టీఆర్‌ఎస్‌కు ఈసీ నోటీసు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రగతి భవన్‌లో రాజకీయ పార్టీ సమావేశాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ పార్టీకి నోటిసులిచ్చామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల ప్రచార సభలకు అంతరాయం కలిగించే వ్యక్తులపై కొరడా ఝళిపించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 127 ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను రజత్‌కుమార్‌ ఆదేశించారు. సీఈవో రజత్‌ కుమార్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘1950 నుంచి పింక్‌ బ్యాలెట్‌ పేపర్లు వాడుతున్నారు. అయినా పింక్‌ బ్యాలెట్‌ పేపర్లపై కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ రంగు గులాబీ ఉన్నందున దీనిపై న్యాయ కోవిదుల అభిప్రాయం తెలుసుకుంటాం. నోటీసులకు సమాధానం చెప్పని వారి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘాని (ఈసీఐ)కి అందిస్తాం. సానుకూలంగా స్పందించకపోతే వారిని వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ చేయవచ్చు. 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. కొన్ని సందర్భాలలో రెండుకూడా విధించవచ్చు. సెక్షన్‌ 127కు సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చాయి. కరీంనగర్‌, మెదక్‌, ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలను అడ్డుకున్న వారిపై ఫిర్యాదులు చేశారు. రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం మంచిది కాదు. రాజకీయ సభల్లో డబ్బు పంపిణీ విషయం మా ద ష్టికి వచ్చింది. వీటిపై సెక్షన్‌ 171.బి ప్రకారం చర్యలు తీసుకుంటాం. 280 అదనపు కేంద్రాల కోసం సీఈసీకి లేఖ రాశాం. పోలింగ్‌ కేంద్రాల వివరాలపై కొంత స్ఫష్టత వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో జనావాసాలకు 2కి.మీ దూరంలో ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి. అంగ వైకల్యం ఉన్న వారి కోసం పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలు మారుస్తున్నాం. స్టార్‌ క్యాంపెనర్స్‌ విషయంలో జాతీయ పార్టీకి 40 మంది, రాష్ట్ర పార్టీలకు 20 మంది స్టార్‌ క్యాంపెయినర్లకు అనుమతి ఉందని’ రజత్‌ కుమార్‌ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here