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కేంద్రంగా కొన్ని విద్యా సంస్థలు ఓ వ్యాపారంలా చేస్తున్నాయి. ఈ సంస్థల జాబితా ‘ఆదాబ్ హైదరాబాద్’ వద్దకు గుట్టుగా చేరింది. ఇందులో పేరెన్నికగన్న సంస్థలు ఉండటం గమనార్హం. ప్రతి సంస్థ గత ఐదేళ్ళలో కనీసం కోటి రూపాయలను స్వాహా చేసినట్లు కేంద్ర నిఘా సంస్థ ఆధారాలు సేకరించింది. కొన్ని సంస్థలు 10% నిధులు కూడా ఖర్చు చేయలేదు. సరికదా… సంబంధిత రికార్డులు కూడా లేవు. మానవత్వం మాటున కొన్ని, సేవా ముసుగులో కొన్ని అక్రమాలకు పాల్పడగా… మరికొన్ని విద్యా సంస్థల ముసుగులో కోట్లు కాజేశాయి. ఈ సంస్థలు ఒకవైపు విదేశీ నిధులు సేకరిస్తూనే.. మరోవైపు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫీజుల రూపంలో దండుకున్నాయి. ఇంకా దండుకుంటున్న సంఘటనలు ‘ఆదాబ్’ దృష్టికి వస్తున్నాయి. గతంలో క్రిమినల్ కేసులున్న వారు వారి జీవిత భాగస్వామి, రక్త సంబంధీకులతో ఈ కార్యాక్రమాలు చక్కబెడుతున్నారు. మరికొందరు బినావిూలతో ఈ తంతు నడిపిస్తున్నారు. ఆదాబ్ ఓ 20 విద్యాసంస్థలపై దృష్టి సారించింది. అన్ని చోట్ల ఏటా లక్షలాది రూపాయల ఆక్రమాలు జరుగుతున్నట్లు తెలిసింది. వీరిలో కొందరు సంఘంలో పెద్దమనుషుల ముసుగులో ఘరానా మోసగాళ్ళు ఉండటం విశేషం.
ఇదీ చట్టం: విదేశీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ చట్టం (ఎఫ్సిఆర్ఏ) అనేది భారతదేశంలో ఎన్జీవోలు ఇతరులకు నిర్దిష్ట వ్యక్తులు లేదా సంఘాలు అందించిన విదేశీ సహకారం (ముఖ్యంగా ద్రవ్య విరాళాన్ని) నియంత్రించడానికి పార్లమెంటు 1976లో ఆమోదిం చిన ఒక చట్టం. ఈ చట్టంలోని లొసుగులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం
2010లో సవరించింది.
ఇలా తెలిసింది:
దుర్వినియోగాల కోసం భారతదేశ జాతీయ ప్రయోజనాన్ని ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించిన కొందరు ఎన్జిఓల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమిళనాడులోని కుదుంకులం వద్ద అణు విద్యుత్ కేంద్రం, ఇండో-రష్యా జాయింట్ వెంచర్ కు వ్యతిరేకంగా నిధులు వేయడం ద్వారా వారు డబ్బును మళ్లించారని గుర్తించిన తర్వాత అనేక మంది అమెరికా-ఆధారిత ఎన్జీఒల నమోదును ¬ం మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్), ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ నిర్వహించిన ఒక సంస్థ.
గ్రీన్పీస్ భారతదేశం యొక్క ఎఫ్.సి.ఆర్.ఐ లైసెన్సు, పునరుద్ధరణ క్రింద ఉల్లంఘనలకు పాల్పడినందుకు, పౌర హక్కుల కార్యకర్త అయిన టీస్టా సెటల్వాద్ నిర్వహించిన రెండు ఎన్జీఓలను కూడా రద్దు చేసింది.
2016లో…:
17,773 సంస్థలను ఏఫ్.సి.ఆర్.ఏ లైసెన్సులను 2016లో కేంద్ర ప్రభుత్వం
రద్దు చేసింది. వారి పని మరియు పనితీరును సవిూక్షించిన తరువాత.
ఇందులో అనేక వడపోతల తరువాత 13,000 ఎన్జీఓలను చట్టబద్ధంగా నడుస్తున్నట్లు తేలాయి.
గత మూడేళ్ళల్లో 4,786 సంస్థలను కేంద్రం రద్ధు చేసింది. 14,800 బ్యాంక్ అకౌంట్లను కేంద్రం సీజ్ చేసింది.
ఆడించేది ఆడిటర్లే..!
కేంద్ర నిఘా సంస్థ తయారు చేసిన నివేదికలో ఆడిటర్ల పేర్లు ఉండటం ఆసక్తి రేకిస్తోంది. కోట్లాది రూపాయల విదేశీ నిధులను పక్కాగా ఖర్చు చేసినట్లు చూపడంలో పలువురి ఆడిటర్ల పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆడిటర్లు పెద్దమొత్తంలో నగదు, ఇతర ప్రయోజనాలు సంస్థ ప్రతినిధుల నుంచి
పొందినట్లు తెలిసింది.
కొసమెరుపు:
కేంద్ర నిఘా సంస్థ ఓ ఎన్జీఓను రద్దు చేస్తే మరో పేరుతో నిధులను సేకరించాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఇలాంటి సంస్థల గురించిన సమాచారం త్వరలోనే ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రత్యేక కథనాలను అందించనున్నది.