Featuredస్టేట్ న్యూస్

ఎండుతున్న డొక్కలు..

  • రెండు నెలలుగా రాని జీతాలు..
  • ఆందోళనలో ఆర్టీసీ కుటుంబాలు..
  • నెలసరి జీతమే వారి జీవితం..
  • రోజులు గడుస్తున్నా పెరుగుతున్న అప్పులు..

ఆ డొక్కలు ఎండుతున్నాయి… ఆ కడుపులు కాలుతున్నాయి.. వారి కుటుంబాలు, వారి పిల్లల జీవితాలు కనీసం ఖర్చులకు రూపాయి లేకుండా అల్లాడిపోతున్నారు.. ఒకటి కాదు రెండు కాదు వారి నిరవధిక సమ్మె ముప్పై ఐదు రోజుల నుంచి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగుడికి ఇంచుమించుగా రెండునెలల జీతం రావాలి.. నెలసరి జీతంతో బతికే కుటుంబాలే ఆర్టీసీలో ఎక్కువగా ఉండడంతో వారి బతుకులు నేడు అగమ్యగోచరంగా మారిపోతున్నాయి. తమ హక్కుల కోసం, న్యాయపరంగా చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంచుమించుగా యాభైవేలకు పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులలో సగానికి పైగా వారికి వచ్చే చిన్న జీతంతో బతికేవారే ఎక్కువగా ఉన్నారు. ప్రతి నెల జీతం వస్తేనే వారి కుటుంబాలు, వారి పిల్లల స్కూల్‌ ఫీజులతో పాటు ఇతర వగైరా వగైరా ఖర్చులు వెళ్లదీసుకునే బతుకులు అవి.. ఇప్పుడు ఆ బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఏలా బతకాలో, ఏం చేయాలో అర్థంకాక కన్నీటి పర్యంతమవుతున్నారు. వారి బతుకులకు నేనున్నామని భరోసానిచ్చే చేతులు లేవు. ఆర్థికంగా వారిని ఆదుకునే మనుషులు కనబడటం లేదు.. రాష్ట్రం నుంచి కేంద్రానికి చేరిన ఆ సమ్మెకు ముగింపు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు వారి చేసిన పనికి జీతాలు వస్తాయో తెలియదు కాని తమ బతుకులు చిద్రంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె ఇంతవరకు ఒక కొలిక్కిరావడం లేదని ఇప్పటికే పదుల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలను నడిసంద్రంలో వదిలేసి వెళ్లిపోయారు. ప్రభుత్వం అనుసరించే విధానాలు, ఆర్టీసీ కార్మికుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారని చెపుతున్నారు. ఆర్టీసీ అడిగిన డిమాండ్లలో ప్రభుత్వ పెద్ద కూర్చొబెట్టి అలా కాదు ఇలా అంటూ నాలుగు మాటలతో నచ్చజెపుతే సమ్మె ఎప్పుడో ముగిసేదీ. పదుల సంఖ్యలో ప్రాణాలు బలిఅయ్యేదీ కాదు. నా మీద ఉద్యోగుల తిరుగుబాటా అని ఒకరు, బంగారు తెలంగాణలో ఇన్ని సమస్యలా అని మరొకరు మొండిగా పోటాపోటీగా ముందుకెళుతున్నారు. చివరకు ఆర్టీసీ కార్మికులను ఎవరూ పట్టించుకునే వారు లేక, ఆర్ధికంగా ఆదుకునే చేతులు లేక, ప్రభుత్వం సమ్మెపై సరియైన నిర్ణయం తీసుకోక గత రెండు నెలల నుంచి ఆర్టీసీ కార్మికుల పడుతున్న బాధలు చెప్పజాలకుండా ఉన్నాయి. ఎవరో ఒకరు రాజీపడి చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటేనే వారు బతికేలా ఉన్నారు. లేదా కావాలనే కాలయాపన చేస్తే మరెన్ని జీవితాలు కనుమరుగవుతాయో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

కరీంనగర్‌ జిల్లా డిపోకు చెందిన రామయ్య అనే కండక్టర్‌ గత పదిసంవత్సరాల నుంచి ఆర్టీసీలో పని చేస్తున్నాడు. ఆర్టీసీలో వచ్చిన ఉద్యోగంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతనికి వచ్చే పద్దెనిమిది వేల జీతంతో అతి కష్టం మీద జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై చిన్నచూపు చూస్తుందని సమ్మెకు పిలుపునిచ్చింది. వారం రోజుల్లో సమ్మె కొలిక్కి వచ్చి తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించినా ఉద్యోగులకు ప్రభుత్వం చర్చలకు పిలవడాన్ని మరిచిపోయి లేనిపోని ఆవేశపూరితమైన మాటలతో మరింత రెచ్చగొట్టినట్లు మాట్లాడుతోంది. యాభై వేల మంది ఉద్యోగాలు తీసేశామని ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దం కాదని ఘాటుగా స్పందిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యను మరింత రెట్టింపు చేయడంతో కార్మికులు ఆందోళన మొదలయ్యింది. కండక్టర్‌ జీవితాన్నే నమ్ముకొని ఆ నెలసరి జీతంతో బతికే రామయ్య బతుకు నేడు చిన్నాభిన్నంగా మారిపోయింది. రెండు నెలల నుంచి జీతాల రాకపోవడంతో కనీస అవసరాలకు కూడా రూపాయి లేదు. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. పిల్లలక కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. స్కూల్‌ ఫీజులు కట్టాలి. ఇంటి అద్దె చెల్లించక రెండు నెలలకు దగ్గరికొస్తుంది. సమ్మె ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు జీతాలు వస్తాయా అని రామయ్య అతని కుటుంబం కోటి కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇది రామయ్య ఒక్కడి పరిస్థితే కాదు. ఆర్టీసీ సమ్మెలో పాల్గన్న సగానికి పైగా కార్మికులు ఒక్క నెల జీతం రాకుండా పస్తులుండాల్సిన పరిస్థితిలో ఉన్నారు. చిన్న ఉద్యోగాలు, వారికొచ్చే చిన్న జీతంతోనే ఇన్నిరోజులు కుటుంబాన్ని పోషించిన వారు, సమ్మె ఇంకెన్నిరోజులు కొనసాగుతుందో, తమ ఉద్యోగాలు తమకు వస్తాయో, లేదో అనే ఆందోళనలో ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వమే చర్చలకు పిలిచి ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను నేరవేర్చాలని కోరుతున్నారు. కాని ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటూ కార్మికుల మాటలను లెక్కచేయడం లేదు.

ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తుందా…

ఆర్టీసీ సమ్మె కార్మికుల సమ్మెను ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ధిక్కారణ చేస్తూ, తిరుగుబాటు జెండా వేయడాన్ని ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలగ్గితే రేపు మరో ఉద్యోగ సంఘం తమ హక్కులు, డిమాండ్ల కోసం తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని అందుకు ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను పట్టించుకోవడం లేదని చెపుతున్నారు. ఆర్టీసీలో ఎక్కువశాతం మందికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల జీతం ఉంది. నెలసరి జీతం మీద బతికే కుటుంబాలు ఆర్టీసీలో చాలా ఉన్నాయి. రెండు నెలలు జీతం రావడం లేదంటే వారి కుటుంబాలు అల్లాడుతుంటాయి. కడుపుకాలి ఆర్థిక బాధలను తట్టుకోలేక ఆర్టీసీ కార్మికులే విధుల్లో చేరతారని ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల తరపున హైకోర్టు ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు వేసినా సరిగ్గా స్పందించడం లేదు. ఒకవేళ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే అప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లడానికి కూడా సిద్దమవుతోంది. సుప్రీంకోర్టులో వాదనలు, తీర్పు వచ్చేసరికి ఇంకా సమయం పడుతోందని అప్పుడు మరింత కాలయాపన చేస్తూ ఆర్టీసీ కార్మికులను మరింత ఆర్థికమాంద్యంలోకి నెట్టుతామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో పదుల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎంతోమంది అప్పులపాలై ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా కొన్ని రోజులు సమ్మెను పొడిగిస్తే వద్దన్నా ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగం కావాలంటే విధుల్లో చేరతారని చెపుతున్నారు. ఇన్నిరోజులు చేసిన సమ్మె నీరుగారిపోవడమే కాకుండా ప్రభుత్వం విజయం సాధించనట్లు అవుతోంది. మరొకరు సమ్మె చేయడానికి భయపడుతారనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్నాకాని ఇక్కడ ఆర్టీసీ కార్మికులు బతుకులు మాత్రం రోజురోజుకు ఆధ్వాన్నంగా మారిపోతున్నాయి. వారి కడుపులు ఎండిపోతున్నాయి. డొక్కలు కాలిపోతున్నాయి.. ప్రభుత్వమే చర్చలకు ముందడుగు వేసి ఆర్టీసీ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. హైకోర్టు సైతం ఆర్టీసీకి మద్దతుకు ఉండడంతో సమ్మె ఒక కొలిక్కివచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిదనే అభిప్రాయంతో కార్మికులతో పాటు ప్రయాణీకులు ఎదురుచూస్తున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close