అసరా ఇవ్వని ప్రెండ్లీ పోలీస్‌…

0
  • స్నేహపూర్వక మాటలు లేవు…
  • బాధితులకు మర్యాద లేదు…
  • హజీపూర్‌ సంఘటనే అందుకు సాక్ష్యం…

బాధితుడికి న్యాయం కావాలి… అన్యాయం చేసిన వాడికి శిక్ష పడాలి… ఈ పని న్యాయపరంగా జరగాలంటే రక్షకభటులే రక్షణ కల్పించాలి.. ఆవేదనతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌ గడుపుతొక్కుతే కుటుంబ సభ్యుడిలా అతని సమస్య తెలుసుకొని ఓదార్పునివ్వాలని రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు, పాలనా యంత్రాంగం పదేపదే చెపుతున్నారు.. కాని ప్రభుత్వం చెపుతున్నదీ ఒకటి.. కిందిస్థాయి పోలీసులు చేస్తున్నదీ మరొకటి.. న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి.. వారిని కూర్చోబెట్టి, శాంతపరిచి వారికి జరిగిన నష్టం గురించి తెలుసుకొని మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వాలి.. కాని బాధితులకు ఆ ధైర్యం నేడు కరువవుతోంది.. తమ అన్యాయం జరిగిందని వెళ్లినా, తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా, తమ ఆస్తులు కాజేశారని ఆరోపించినా స్పందించే యంత్రాంగం నిశ్శబ్దంగా మారుతోంది. కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు ప్రవర్తన వల్లన అందరికి చెడ్డపేరు వస్తుందనే ఆరోఫణలు వెల్లువెత్తుతున్నాయి.. మొన్నటికి మొన్న హజీపూర్‌లో జరిగిన సంఘటన పోలీసుల నిర్లక్ష్యమేనని బాధితులు ఆరోపిస్తున్నారు.. నాలుగుసంవ్సరాల క్రితం పిర్యాధుపై స్పందిస్తే ఇంకొంతమంది ఆడపిల్లల ప్రాణాలు దక్కేవంటూ రోదిస్తున్నారు… కన్నబిడ్డలను కొల్పయిన తల్లిదండ్రుల ఆవేదనకు సమాధానం లేని ప్రశ్నలే కనిపిస్తున్నాయి..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బాధితులకు భరోసా కావాలి… వారికి జరిగిన అన్యాయానికి సరియైనా న్యాయం చేయాలంటే సమయం పట్టచ్చు. కాని మేమున్నామనే ధైర్యాన్ని మాత్రం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రతి బాధితుడికి పోలీసులు కల్పించాలి. అందరూ ఒకేలా ఉండకపోయినా కిందిస్థాయిలో పనిచేసే కొంతమంది పోలీసు అధికారులు నిర్లక్ష్యానికి హజీపూర్‌లో విద్యార్థుల సమాచారం దొరకక నెలలు గడిచిందని విద్యార్థినీల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఆరోతరగతి చదువుతున్న తమ కుమార్తె కల్పన ఆదృశ్యమైనప్పుడు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాధు చేయగా వారి దగ్గరి నుంచి పూర్తి వివరాలు సేకరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చే రక్షకభటులు ఎక్కడికి పోతుంది వస్తుందిలే అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని కల్పన తల్లిదండ్రులు అంటున్నారు. కంటికి రెప్పలా చూసుకునే కన్నకూతురు తప్పిపోయిన బాధలో ఉంటే పోలీసులు ప్రవర్తన మరింతగా కుంగదీసిందని చెపుతున్నారు. పోలీసులు కాళ్లవేళ్లా మీద పడుతే బలవంతగా రెండురోజులు వెతికినట్లు కనిపించినా ఆ తర్వాత మళ్లీ కేసు గురించి కాని మా పాప గురించి కాని పట్టించుకున్న దాఖలాలు లేవని కల్పన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనిచేసి బతికేమాకు న్యాయం లభించలేదు. పోలీసులు నుంచి స్వాంతన కలిగించే మాటలు రాలేదన్నారు. తమ గ్రామంలోని మహిళతో శ్రీనివాస్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత అతనిపై అనుమానం వచ్చిందని ఈ విషయం పోలీసులకు చెపుతే మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా అంటూ బాధలో ఉన్న మమ్ములనే పదేపదే ప్రశ్నించడంతో సమాధానం లేక వెనుదిరిగామన్నారు. ఆడపిల్లలు ఎక్కడ పట్టుబడ్డారని సమాచారం రాగానే వెళ్లేవారమని పోలీసులు చేయాల్సిన పనిని మేమే చేసామంటూ రోదించసాగారు. తమ కుమార్తె తప్పిపోయిందని పోలీస్‌స్టేషన్‌ వెళ్లినప్పుడు కూడా పోలీసుల నుంచి సరియైన స్పందన రాలేదంటున్నారు శ్రావణి తండ్రి నర్సింహులు. మా బిడ్డ చదువుకోవడానికి వెళ్లి తిరిగిరాకపోవడంతో గ్రామస్థులతో కలిసి వెతికామని గ్రామ శివారులో ఉన్నా చెట్టు, పుట్టా, పాడుపడ్డ బావి వెతికేసరికి మా బిడ్డ బ్యాగు బావిలో కనిపించిదన్నారు. మా బిడ్డ బ్యాగు బావిలో కనిపించిదని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదని అప్పుడు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ను కలిసి విన్నవించుకుంటే ఆయన ఆదేశించాకనే పోలీసులు గ్రామానికి వచ్చారన్నారు. పాఠశాల నుంచి శ్రావణి ఇంటికి వచ్చేటప్పుడు మధ్యదారిలో ఒక చింతచెట్టు కింద కూర్చోన్నట్లు తెలిసిందని దాని ఆధారంగా పోలీసులను వెళ్లి అక్కడున్న సిసి కెమెరా ఆధారంగా పరిశీలించమని అడుగుతే పెన్‌డ్రైవ్‌ తెచ్చుకుంటే అందులో రికార్డైన వీడియోను లోడ్‌ చేసి ఇస్తామని అప్పుడు మీరే తీరిగ్గా చూసుకోండి అంటూ దురుసుగా సమాధానం చెప్పారని గ్రామస్థులు తెలుపుతున్నారు. గ్రామంలోని శ్రీనివాసరెడ్డి వ్యవసాయ బావిలోని శ్రావణి శవం కూడా తామే కనుగొన్నామని అందులో మాత్రం పోలీసుల ఘనతేమి లేదన్నారు వారు ఆరోపించారు. పోలీసులంటే ప్రజలకు జవాబుదారీగా, స్నేహితుడిగా, కుటుంబ సభ్యుడిగా ఉండాలని ప్రతి వేదికలో గొప్పలు చెపుతుంటారు. కాని కిందిస్థాయిలో పోలీసుల ప్రవర్తన, వారి పనితీరు మాత్రం బాధితులను మరింత బాధలోకి నెట్టాలా ఉందన్నారు..

కిందిస్థాయిలో దురుసు ప్రవర్తనే…. పోలీసులు, ప్రజలు కలిసిపోవాలని ప్రభుత్వం ఒక పక్క విశ్వప్రయత్నాలు చేస్తుంది. పోలీస్‌ మిత్ర, ప్రెండ్లీ పోలీస్‌, ప్రజలతో మేమంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు కొత్త కొత్త పథకాలతో ప్రజలకు పోవాలని రాష్ట్ర పోలీస్‌ అధికారులు, ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. కాని కిందిస్థాయిలో మాత్రం అంతా విరుద్దంగానే జరుగుతోంది. ఎవరైనా అదృశ్యమైనప్పుడు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై అనేక విమర్శలోస్తున్నాయి. దాడులు జరిగినప్పుడే, కిడ్నాప్‌ జరిగిందని తెలిసినప్పుడు వేగంగా స్పందించే పోలీసులు అమ్మాయిలు కనబడటం లేదు, తప్పిపోయారని చెప్పినప్పుడు మాత్రం చూద్దాంలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బాధలో ఉండి పిర్యాధు పట్టుకొని వస్తున్న బాధితులతో సామరస్యకంగా మాట్లాడకపోగా వారి మాటల విధానం కూడా తేడాగా ఉంటుంది. అమ్మాయికి ప్రేమ కారణం కావచ్చు ముందు అక్కడికి వెళ్లి చూడండని సమాధానం చెప్పడంతో బాధితులు మరింత ఆవేదనకు గురవుతున్నారు. నాలుగేళ్ల క్రితం కల్పన కనిపించకుండా పోయినప్పుడే ఫిర్యాదుపై పోలీసులు లోతుగా విచారణ జరిపి ఉంటే ఇప్పుడు శ్రావణి, మనీషాల హత్యలు జరిగేవి కాదని విమర్శ ఉంది.

కనిపించకుండా పోయిన అమ్మాయిలు.. రోజురోజుకు అమ్మాయిల అదృశ్యాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిపై లోతైన విచారణ చేయాల్సిన పోలీస్‌ అధికారులు మాత్రం సంబంధం లేని సమాధానాలు చెపుతూ కేసులను ప్రేమ పేరుతో పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో అమ్మాయిలను అత్యాచారం చేసి హత్యచేసిన ఉదంతం తర్వాత ఏటా కనిపించకుండా పోయిన అమ్మాయిల పరిస్థితి ఏంటనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2017 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తప్పిపోయి ఇంకా దొరకని వారు 681 మంది ఉన్నారు. అందులో 468మంది బాలికలే ఉన్నారు. వారంతా ఏమైపోయారంటే మాత్రం ఎవ్వరి దగ్గర సమాధానమే లేదు. అత్యాచారం చేశారా, హత్య చేశారో, లేదా వేరే రాష్ట్రంలోని వ్యభిచార గృహాలకు అమ్మేశారా అనేది మాత్రం తెలియడం లేదు. తమ కూతురు తప్పిపోయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారు దరఖాస్తు చేసుకొని విచారణ జరుపుతున్నామంటున్నారే కాని ఎంత వరకు విచారణ చేశారు, ఏం చేస్తున్నారో మాత్రం సమాచారమే లేదు. హాజీపూర్‌ సంఘటనల మాదిరిగా ఇంకా ఎన్ని దురాగతాలు జరిగాయో, ఎంతమంది ఆడపిల్లలు బలయ్యారో మాత్రం సమాధానం లేని ప్రశ్నలే… ఇలాంటి వాటికి ఆదిలోనే అడ్డుకట్ట వేస్తే మరిన్ని సంఘటనలు జరగకుండా చూడొచ్చు.. అందుకు ముఖ్యంగా న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ గడపతొక్కే బాధితులను ప్రేమతో పలకరించేలా కిందిస్థాయి సిబ్బంది ఆలోచన సరళి మార్చేలా పై స్థాయి అధికారులు, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించేలా బాగుంటుందనేది బాధితులు అభిప్రాయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here